Indigo Cute Fee: ‘క్యూట్‌గా ఉంటే ఫీజులేస్తారా’.. ఇండిగో ఫీజుపై ఫన్నీ రియాక్షన్స్‌!

Indigo Cute Fee: తాజాగా ఇండిగో టికెట్‌ ధరకు సంబంధించిన ఓ ప్రయాణికుడు చేసిన పోస్ట్‌ కూడా ఇలానే వైరల్‌గా మారింది. దీనిపై బోలెడు ఫన్నీ రియాక్షన్స్‌ వచ్చాయి. అవేంటో చూసేయండి..

Published : 11 Jul 2022 17:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌మీడియాలో ఎప్పుడు ఏది వైరల్‌గా మారుతుందో చెప్పలేం. నలుగురికీ తెలిసిన విషయాన్నో, ఎవరూ గుర్తించని దాన్నో కొందరు ఇట్టే పట్టుకుంటారు. దానికి తమదైన వెటకారం జోడిస్తే ఇక అంతే.. ఆ పోస్ట్‌ వైరల్‌గా మారిపోతుంటుంది. తాజాగా ఇండిగో టికెట్‌ ధరకు సంబంధించిన ఓ ప్రయాణికుడు చేసిన పోస్ట్‌ ఇలానే వైరల్‌గా మారింది. దీనిపై బోలెడు ఫన్నీ రియాక్షన్స్‌ వచ్చాయి. అవేంటో చూసేయండి..

శంతను అనే ప్రయాణికుడు ఇటీవల ఇండిగో విమానంలో ప్రయాణించాడు. ప్రయాణ టికెట్‌లో ప్రైస్‌ బ్రేకప్‌ను చెక్‌ చేయగా.. అందులో అతడికి క్యూట్‌ ఫీ అని కనిపించింది. దానికి రూ.100 వసూలు చేసినట్లు టికెట్‌లో పేర్కొన్నారు. దీనికి అతడు హాస్యాన్ని జోడించి.. ‘‘వయసుతో పాటు నా అందమూ పెరుగుతోందని నాకు తెలుసు.. అంతమాత్రాన ఇండిగో దానికి నా నుంచి ఫీజు వసూలు చేస్తుందని అనుకోలేదు’’ అంటూ సరదాగా ట్వీటాడు. అంతే ఆ పోస్ట్‌ వైరల్‌గా మారింది. కొందరు ఆ ఫీజు వెనుక ఉద్దేశాన్ని తెలిపే ప్రయత్నం చేయగా.. మరికొందరు దానికి సెటైర్లు జోడిస్తూ కామెంట్లు పెట్టారు.

క్యూట్‌ ఫీ అంటే.. కామన్‌ యూజర్‌ టెర్మినల్‌ ఎక్విప్‌మెంట్‌ (CUTE). విమానాశ్రయంలోని మెటల్‌ డిటెక్టర్‌ మెషిన్‌, ఎస్కలేటర్‌, ఇతర సదుపాయాలు వినియోగించినందుకు ఈ ఫీజు వసూలు చేస్తారు. దీన్ని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా వసూలు చేస్తుంది. ఇదే విషయాన్ని శంతను పెట్టిన ట్వీట్‌కు ఓ యూజర్‌ కామెంట్‌గా పెట్టారు. వాస్తవానికి అక్కడ క్యూట్‌ అనే పదాన్ని క్యాపిటల్‌ లెటర్స్‌లో రాయల్సి ఉందని, అది సంక్షిప్త నామం అని పేర్కొన్నారు. మరికొందరు మాత్రం ఫన్నీగా స్పందించారు.

  • తన వద్ద సీట్‌ ఫీజు కూడా వేస్తున్నారంటూ ఓ వ్యక్తి ట్వీట్‌ చేయగా..  దానికి రిప్లయ్‌గా ‘నేను నిల్చునే వెళ్తా.. సీటు ఫీజు తీసేస్తారా గురువుగారూ!’ అంటూ మరో నెటిజన్‌  కామెంట్‌ పెట్టారు.
  • ‘భవిష్యత్‌లో సెక్యూరిటీ ఫీజు, బోర్డింగ్‌ పాస్‌ ఫీజు, పైలట్‌, కో పైలట్‌ సేవలకు ఫీజు, టాయిలెట్‌ వాడినందుకు కూడా ఫీజు వసూలు చేస్తారేమో’ అంటూ ఇంకో యూజర్‌ కామెంట్‌ చేశాడు.
  • ‘విమానంలో ఆక్సిజన్‌ పీల్చినందుకు కూడా ఫీజులు వసూలు చేస్తారేమో’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ పెట్టాడు.
  • ‘నన్నెవరైనా క్యూట్‌గా ఉన్నావని చెబితే వంద రూపాయలు ఇవ్వడానికి సిద్ధమే. కానీ, ఎయిర్‌పోర్ట్‌ సెక్యూరిటీకి నేనెందుకు చెల్లించాలి’ అని మరో యూజర్‌ ఫన్నీగా ప్రశ్నించాడు.
  • ‘ఇండిగో ఎయిర్‌ హోస్టెస్‌ను చూడడం మానేయండి.. లేదంటే దానికీ ఫీజులు వసూలు వేస్తారు’ అంటూ ఫన్నీగా కామెంట్‌ పెట్టాడు ఓ యూజర్‌.




గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని