Published : 28 Jun 2022 02:11 IST

Deepest Shipwreck: ప్రపంచంలోనే అత్యంత లోతులో లభ్యమైన శిథిల నౌక ఇదే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మునిగిపోయిన అమెరికాకు చెందిన ఓ యుద్ధనౌక ఆచూకీ తాజాగా ఫిలిప్పిన్స్‌ సమీపంలో లభ్యమైంది. సముద్రంలో ఏకంగా దాదాపు ఏడు వేల మీటర్ల లోతులో దీన్ని గుర్తించడం గమనార్హం. ప్రపంచంలో ఇప్పటివరకు అత్యంత లోతు లభ్యమైన నౌక ఇదేనని అమెరికాకు చెందిన పరిశోధకుల బృందం తెలిపింది.

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఫిలిప్పీన్‌ సముద్రంలో అమెరికా- జపాన్‌ నౌకాదళాల మధ్య భారీ స్థాయిలో ‘బ్యాటిల్‌ ఆఫ్‌ లేటె’ జరిగింది.  1944లో తమ కాలనీగా ఉన్న ఫిలిప్పీన్స్‌ను జపాన్ ఆక్రమణ నుంచి విముక్తి చేసేందుకుగానూ అమెరికా నేవీ దళాలు తీవ్రంగా పోరాడాయి. ఈ క్రమంలోనే అక్టోబరు 25న సమర్ ద్వీపం వద్ద జరిగిన దాడుల్లో.. అగ్రరాజ్యానికి చెందిన నాలుగు యుద్ధ నౌకలు మునిగిపోయాయి. అందులో ‘యూఎస్‌ఎస్‌ శామ్యూల్ బీ రాబర్ట్స్’ ఒకటి.

అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన సముద్రగర్భ సాంకేతిక సంస్థ ‘కాలడాన్ ఓషియానిక్’.. ఇటీవల ఎనిమిది రోజులపాటు అన్వేషణ సాగించి సముద్రం అడుగున ఉన్న ‘శ్యామ్యూల్‌ బీ’ని గుర్తించింది. నౌక ఫొటోలు, వీడియోలు తీసింది. నౌక పరికరాలు, టార్పెడో లాంచర్లు, గన్ మౌంట్‌ తదితర వస్తువులు ఇందులో కనిపించాయి. ‘6,895 మీటర్ల లోతులో నౌక బయటపడింది. ఇప్పటివరకు అత్యంత లోతులో వెలుగుచూసిన ఓడ ఇది’ అని సంస్థ వ్యవస్థాపకుడు విక్టర్ వెస్కోవో ట్వీట్ చేశారు. ఈ వార్‌షిప్‌.. జపాన్ దళాలతో తుదకంటా పోరాడినట్లు తెలిపారు.

అమెరికా నేవీ రికార్డుల ప్రకారం.. ‘శ్యామ్యూల్‌ బీ’ ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు అందులోని సిబ్బంది దాదాపు మూడు రోజుల పాటు సాయం కోసం ఎదురుచూశారు. మొత్తం 224 మంది సిబ్బందిలో 89 మంది మరణించారు. చాలా మంది గాయాలు, షార్క్ దాడుల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మరో నౌక ‘యూఎస్‌ఎస్‌ జాన్‌స్టన్’ను వెస్కోవో బృందమే 2021లో దాదాపు 6,500 మీటర్ల లోతులో కనుగొంది. ఇంకో వార్‌ షిప్‌ ‘యూఎస్‌ఎస్‌ గాంబియర్ బే’ కోసం ఏడు వేల మీటర్లకుపైగా లోతులో వెతికినా.. ఫలితం లేకపోయింది. ‘యూఎస్‌ఎస్‌ హోయెల్’ ఎక్కడ మునిగిపోయిందో సరైన సమాచారం లేకపోవడంతో దాని కోసం అన్వేషించలేదు. ఇదిలా ఉండగా.. చారిత్రక ‘టైటానిక్’ ఓడ శిథిలాలు దాదాపు నాలుగు వేల మీటర్ల లోతు నీటిలో లభ్యమయ్యాయి.Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని