Indian Railway: నడి వంతెనపై నిలిచిన రైలు.. పునఃప్రారంభించేందుకు లోకో పైలట్‌ సాహసం!

అనవసరంగా చైను లాగడంతో నడి వంతెనపై నిలిచిపోయిన ఓ రైలును మళ్లీ ప్రారంభించేందుకు ప్రాణాలను పణంగా పెట్టారో లోకో పైలట్‌. దీనికి సంబంధించిన వీడియోను రైల్వేశాఖ.. ట్విటర్‌ వేదికగా పంచుకుంది. కారణం లేకుండా అలారం...

Published : 07 May 2022 16:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అనవసరంగా చైను లాగడంతో నడి వంతెనపై నిలిచిపోయిన ఓ రైలును మళ్లీ ప్రారంభించేందుకు ప్రాణాలను పణంగా పెట్టారో లోకో పైలట్‌. దీనికి సంబంధించిన వీడియోను రైల్వేశాఖ.. ట్విటర్‌ వేదికగా పంచుకుంది. కారణం లేకుండా అలారం చైన్‌ను లాగడం వల్ల కలిగే అసౌకర్యం, సిబ్బందికి కలిగే ప్రమాదం గురించి ప్రస్తావించింది. మే 6న ముంబయి నుంచి బిహార్‌లోని ఛప్రాకు వెళ్తున్న గోదాన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ చైన్‌ను లాగాడు. దీంతో ముంబయికి 80 కి.మీ దూరంలోని తిత్వాలా- ఖడవలి స్టేషన్‌ల మధ్య ఓ నది వంతెనపై రైలు నిలిచిపోయింది. దాన్ని పునఃప్రారంభించాలంటే.. చైన్‌ను లాగిన బోగీ కింది అలారం చైన్‌ నాబ్‌ను రీసెట్ చేయడం అవసరం. దీంతో సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ సతీష్ కుమార్ దాన్ని రీసెట్ చేయడానికి సాహసమే చేశారు.

వంతెనపై ప్రమాదకర పరిస్థితుల్లో బోగీ కింది పరికరాలు, చక్రాల పక్కన సన్నని సందులోంచి లోపలికి వెళ్లి దాన్ని సరిచేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ‘అకారణంగా అలారం చైన్‌ని లాగడం చాలా మందికి ఇబ్బంది కలిగిస్తుంది! అలారాన్ని రీసెట్‌ చేసేందుకు అసిస్టెంట్ లోకో పైలట్ సతీష్ కుమార్ రిస్క్‌ తీసుకున్నారు. కాబట్టి.. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఎమర్జెన్సీ చైన్‌ని లాగండి’ అని రైల్వేశాఖ తన ట్వీట్‌లో ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది. రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సైతం.. లోకో పైలట్‌ నిబద్ధతను కొనియాడారు. మరోవైపు ఈ ఘటనకు కారకులైన వారిపై నెటిజన్లు మండిపడుతున్నారు. వారిపట్ల కఠిన చర్యలు తీసుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. అదే సమయంలో.. సతీష్‌ కుమార్‌ సాహసాన్ని ప్రశంసిస్తున్నారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని