Beauty Pageant: అందాల పోటీల్లో భార్యకు అన్యాయం జరిగిందని.. కిరీటాన్ని ముక్కలు చేశాడు!

అందాల పోటీలో తన భార్య రన్నరప్‌గా నిలవడం తట్టుకోలేని ఓ వ్యక్తి.. స్టేజీపైకి దూసుకొచ్చి కిరీటాన్ని ధ్వంసం చేయడం గమనార్హం. బ్రెజిల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 30 May 2023 21:40 IST

బ్రసీలియా: బ్రెజిల్‌లో ఓ అందాల పోటీ (Beauty Pageant) తుది దశకు చేరుకుంది. చివరకు స్టేజీపై ఇద్దరే మిగిలారు. ఈ క్రమంలోనే ఉత్కంఠకు తెరదించుతూ విజేతను ప్రకటించారు. ఓ మహిళ.. కొత్త విజేతకు కిరీటం అలంకరించేందుకు ముందుకొచ్చారు. అంతలోనే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఒక్కసారిగా స్టేజీపైకి దూసుకొచ్చి ఆ కిరీటాన్ని లాక్కొని, నేలకేసి విసిరికొట్టాడు. అదీ రెండుసార్లు. దీంతో ఒక్కసారిగా అంతా నిశ్చేష్టులయ్యారు. దీనికి కారణం.. అతని భార్య రెండో స్థానానికి పరిమితం కావడమే. బ్రెజిల్‌ (Brazil)లో ఇటీవల నిర్వహించిన ‘మిస్‌ గే మాటో గ్రాసో- 2023 (Miss Gay Mato Grosso 2023)’ అందాల పోటీల సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించి వీడియో నెట్టింట వైరల్‌ (Viral Video)గా మారింది.

ఈ పోటీల్లో నథాలీ బెకర్‌, ఇమాన్యుయెల్‌ బెలీని ఫైనల్‌కు చేరుకున్నారు. చివరకు బెలీని విజేతగా నిలిచారు. దీంతో ఆమెకు కిరీటాన్ని అలంకరించే లోపే.. బెకర్‌ భర్త స్టేజీపైకి దూసుకొచ్చాడు. ఆగ్రహంతో కిరీటాన్ని లాక్కొని, రెండుసార్లు నేలపైకి విసిరికొట్టాడు. దీంతో అది కాస్త ధ్వంసమైంది. అంతటితో ఆగకుండా అక్కడున్న వారిపై అరుస్తూ.. తన భార్యను పక్కకు లాక్కెళ్లాడు. ఈ హఠాత్పరిణామంతో వీక్షకులు షాక్‌కు గురయ్యారు. అనంతరం.. అక్కడున్న భద్రతాసిబ్బంది జోక్యం చేసుకుని, అతన్ని పక్కకు తీసుకెళ్లారు. మరోవైపు.. నిర్వాహకులు ఈ ఘటనను ఖండించారు. ఫలితం విషయంలో తన భార్యకు అన్యాయం జరిగిందని అతను భావించాడని, కానీ.. న్యాయనిర్ణేతలు సరైన నిర్ణయమే తీసుకున్నారని ఓ ప్రకటనలో తెలిపారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని