Viral Video: విచిత్రం.. ఒకే ఇల్లు, బెడ్‌రూమ్‌ భారత్‌లో.. కిచెన్‌ మయన్మార్‌లో!

నాగాలాండ్‌ రాష్టంలో ఓ ఇంటి వారు ప్రతిరోజూ మయన్మార్‌లో భోజనం చేస్తూ.. భారత్‌లో నిద్ర పోతున్నారు. ఆ ఇంటికి సంబంధించిన వీడియోను ఆనంద్‌ మహీంద్రా రీట్వీట్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. 

Updated : 12 Jan 2023 22:04 IST

కోహిమా: సాధారణంగా ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఒక ఊళ్లో భోజనం చేస్తే.. నిద్రకు మరో ఊరు చేరుకుంటాం. అదే విమాన ప్రయాణాల్లో దేశాలు దాటేస్తాం. కానీ, ఈశాన్య భారతంలోని నాగాలాండ్‌ రాష్టంలో ఓ ఇంటి వారు మాత్రం రోజూ మయన్మార్‌లో భోజనం చేసి, భారత్‌లో నిద్ర పోతున్నారు. అదెలా సాధ్యం? అనేగా మీ సందేహం. వివరాల్లోకి వెళితే.. నాగాలాండ్‌లోని మోన్‌ జిల్లా లుంగ్వా అనే గ్రామంలో ఆంగ్‌ అనే వ్యక్తి  ఇంటి మధ్య నుంచి భారత్‌-మయన్మార్‌ విభజన రేఖ వెళ్లింది. దీంతో ఇంటి వంటగది మయన్మార్‌ భూభాగం పరిధిలోకి, బెడ్‌రూమ్‌ భారత్‌ పరిధిలోకి వస్తోంది. దీంతో వారు భోజనం మయన్మార్‌లో చేస్తూ.. భారత్‌లో నిద్రపోతున్నారు.

ఆంగ్‌ ఇంటికి సంబంధించిన వీడియోను నాగాలాండ్  విద్య, గిరిజన శాఖ మంత్రి తెమ్జెన్‌ ఇన్మా ట్విటర్‌లో షేర్‌ చేయగా..  ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా రీట్వీట్ చేశారు. ‘‘సరిహద్దులు ఎంత విచిత్రంగా ఉంటాయనే దానికి ఇది నిదర్శనం. కలర్‌ఫుల్‌గా ఉంది. కృత్రిమమైన వ్యత్యాసాలు’’ అంటూ ఆనంద్‌ మహీంద్రా కామెంట్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ‘నిజమా? ఇప్పటిదాకా ఈ విషయం మాకు తెలియదు’, ‘ నిజంగా వింతే’, ‘ఈ తెగకు చెందిన వారి జీవన విధానం మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు వారికి కల్పించాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

లోంగ్వా గ్రామంలో కొణ్యాక్‌ నాగా తెగకు చెందిన వారు నివసిస్తుంటారు. వారికి రెండు దేశాల పౌరసత్వం ఉంటుంది. ఈ గ్రామంలోని స్థానికులు కొందరు భారత్‌లో వ్యాపారం చేస్తుంటే.. మరికొందరు మయన్మార్‌ సైన్యంలో పనిచేస్తుంటారు. భారత్‌లో ఈ తెగ వారిని హెడ్ హంటర్స్‌గా పిలుస్తారు. కొన్ని దశాబ్దాల క్రితం తమ శత్రువులుగా భావించిన వారి తలలు తెగ నరికి తీసుకొచ్చి ఒంటిపై పచ్చబొట్టు వేయించుకోవడాన్ని సంప్రదాయంగా భావించేవారు. కాలక్రమంలో ఆ సంప్రదాయానికి వారు స్వస్తి పలికి, సాధారణ జీవనం సాగిస్తున్నారు. 



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని