Published : 18 Oct 2022 15:53 IST

Viral Video: షాకింగ్‌! కదులుతున్న రైళ్లోనుంచి యువకుడిని తోసేశాడు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కదులుతున్న రైళ్లో నుంచి తోటి ప్రయాణికుడిని ఓ వ్యక్తి బయటకు తోసేశాడు. ఈ షాకింగ్‌ ఘటన పశ్చిమ బెంగాల్‌లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. తీవ్ర గాయాలతో ఉన్న బాధితుడిని కాపాడిన రైల్వే పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం..

సజల్‌ షేక్‌ అనే వ్యక్తి హావ్‌డా-మాల్దా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం రాత్రి తన ఇంటికి వెళుతున్నాడు. అయితే, దుర్భాషలాడుతున్నాడని, మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ.. సజల్‌తో ఓ వ్యక్తి గొడవపడ్డాడు. దీంతో కోపోద్రిక్తుడైన సజల్‌ అతడిపై చేయిచేసుకున్నాడు. దీంతో విచక్షణ కోల్పోయిన ఆ వ్యక్తి యువకుడిని రైళ్లో నుంచి బయటకు తోసేశాడు. ఆపై తాపీగా, తనకేమీ తెలియనట్లుగా వెళ్లి సీట్లో కూర్చున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

అయితే, పట్టాల పక్కన గాయాలతో నిస్సహాయ స్థితిలో పడిఉన్న బాధితుడిని గుర్తించిన రైల్వే పోలీసులు అతడిని బిర్భూమ్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం అతడి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. బాధితుడి వద్ద వాంగ్మూలం సేకరించగా.. నలుగురు సభ్యులు గల బృందం ఆకతాయి చేష్టలను నిలువరించేందుకు వెళితే ఇలా చేశారని ఆరోపించాడు. ‘కొంతమంది గట్టిగట్టిగా మాట్లాడుతూ ఇతరులను అసౌకర్యానికి గురిచేస్తున్నారు. నా పక్కనే కూర్చున్న ఓ కుటుంబం అసౌకర్యానికి గురైంది. ఈ విషయాన్ని వారికి చెప్పేందుకు వెళ్లడమే నేను చేసిన తప్పు’ అంటూ వాపోయాడు.

‘అందులో ఓ వ్యక్తి వచ్చి నాతో గొడవకు దిగాడు. చంపేస్తానంటూ భయపెట్టాడు. ఆపై ఏం జరిగిందో అర్థంకాలేదు. కళ్లు తెరిచి చూస్తే రైలు పట్టాలపై ఉన్నాను. ఒళ్లంతా తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కాపాడటం వల్ల బతికిపోయాను’ అంటూ పేర్కొన్నాడు. నిందితుడిని అప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని