Viral Videos: బుల్డోజరే అంబులెన్స్‌గా..! మధ్యప్రదేశ్‌లో విస్మయకర ఘటన

ప్రమాదాల్లో గాయపడిన వారిని సాధారణంగా అంబులెన్సు(Ambulance)లో ఆస్పత్రికి తరలిస్తారు. కానీ.. మధ్యప్రదేశ్‌(Madhyapradesh)లో మాత్రం ఓ క్షతగాత్రుడిని బుల్డోజర్‌(Bulldozer) బ్లేడ్‌లో పెట్టి తీసుకెళ్లడం గమనార్హం....

Published : 14 Sep 2022 01:23 IST

భోపాల్‌: ప్రమాదాల్లో గాయపడిన వారిని సాధారణంగా అంబులెన్సు(Ambulance)లో ఆస్పత్రికి తరలిస్తారు. కానీ.. మధ్యప్రదేశ్‌(Madhyapradesh)లో మాత్రం ఓ క్షతగాత్రుడిని బుల్డోజర్‌(Bulldozer) బ్లేడ్‌లో పెట్టి తీసుకెళ్లడం గమనార్హం. కారణం.. అంబులెన్సును సంప్రదించి అరగంటకుపైగా గడిచినా దాని జాడలేకపోవడమే! అప్పటికే రక్తస్రావంతో విలవిల్లాడుతోన్న అతన్ని స్థానికులు.. చేసేదేమీ లేక చివరకు బుల్డోజరులో తరలించారు. రాష్ట్రంలోని కట్ని(Katni)లో ఈ విస్మయకర ఘటన వెలుగుచూసింది.

ఇక్కడి గైర్‌తలాయ్‌ ప్రాంతానికి చెందిన మహేశ్‌ బర్మన్‌ అనే వ్యక్తి ద్విచక్ర వాహన ప్రమాదంలో గాయపడ్డాడు. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించేందుకు స్థానికులు అంబులెన్స్‌కు ఫోన్‌ చేయగా.. అరగంట గడిచినా రాలేదు. అప్పటికే కాలు విరిగి, రక్తస్రావం అవుతుండటంతో.. అక్కడున్నవారు అతన్ని ఓ బుల్డోజర్‌ బ్లేడ్‌లో పడుకొబెట్టి ఆస్పత్రికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఎట్టకేలకు స్థానిక వైద్యశాలలో అతనికి ప్రథమ చికిత్స అందింది. మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి రిఫర్‌ చేశారు.

ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్‌లో అంబులెన్సుల నిర్వహణపై పెద్దఎత్తున విమర్శలు ఉన్నాయి. వాహనాల సంఖ్యను పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. సమస్య కొనసాగుతోందని స్థానికులు వాపోతున్నారు. ‘అటల్ బిహారీ వాజ్‌పేయీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అండ్ పాలసీ అనాలిసిస్’ పరిశోధకుల వివరాల ప్రకారం.. రాష్ట్రంలో డయల్ 108 అంబులెన్స్ సర్వీస్ నిర్వహణ కోసం ప్రభుత్వం ఏటా రూ.220 కోట్లు ఖర్చు చేస్తోంది. అయినప్పటికీ.. ప్రతి జిల్లాలో రోజు 53 కేసులకు అంబులెన్స్‌ సేవలు అందడం లేదని పేర్కొన్నారు. ఏటా 10 లక్షల మంది రోగులు ప్రైవేటు అంబులెన్స్‌లను ఆశ్రయించాల్సి వస్తోందన్నారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని