Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!

దాయాది దేశం పాకిస్థాన్‌ (Pakistan Crisis) అప్పుల్లో కూరుకుపోయి, ఆర్థికంగా సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటోంది. నిత్యావసరాలు, ఇంధన, ఔషధాల ధరలు పెరగడంతో పాలకులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Published : 12 Aug 2022 01:52 IST

కరాచీ: దాయాది దేశం పాకిస్థాన్‌ (Pakistan Crisis) అప్పుల్లో కూరుకుపోయి, ఆర్థికంగా సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటోంది. నిత్యావసరాలు, ఇంధన, ఔషధాల ధరలు పెరగడంతో పాలకులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రధాని షహబాజ్ షరీఫ్‌, పీఎంఎల్‌ - ఎన్‌ పార్టీని (Paksitan Government) విమర్శిస్తూ.. ఓ మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈ ధరల మధ్య నా పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?’’ అంటూ ఆమె కన్నీటితో ప్రశ్నించారు. పాక్‌కు చెందిన పాత్రికేయుడు షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కరాచీకి చెందిన సదరు మహిళ ధరల పెరుగుదలపై ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ద్రవ్యోల్బణ పరిస్థితులతో తాను ఎదుర్కొంటోన్న కష్టాలను చెప్పుకుంటూ కన్నీరుపెట్టుకున్నారు.

నాకు ఇద్దరు బిడ్డలు. ఒకరికి ఫిట్స్ సమస్య ఉంది. ఈ నాలుగు నెలల కాలంలో ఔషధాల ధరలు పెరిగిపోయాయి. ఇప్పుడు నా చిన్నారి కోసం మందులు కొనకుండా ఉండగలనా? ఇంటి అద్దె కట్టాలి, కరెంటు బిల్లులు పెరిగిపోయాయి. పిల్లల కోసం పాలు, మందులు కొనాలి. ఇప్పుడు నేను వారికి తిండి పెట్టాలా? చంపుకోవాలా?ఇప్పుడు నేనేం చేయాలి. ఈ ప్రభుత్వ పాలనతో పేదలు చావు అంచున ఉన్నారు

- వీడియోలో మహిళ

వీడియో వైరల్ కావడంతో పాకిస్థాన్‌ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్‌ స్పందించారు. దేశ ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉందన్న ఆయన... తాము విద్యుత్‌ ఛార్జీలు పెంచలేదని, ఔషధాలపై పన్నులు వేయలేదని చెప్పుకొచ్చారు. ఏప్రిల్‌లో షహబాజ్ షరీఫ్ నేతృత్వంలో పాక్‌లో సంకీర్ణ ప్రభుత్వం కొలువుతీరింది. రాజకీయ సంక్షోభం నుంచి కాస్త కోలుకున్న ఆ దేశం.. ఇప్పుడు ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందిపడుతోంది. అప్పులతో సతమతమవుతోన్న ఆ దేశ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. కరెంటు ఖాతా లోటు 4.6 శాతానికి పెరిగిపోయింది. విదేశాల నుంచి డాలర్ల రాక తగ్గిపోవడం ఈ లోటు పెరగడానికి కారణమవుతోంది. ద్రవ్యోల్బణ పరిస్థితులతో బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడంతో రుణాలు భారంగా మారాయి. ప్రస్తుత పరిస్థితులు పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీశాయని ప్రపంచ ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని