Rishi Sunak: ‘విజయ్‌ మామ ఎవరు?’.. వైరల్‌గా మారిన రిషి సునాక్‌ వీడియో!

ప్రముఖ షెఫ్‌ సంజయ్‌ రైనా తాజాగా రిషి సునాక్‌తో తీసుకున్న ఓ వీడియోను ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. రిషి, రైనాలు.. ఫోన్‌లో వేరే ఇతర వ్యక్తితో వీడియో కాల్‌లో మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. అవతలి వ్యక్తిని రిషి ‘విజయ్‌ మామ’ అని పలకరించడంతో.. అసలు ఆయన ఎవరనేదానిపై నెటిజన్లలో చర్చ మొదలైంది.

Published : 28 Oct 2022 18:50 IST

లండన్‌: భారత సంతతికి చెందిన రిషి సునాక్‌(Rishi Sunak) బ్రిటన్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెట్టింట పోస్ట్‌లు, మీమ్స్‌లతో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. ప్రముఖ షెఫ్‌ సంజయ్‌ రైనా తాజాగా రిషి సునాక్‌తో తీసుకున్న ఓ వీడియోను ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. రిషి, రైనాలు.. ఫోన్‌లో వేరే ఇతర వ్యక్తితో వీడియో కాల్‌లో మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. అవతలి వ్యక్తిని రిషి ‘విజయ్‌ మామ(Vijay Mama)’ అని పలకరించడంతో.. అసలు ఆయన ఎవరనే దానిపై నెటిజన్లలో చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే వీడియో కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

‘మామ.. మీకు హలో చెప్పేందుకు ఎవరు ఉన్నారో చూడండి’ అంటూ సంజయ్‌ తొలుత తన ఫోన్‌ను రిషి సునాక్‌వైపు తిప్పారు. దీంతో సునాక్‌ ఆయన్ను ‘విజయ్ మామ’ అని పలకరించారు. ‘విజయ్ మామ.. హాయ్. నేను రిషి. ఎలా ఉన్నారు? మీరు నన్ను కలుస్తారని ఆశిస్తున్నా. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు, మీ మేనల్లుడి(సంజయ్‌)ని.. డౌనింగ్ స్ట్రీట్‌కు తీసుకెళ్లమని చెప్పండి. టేక్‌ కేర్‌’ అని మాట్లాడారు. ఈ వీడియోను పోస్ట్‌ చేసిన సంజయ్‌.. ‘వీసా ఆన్ అరైవల్ అబ్ పక్కా(వీసా ఆన్ అరైవల్ ఇప్పుడు కచ్చితంగా సాధ్యం)’ అని క్యాప్షన్ ఇచ్చారు.

ఈ వీడియోలో రిషి సునాక్‌ వినయాన్ని కొనియాడుతూనే.. అసలు విజయ్‌ మామ ఎవరు? అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. భారత్‌ నుంచి పరారైన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యానా? అంటూ పలువురు స్పందించారు. ‘విజయ్‌ మామ అక్కడికి త్వరలోనే వస్తారు. కానీ, బ్రిటన్‌లో ఉన్న విజయ్‌ మాల్యాను ఇక్కడికి పంపండి’ ఓ నెటిజన్‌ కామెంట్‌ పెట్టారు. ‘విజయ్‌ మామ భారత్‌కు తిరిగొచ్చేటప్పుడు ఆయనతో కోహినూర్‌ వజ్రాన్ని పంపించండి ప్లీజ్‌’ అని మరొకరు రిషి సునాక్‌కు విజ్ఞప్తి చేశారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు