Viral Video: అయ్యో.. పిండి కిందపడిపోయిందే! నవ్వులు పూయిస్తోన్న చిన్నారుల వీడియో

చిన్నారులు తమ ప్లేట్‌లోని పిండిని వెనుక ఉన్న మరొకరి ప్లేట్‌లో పోస్తున్నట్లు.. ఓ ఆట వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పిల్లల ఆటతీరు చూసేవారికి ఎంతో నవ్వు తెప్పిస్తోంది!

Published : 07 Jan 2023 23:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాల్యం.. మధురమైన అనుభూతుల సమ్మేళనం! ఎన్నో సరదా ఆటలు అందులో భాగం. సంగీతానికి అనుగుణంగా సాగే ‘పాస్‌ ది పార్శిల్‌(Pass The Parcel)’ ఆట మనలో చాలామందికి తెలిసిందే. పాట ప్రారంభం కాగానే.. బంతి, లేదా ఏదైనా వస్తువును పక్కవారికి పాస్‌ చేయడం, పాట ఆగిపోగానే.. ఆ వస్తువు ఉన్నవారు ఏదైనా టాస్క్‌ చేయడం చూసే ఉంటారు. తాజాగా ఇలాంటి ఓ ఆటకు సంబంధించిన వైరల్‌ వీడియో(Viral Video) ఒకటి.. నెట్టింట నవ్వులు పూయిస్తోంది.

ఈ వీడియోలో.. చిన్నారులు ఒకరివెనుక ఒకరు కూర్చోని ఉన్నారు. వారి కళ్లకు గంతలు కట్టి ఉన్నాయి. ముందుగా కూర్చున్న పిల్లాడు.. తన ప్లేట్‌లోని పిండిని వెనుక విద్యార్థి ప్లేటులోకి తన తలమీదుగా జాగ్రత్తగా పోశాడు. ఇలా ఒక్కొక్కరు తమ ప్లేటులోని పిండిని వెనుకవారి ప్లేటులో పోస్తూ వెళ్లారు. ఈ క్రమంలోనే.. చిన్నారుల ఆటతీరు.. పిండి కిందపడిపోయిన సందర్భాలు.. చివరి పిల్లాడి హావభావాలు.. చూసేవారికి కడుపుబ్బా నవ్విస్తున్నాయి!

నార్వే దౌత్యవేత్త ఎరిక్ సోల్హీమ్ ఈ వీడియోను ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. ‘అనవసరమైన దశల కారణంగా.. సమాచార నాణ్యత క్షీణిస్తుంది’ అని క్యాప్షన్‌ పెట్టారు. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. ఈ వీడియోకు ఇప్పటివరకు 33 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. నెటిజన్లు సైతం కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ‘అయ్యో..! ఈ చిన్నారుల మధ్య సమన్వయం లోపించింది’ అని ఒకరు స్పందించారు. ఈ ఆట ఆసక్తికరంగా ఉందని ఒకరు.. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలది ఇదే పరిస్థితి అని మరొకరు.. ఇలా కామెంట్లు పెట్టారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని