Published : 24 Jul 2022 23:56 IST

Viral Videos: భవనంపై నుంచి పడిన చిన్నారిని కాపాడి.. రియల్‌ హీరోగా నిలిచాడు!

బీజింగ్‌: చైనాలో ఓ వ్యక్తి చేసిన సాహసానికి ప్రజల నుంచి పెద్దఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికులు అతన్ని ‘హీరో’గా కొనియాడుతున్నారు. అయిదు అంతస్తుల భవనంపైనుంచి ప్రమాదవశాత్తు కిందపడిపోయిన ఓ చిన్నారిని అతను తన చేతులతో ఒడిసి పట్టుకుని  ప్రాణాలు కాపాడి రియల్‌ హీరోగా నిలిచాడు. జిజియాంగ్‌ ప్రావిన్స్‌లోని టాంగ్జీయాంగ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్‌ సైతం ఈ క్లిప్‌ను ట్విటర్‌ వేదికగా పంచుకుంటూ.. ‘మన మధ్య ఉన్న హీరో’ అని క్యాప్షన్‌ పెట్టారు.

ఈ ఘటనలో రెండేళ్ల చిన్నారి తొలుత అయిదంతస్తుల మీది నుంచి మొదటి అంతస్తులోని టెర్రస్‌పైనున్న రేకుల నిర్మాణంపై ప్రమాదవశాత్తు పడిపోయింది. పెద్ద శబ్దం రావడంతో.. అప్పటివరకు కింద నిలబడి ఫోన్‌లో మాట్లాడుతున్న షెన్ డాంగ్‌ అనే వ్యక్తి వెంటనే అప్రమత్తమయ్యాడు. చిన్నారిని కాపాడేందుకు పక్కనే ఉన్న మహిళతో కలిసి భవనం వైపు పరుగెత్తాడు. అంతలోనే ఆ చిన్నారి పట్టుతప్పి కిందపడటంతో.. అతను తన ఫోన్‌ను వదిలేసి.. రెండు చేతులతో పాపను పట్టుకున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయ్యాయి.

అనంతరం ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించగా.. కాళ్లు, ఊపిరితిత్తులకు గాయాలయ్యాయని.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించినట్టు స్థానిక మీడియా పేర్కొంది. ‘నిజం చెప్పాలంటే.. ఆ సమయంలో నేనేమీ పట్టించుకోలేదు. నా చేతులకు ఏమైనా అవుతుందా అనేది కూడా చూసుకోలేదు. కేవలం చిన్నారిని రక్షించాలని భావించా’ అని షెన్‌ డాంగ్‌ తెలిపారు. మరోవైపు జావో లిజియన్‌ షేర్ చేసిన వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. హీరోలు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ ఉంటారని కొనియాడుతున్నారు. ‘లెజెండరీ క్యాచ్! ఆ ఇద్దరికీ పతకం ఇవ్వండి’ అని ఓ నెటిజన్‌ పేర్కొన్నారు. అతని సమయస్ఫూర్తి భేష్‌ అని మరికొందరు కామెంట్ చేశారు.Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని