Viral Video: సముద్రంలో అత్యంత లోతులో కనిపించిన చేపలివే..!

జపాన్‌ సమీపంలో ఉత్తర పసిఫిక్‌ మహాసముద్రంలో ఏకంగా 8,336 మీటర్ల లోతులో చేపల కదలికలను శాస్త్రవేత్తలు రికార్డు చేశారు. అత్యంత లోతులో చిత్రీకరించిన చేపలు ఇవే కావడం గమనార్హం.

Published : 05 Apr 2023 02:08 IST

టోక్యో: సముద్రాలు.. ఎన్నో జీవజాతులకు చిరునామా. అయితే.. చాలావరకు జలచరాలు సముద్రంలో పరిమిత లోతు వరకే జీవిస్తాయి. కానీ, సముద్ర గర్భంలో ఏకంగా 8,336 మీటర్ల (27,000 అడుగులకు పైగా) లోతులో తిరుగుతున్న చేపల(Snail Fish)ను శాస్త్రవేత్తలు గుర్తించారు. జపాన్‌(Japan) సమీపంలో ఉత్తర పసిఫిక్ మహాసముద్రం(Northern Pacific Ocean)లోని ఓ అగాధంలో ఇవి కనిపించాయి. శాస్త్రవేత్తలు ఇప్పటివరకు అత్యంత లోతులో చిత్రీకరించిన చేపలు ఇవే కావడం గమనార్హం. సముద్ర రోబోల ద్వారా గత సెప్టెంబర్‌లో చిత్రీకరించిన వీడియో దృశ్యాలను తాజాగా విడుదల చేశారు. ‘చేపలు సముద్రంలో ఎంత లోతువరకు వెళ్తాయో ఇది చూపిస్తోంది’ అని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన, మిండెరూ- యూడబ్ల్యూఏ డీప్ సీ రీసెర్చ్ సెంటర్ వ్యవస్థాపకుడు, సముద్ర జీవశాస్త్రవేత్త అలాన్ జెమీసన్ అన్నారు.

ప్రపంచంలో అత్యంత లోతైన ప్రదేశాల్లో చేపల మనుగడపై అధ్యయనంలో భాగంగా.. యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా, టోక్యో యూనివర్సిటీ ఆఫ్ మెరైన్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు జపాన్‌లోని అగాధాల్లో వీడియోలు తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక్కడి ‘ఇజు- ఒగాసవారా’ అగాధంలో.. 8,336 మీటర్ల లోతులో స్నెయిల్‌ ఫిష్‌ను గుర్తించారు. ఇవి పిల్ల చేపలని.. తక్కువ లోతులో నివసించే పెద్ద జీవుల బారినుంచి తమనుతాము కాపాడుకునేందుకు వీలైనంత లోతుకు వెళ్తాయని జెమీసన్‌ చెప్పారు. ఇదిలా ఉండగా.. గతంలో 2008లో 7,703 మీటర్ల లోతులో మాత్రమే చేపలను గుర్తించారు. మరోవైపు.. తాజాగా 8,022 మీటర్ల లోతులో రెండు చేపలను పట్టుకున్నారు. ఇప్పటివరకు అత్యంత లోతులో చిక్కిన చేపలు ఇవే. లోతైన జలాల్లో అక్కడి తీవ్ర పరిస్థితులను తట్టుకుని ఎలా జీవిస్తున్నాయో అధ్యయనం చేసేందుకు ఇవి సహాయపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని