Assam: బాబోయ్‌.. ఖడ్గమృగం..! తరుముకొచ్చింది..

అస్సాంలోని కజిరంగా జాతీయ పార్కులో కొంతమంది సఫారీ సందర్శకులకు ఓ ఖడ్గమృగం నుంచి ఊహించని అనుభవం ఎదురైంది. అది వాహనాన్ని వెంబడించడం, అత్యంత సమీపానికీ చేరుకోవడంతో వారు భయంతో కేకలు పెట్టారు. 

Published : 01 Jan 2023 02:22 IST

దిస్పూర్: అస్సాంలోని కజిరంగా జాతీయ ఉద్యానం(Kaziranga National Park).. ఖడ్గమృగాలకు ప్రసిద్ధి. ఇక్కడి అటవీ వాతావరణంలో స్వేచ్ఛగా సంచరించే వాటిని చూసేందుకు సందర్శకులు క్యూ కడుతుంటారు. తాజాగా.. ఇలాగే సఫారీ(Safari)కి వెళ్లిన కొంతమంది పర్యాటకులకు ఊహించని అనుభవం ఎదురైంది. అనుకోకుండా ఓ ఖడ్గమృగం(Rhino) వారిని తరుముకుంటూ రావడంతో.. ప్రాణాలు అరచేత పెట్టుకుని వాహనం వేగం పెంచారు. అయినా.. అది జీపు అత్యంత సమీపానికి చేరుకోవడంతో అందులోని వారంతా భయంతో కేకలు పెట్టారు. చివరకు అది వెనక్కి తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇటీవల ఇదే రాష్ట్రంలోని మానస్‌ జాతీయ పార్కులోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ సఫారీ జీపు.. ఇక్కడి హబరీ అటవీ ప్రాంతం గుండా వెళ్తుండగా.. ఒక్కసారిగా పొదల్లోంచి దూసుకొచ్చిన ఓ ఖడ్గమృగం వారి వాహనాన్ని కొద్ది దూరం వరకు వెంబడించింది. అడవుల్లో నిరంతరం మానవ సంచారం కారణంగా జంతువులకు చిర్రెత్తడమే.. ఇలాంటి ఘటనలకు దారితీస్తాయని అటవీశాఖ అధికారులు చెప్పారు. ‘ఖఢ్గమృగాలు భారీ శరీరంతో నెమ్మదిగా, ప్రశాంతంగా ఉన్నట్లే కనిపిస్తాయి. కానీ, అవి దూకుడుగా వ్యవహరించగలవు. కాబట్టి.. అలాంటి పరిస్థితుల్లో వాటికి సురక్షితమైన దూరంలో ఉండటమే ఉత్తమం’ అని ఐఎఫ్‌ఎస్‌ అధికారి ఒకరు తెలిపారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని