Viral video: తల్లి సమయస్ఫూర్తి.. బిడ్డను ఎలా కాపాడుకుందో చూడండి!

ఓ భారీ ప్రమాదం నుంచి ఓ తల్లి తన బిడ్డను కాపాడుకున్న తీరు తాజాగా ప్రశంసలందుకుంటోంది.......

Published : 27 Apr 2022 01:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పిల్లల క్షేమం కోసం తల్లిదండ్రులు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. వారేదైనా ప్రమాదంలో చిక్కుకుంటే కాపాడేందుకు తమ ప్రాణాలపైనా అడ్డుపెడుతుంటారు. ఓ భారీ ప్రమాదం నుంచి ఓ తల్లి తన బిడ్డను కాపాడుకున్న తీరు తాజాగా ప్రశంసలందుకుంటోంది. ఈ ఘటన గతంలోనే జరిగినప్పటికీ.. ఇంగ్లాండ్‌కు చెందిన ప్రముఖ క్రికెటర్‌ జోఫ్రా ఆర్చర్‌ సోమవారం ఆ వీడియోను ట్విటర్‌లో పంచుకోవడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

వియాత్నాంలోని నామ్‌దిన్హ్‌ ప్రాంతంలో ఓ వ్యక్తి తన భార్య, పాపతో ద్విచక్రవాహనంపై వెళుతున్నారు. అయితే వారి వాహనాన్ని ఓ కారు ఓవర్‌టేక్‌ చేస్తూ.. వారిని తాకుతూ దూసుకెళ్తుంది. దీంతో బైక్‌ వెనక కూర్చున్న తల్లి, పాప కిందపడిపోయారు. అయితే అదే సమయంలో ఎదురుగా ఓ భారీ ట్రక్కు వస్తూ ఉండటంతో ఆ తల్లీకుమార్తె ట్రక్కు కింద పడిపోయినట్లే అనిపిస్తుంది. కానీ చక్రాల కింద పడిపోబోతున్న కుమార్తెను చాకచక్యంగా వెనక్కి లాగిన తల్లి.. తానూ ప్రమాదం నుంచి బయటపడింది. రెప్పపాటులో జరిగిన ఈ ఘటనలో ఇరువురికి వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పినట్లయింది.

అయితే ఈ ఘటన 2019లోనే జరగ్గా ఇందుకు సంబంధించిన వీడియోను జోఫ్రా ఆర్చర్‌ తాజాగా ట్విటర్‌లో పంచుకున్నాడు. ‘మదర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అంటూ కొనియాడాడు. కాగా ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇప్పటికే 4.4 మిలియన్ల మంది వీక్షించారు. గాయాల కారణంగా ఆర్చర్‌ ప్రస్తుతం క్రికెట్‌కు దూరమయ్యాడు. రెండు శస్త్రచికిత్సలు జరగగా కోలుకుంటున్నాడు. భారత్‌లో జరిగే మెగా వేలంలో ఆర్చర్‌ను ముంబయి జట్టు రూ.8 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.




గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని