Karnataka: ప్రిన్సిపల్‌పై చేయి చేసుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్‌!

కాలేజీ ప్రిన్సిపల్‌ను ఓ ఎమ్మెల్యే లాగి చెంప దెబ్బకొట్టిన ఘటన కర్ణాటకలోని మాండ్యలో చోటు చేసుకుంది.

Published : 22 Jun 2022 20:55 IST

బెంగళూరు: కాలేజీ ప్రిన్సిపల్‌పై స్థానిక ఎమ్మెల్యే(MLA) చేయి చేసుకున్న ఘటన కర్ణాటక(Karnataka)లోని మాండ్యలో చోటు చేసుకుంది. జూన్‌ 20న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే..

కర్ణాటకలోని జనతాదళ్‌(Janata Dal) (సెక్యూలర్‌) పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎం. శ్రీనివాస్ నల్వాడీ కృష్ణ రాజా వడియార్‌ ఐటీఐ కాలేజీ సందర్శనకు జూన్‌ 20న వెళ్లారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి కాలేజీ ప్రిన్సిపల్‌ను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కంప్యూటర్‌ ల్యాబ్‌కు సంబంధించిన అభివృద్ధి పనులపైనా ప్రిన్సిపల్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహానికి గురయ్యారు. దీంతో అందరు చూస్తుండగానే ఆయనను తిట్టారు. కోపం ఆపుకోలేక ప్రిన్సిపల్‌పై చేయి చేసుకున్నారు. ఈ సంఘటన మొత్తం వీడియోల్లో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

అయితే, ఈ సంఘటనపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ఎమ్మెల్యే తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరూ చూస్తుండగానే ప్రిన్సిపల్‌పై చేయి చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ప్రిన్సిపల్‌ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. కాలేజీ సిబ్బంది కూడా ప్రిన్సిపల్‌కు మద్దతుగా నిలవాలని ట్వీట్లు చేస్తున్నారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని