Chandigarh University: వీడియోల లీకులు.. హిమాచల్‌లోని ఆ విద్యార్థి సైతం అరెస్టు

పంజాబ్‌ మొహాలీలోని చండీగఢ్‌ వర్సిటీలో ఆందోళనలకు సంబంధించి పోలీసులు మరో అరెస్టు చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థిని తాజాగా అదుపులోకి తీసుకున్నారు........

Published : 18 Sep 2022 23:22 IST

చండీగఢ్‌: పంజాబ్‌ మొహాలీలోని చండీగఢ్‌ వర్సిటీలో ఆందోళనలకు సంబంధించి పోలీసులు మరో అరెస్టు చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థిని తాజాగా అదుపులోకి తీసుకున్నారు. వర్సిటీకి చెందిన కొందరు విద్యార్థినుల అభ్యంతరకర వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయని పేర్కొంటూ చండీగఢ్‌ యూనివర్సిటీ విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో వర్సిటీ  ప్రస్తుతం నిరసనలతో అట్టుడుకుతోంది.

తన సహచరుల ప్రైవేటు వీడియోలను ఓ విద్యార్థిని హిమాచల్‌ ప్రదేశ్‌లోని మరో యూనివర్సిటీకి చెందిన స్నేహితుడికి పంపగా.. అతడు ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ చేయడంతో దుమారం రేగింది. విద్యార్థుల ఆందోళనలతో మొదట సదరు మహిళా విద్యార్థిని అరెస్టు చేసిన పోలీసులు.. ప్రస్తుతం హిమాచల్‌లోని ఆమె స్నేహితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అతడిని సన్నీ మెహతా(23)గా గుర్తించారు. ఈ ఇద్దరు హిమాచల్‌లోని రోహ్రూ ప్రాంతవాసులని పోలీసులు తెలిపారు. దర్యాప్తు తర్వాత మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందన్నారు.

అయితే, విద్యార్థినుల వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయంటూ వస్తోన్న ఆరోపణల్ని యూనివర్సిటీ అధికారులు, పోలీసులు ఖండిస్తున్నారు. అవన్నీ అవాస్తవాలేనని.. సదరు విద్యార్థిని తన సొంత వీడియోను హిమాచల్‌లో చదువుతున్న మరో విద్యార్థి సన్నీ మెహతాతో షేర్‌ చేసుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెబుతున్నారు. అయితే, ఈ లీకుల వార్తల తర్వాత కొందరు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారంటూ సోషల్‌ మీడియాలో వచ్చిన పోస్టుల్ని కొట్టిపారేశారు. ఇప్పటివరకు జరిగిన తమ దర్యాప్తులో నిందితురాలు ఒకే ఒక్క వీడియోను మాత్రమే గుర్తించినట్టు చెప్పారు. ఎవరూ రూమర్లు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.

మరోసారి ఉవ్వెత్తున నిరసనలు

ఇవన్నీ తప్పుడు వార్తలని పోలీసులు, ప్రో ఛాన్సలర్‌ కొట్టిపారేసిన నేపథ్యంలో యూనివర్సిటీలో మరోసారి నిరసనలు మిన్నంటాయి. వీరికి మరికొందరు విద్యార్థులు తోడయ్యారు. శనివారం ఆందోళనలు మొదలుకాగా ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు కొన్ని హాస్టళ్ల గేట్లు మూసి, తాళాలు వేశారు. అయితే, ఆ గేట్లపై నుంచి దూకి వచ్చిన వారంతా మిగతా విద్యార్థులకు తోడయ్యారు. వారు గేట్లు దూకుతున్న, ఆందోళనలు చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని