Thief: ‘నన్ను క్షమించు తల్లీ’.. దేవతను వేడుకొని మరీ హుండీ ఎత్తుకెళ్లిన దొంగ

ఓ దొంగతనానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. విధేయుడిలా చేతులు జోడించి దేవతను వేడుకొని మరీ హుండీ చోరీకి పాల్పడ్డాడు........

Updated : 10 Aug 2022 22:21 IST

జబల్‌పుర్‌: ఓ దొంగతనానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. విధేయుడిలా చేతులు జోడించి దేవతను వేడుకొని మరీ హుండీ చోరీకి పాల్పడ్డాడో దొంగ. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌లో చోటుచేసుకుంది. గుట్టుగా లక్ష్మీదేవి ఆలయంలోకి చొరబడిన ఆ దొంగ.. ముందుగా చేతులు జోడించి వినమ్రతతో దేవతను మొక్కి ఆపై ఆలయ హుండీతో ఉడాయించాడు. ఆలయానికి సంబంధించిన రెండు గంటలను కూడా ఎత్తుకెళ్లాడు. దొంగతనంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈనెల 5న జరిగిన ఈ చోరీకి సంబంధించిన వీడియోలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆపై సోషల్‌ మీడియాలో వీడియోలు వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఈ ఘటనపై భిన్నంగా స్పందిస్తున్నారు. అతడి చర్యను కొందరు విమర్శిస్తుండగా, మరికొందరు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఆ దొంగకు ఎన్ని కష్టాలున్నాయో.. అందుకే దేవతను ‘నన్ను క్షమించు తల్లీ’ అని వేడుకొని మరీ చోరీ చేశాడు అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. హుండీలో డబ్బులు ఎక్కువగా ఉండేలా చూడు అని మొక్కి మరీ దొంగతనం చేశాడు అని మరికొందరు చమత్కరిస్తున్నారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని