Anand Mahindra: సచిన్‌తో పోటీపడదాం.. బిల్‌గేట్స్‌తో ఆనంద్‌ మహీంద్రా!

బిల్‌గేట్స్‌ ఓ ఎలక్ట్రిక్‌ ఆటో నడిపిన ఓ వీడియోను ఆనంద్‌ మహీంద్రా షేర్‌ చేశారు. సచిన్‌ తెందూల్కర్‌, మీరు, నేను కలిసి 3 వీలర్‌ రేసులో పాల్గొందామంటూ ప్రతిపాదించారు.

Published : 06 Mar 2023 16:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌ పర్యటనలో భాగంగా మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌(Bill Gates).. ఇక్కడి రోడ్లపై ఓ ఎలక్ట్రిక్‌ ఆటో రిక్షా(Electric Rickshaw) నడిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన నెట్టింట పోస్ట్‌ చేయగా.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా(Anand Mahindra) స్పందించారు. మరోసారి భారత్‌కు వచ్చిన సమయంలో మీరు, నేను, సచిన్‌ తెందూల్కర్(Sachin Tendulkar)‌ కలిసి.. 3- వీలర్‌ డ్రాగ్‌ రేస్‌(Drag Race)లో పోటీ పడదామంటూ ప్రతిపాదించారు.

ఒకసారి ఛార్జింగ్‌తో దాదాపు 131 కి.మీల వరకు ప్రయాణించే ఓ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను నడిపానంటూ బిల్‌గేట్స్‌ సంబంధిత వీడియోను తాజాగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఆయన ఆటో నడుపుతోన్న సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో ‘చల్తీ కా నామ్ గాడీ’ అనే బాలీవుడ్‌ పాట వస్తోంది. ‘ఆవిష్కరణల విషయంలో భారత్‌ అభిరుచి ఆశ్చర్యపరుస్తోంది. రవాణా పరిశ్రమకు సంబంధించి కర్బనరహిత ప్రయత్నాలకు మహీంద్రా వంటి కంపెనీల సహకారం స్ఫూర్తిదాయకం’ అని బిల్‌గేట్స్ ప్రశంసించారు.

ఈ పోస్ట్‌ను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసిన మహీంద్రా.. ఇది ‘చల్తీ కా నామ్‌ బిల్‌గేట్స్‌ కి గాడీ’ అని పేర్కొన్నారు. ట్రయోని(ఎలక్ట్రిక్‌ ఆటో రిక్షా)ని పరిశీలించడం సంతోషంగా ఉందన్నారు. ‘మీ తదుపరి భారత పర్యటనలో.. మీరు, నేను, సచిన్‌ తెందూల్కర్‌.. మన ముగ్గురి మధ్య 3- వీలర్ ఈవీ డ్రాగ్ రేస్ ఉండేలా చూడండి’ అని ట్వీట్‌ చేశారు. ఇది కాస్త వైరల్‌గా మారింది. బిల్‌గేట్స్‌ రూపంలో భారత్‌కు అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్‌ దొరికినట్లు ఓ నెటిజన్‌ కామెంట్‌ పెట్టారు. మీ ముగ్గురి రేసింగ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ మరొకరు స్పందించారు.

బిల్‌గేట్స్‌ తన భారత పర్యటనలో.. ట్రాన్స్‌నేషనల్ బ్రిడ్జ్ ఛాంపియన్‌షిప్‌(కార్డ్స్‌తో ఆడే ఆట)లో చరిత్ర సృష్టించిన అన్షుల్ భట్‌(13)నూ కలిశారు. 'అన్షుల్‌ను కలవడం, మా ఇద్దరికి ఇష్టమైన కాలక్షేపం(బ్రిడ్జ్) గురించి చర్చించడం సరదాగా ఉంది’ అని ఓ పోస్ట్‌ పెట్టారు. అతనితో కలిసి ఆడేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. గతేడాది ఇటలీలో జరిగిన ట్రాన్స్‌నేషనల్ బ్రిడ్జ్ ఛాంపియన్‌షిప్‌ అండర్‌-16 విభాగంలో ముంబయికి చెందిన అన్షుల్ భట్‌ టైటిల్‌ గెలిచి.. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ఆ సమయంలోనూ బిల్‌గేట్స్‌ అతన్ని అభినందించారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని