Elephant Rescue: గుంతలో పడిన గున్న.. తల్లడిల్లిన తల్లి ఏనుగుకు సీపీఆర్‌!

అంతవరకు తనతో కలిసి వచ్చిన గున్న ఏనుగు.. అకస్మాత్తుగా ఓ భారీ గుంతలో జారిపడింది. దీంతో తల్లడిల్లిన ఆ తల్లి ఏనుగు.. తన బిడ్డను కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసింది! ఒక వైపు జోరు వాన.. బురద. ఈ...

Published : 15 Jul 2022 21:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతవరకు తనతో కలిసి వచ్చిన గున్న ఏనుగు అకస్మాత్తుగా ఓ భారీ గుంతలో జారిపడింది. దీంతో తల్లడిల్లిన ఆ తల్లి ఏనుగు.. తన బిడ్డను కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలూ చేసింది. ఓ వైపు జోరు వాన.. బురద. ఈ పరిస్థితులతో తీవ్ర ఒత్తిడికి గురై చివరకు స్పృహ కోల్పోయిందా తల్లి ఏనుగు. అప్పటికే రంగంలోకి దిగిన జంతు సంరక్షకులు.. దానికి సీపీఆర్‌ చేసి ప్రాణాలు నిలిపారు. మరోవైపు గుంతను తవ్వి గున్న ఏనుగునూ రక్షించారు. మూడు గంటలపాటు ఉత్కంఠభరితంగా సాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్‌.. థాయ్‌లాండ్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

థాయ్‌లాండ్‌ నఖోన్ నాయొక్ ప్రావిన్స్‌లోని ఖావో యాయ్ జాతీయ ఉద్యానంలో ఓ భారీ గుంతలో ఏడాది వయసున్న గున్న ఏనుగు పడిపోయింది. దాన్ని బయటకు తీసేందుకు తల్లి ఏనుగు శాయశక్తులా ప్రయత్నించింది. వర్షం, బురద కారణంగా దాని ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలోనే దాన్ని కాపాడేందుకు జంతు సంరక్షకులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇది గమనించిన తల్లి ఏనుగు.. మరింత ఆందోళనకు గురైంది. రెస్క్యూ ఆపరేషన్‌కు అడ్డంకిగా మారింది. దీంతో సిబ్బంది.. ట్రాంక్విలైజర్‌లు ఉపయోగించారు. దీంతో స్పృహ కోల్పోయిన తల్లి ఏనుగు సైతం కొద్దిగా గుంతలోకి జారింది. దానికి తాళ్లు కట్టి.. క్రేన్‌ సాయంతో బయటకు లాగారు.

కొంతమంది దానిపైకి ఎక్కి కార్డియోపల్మనరీ రెసాసిటేషన్ (CPR) చేశారు. అప్పటికే పిల్ల ఏనుగు బయటకు వచ్చేందుకు వీలుగా గుంతను తవ్వారు. చివరకు అది బయటకు వచ్చింది. మరోవైపు తల్లి ఏనుగు కూడా స్పృహలోకి వచ్చింది. అనంతరం ఆ రెండు తిరిగి అడవిలోకి వెళ్లిపోయాయి. ‘తల్లి సమీపంలో ఉన్నప్పుడు పిల్ల ఏనుగు దగ్గరకు వెళ్లడం అసాధ్యం. కాబట్టి మేం ఆమెకు మూడు డోసుల ట్రాంక్విలైజర్స్ ఇచ్చాం. ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ.. ఆ తల్లి తన బిడ్డను విడిచిపెట్టలేదు. మేం చేపట్టిన అత్యంత మరపురాని రెస్క్యూలలో ఇది ఒకటి’ అని ఆపరేషన్‌లో పాల్గొన్న జంతు వైద్యుడు చానన్య ఓ వార్తా సంస్థకు తెలిపారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని