Viral video: బాలుడి గొంతులో ఇరుక్కున్న బాటిల్‌ క్యాప్‌.. ఈ టీచర్‌ చేసిన పనికి హ్యాట్సాఫ్‌ అనాల్సిందే!

అత్యవసర సమయంలో ఓ ఉపాధ్యాయురాలి సమయస్ఫూర్తి తొమ్మిదేళ్ల బాలుడి ప్రాణాలు నిలిపింది.

Updated : 18 Apr 2022 15:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాల్లో నిత్యం ఏదో ఒక అంశం వైరల్‌ గా మారుతుంది. తాజాగా ఇలాగే వైరల్ అయిన ఓ వీడియోను మాత్రం నెటిజన్లు విపరీతంగా షేర్‌ చేస్తున్నారు. ఇంతకీ అందులో ఏముంది అంటే.. అత్యవసర సమయంలో ఓ ఉపాధ్యాయురాలి సమయస్ఫూర్తి
తొమ్మిదేళ్ల బాలుడి ప్రాణాలు నిలిపింది. ఈ ఒక్క సన్నివేశంతో ఆమెను సూపర్‌ వుమన్‌ అంటూ అంతా అభినందిస్తున్నారు. అమెరికాలోని న్యూజెర్సీ లోని ఓ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. 

తొమ్మిదేళ్ల బాలుడు నీళ్లు తాగేందుకు బాటిల్‌ ను నోట్లో పెట్టుకున్నాడు. మూతను నోటితో తీయాలని ప్రయత్నించాడు. అనుకోకుండా దానిని మింగేశాడు. అది గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడలేదు. పక్కనే ఉన్న స్నేహితులను పిలుద్దామన్నా నోటమాట రావడం లేదు. ఏం చేయాలో
తెలియక మెరుపు వేగంతో టీచర్‌ దగ్గరకు పరిగెత్తాడు. సైగలతో ఆమెకు ఏదో చెప్పబోయాడు. విషయం అర్థం చేసుకున్న ఆమె వెంటనే స్సందించింది. పిల్లాడిని వెనక్కి తిప్పి ఛాతీ కిందిభాగంలో చేతులను ఉంచి బలంగా లోపలికి నెట్టింది. ఆ కుదుపులకు బాలుడి గొంతులో అడ్డుపడిన ప్లాస్టిక్‌ మూత బయటకు తన్నుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా ఊపిరితీసుకున్నాడు. ఊహించని ఈ పరిణామానికి భయపడిపోయిన ఆ చిన్నారి ఏడుస్తూ తనకు జరిగిన విషయాన్ని టీచర్‌కు వివరించాడు. ఆమె కన్నీళ్లు తుడుస్తూ అతన్ని దగ్గరకు తీసుకుని ఓదార్చింది. నిమిషం ఆలస్యమైనా అది బాలుడి ప్రాణాలమీదకొచ్చేదే. ఇదంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. నిజానికి ఆమె చేసింది ‘హైమ్లిక్‌ మనూవర్‌’అనే ప్రథమ చికిత్స. అమెరికాలో చిన్న పిల్లలకు తరగతులు బోధించే ఉపాధ్యాయులకు అత్యవసర సమయంలో చేయాల్సిన సీఆర్పీ, ఇతర ప్రథమ చికిత్సల గురించిన శిక్షణ ఇస్తారు. ఓ నెటిజన్‌ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో
30 లక్షల వీక్షణలను సొంతం చేసుకుంది. 



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని