Viral video: సుడిగాలి ధాటికి పల్టీలు కొట్టిన కారు.. మళ్లీ అంతే వేగంతో..

టెక్సాస్‌లో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఓ టోర్నడోలో చిక్కుకున్న యువకుడు క్షేమంగా బయటపడ్డాడు......

Published : 25 Mar 2022 21:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టోర్నడో పేరు వినిపిస్తే చాలు అమెరికా వాసులు భయపడిపోతూ ఉంటారు. తీవ్ర ఉద్ధృతితో చుట్టేసే ఈ సుడిగాలులు ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ ప్రాణాలను హరించివేస్తుంటాయి. కానీ, టెక్సాస్‌లో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఓ టోర్నడోలో చిక్కుకున్న యువకుడు క్షేమంగా బయటపడ్డాడు. రోడ్డుపై కారు పల్టీలు కొట్టినా అతడికి ఎలాంటి గాయాలు కాలేదు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది.

టెక్సాస్‌ నగరంలో ట్రక్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న రిలే లియోన్‌ (16) అనే యువకుడు ఓ ఇంటర్వ్యూకి వెళ్లి తిరిగి ఇంటికి వెళుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు టోర్నడో వలయంలో చిక్కుకున్నాడు. ఆ సుడిగాలుల ధాటికి లియోన్‌ నడిపే ట్రక్‌ పల్టీలు కొట్టింది. మృత్యువు అంచు వరకూ వెళ్లిన అతడు అదృష్టవశాత్తూ క్షేమంగా బయటపడ్డాడు. సుడిగాలి తీవ్రత కాస్త తగ్గడంతోనే కారుతో దూసుకెళ్లిపోయాడు. సుడిగాలికి కాస్త దూరంలో మరో కారులో ఉన్న వ్యక్తి సదరు దృశ్యాలను వీడియో తీసి ట్విటర్‌లో ఉంచగా.. నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆ వీడియోను ఇప్పటికే 6.8 మిలియన్ల మందికి పైగా వీక్షించారు.

ఈ ఘటనపై రిలే లియోన్‌ను ప్రశ్నించగా.. అతడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాననే విషయం నమ్మశక్యంగా లేదు. ఆ దేవుడే నన్ను రక్షించాడు. ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత నా మైండ్‌ బ్లాంక్‌ అయిపోయింది. ఆ తర్వాత కారును ఎలా నడిపానో కూడా తెలియదు. ఇంటికి చేరుకున్నాను’ అని పేర్కొన్నాడు.  ధ్వంసమైన కారును ఇన్సూరెన్స్‌ కంపెనీ.. తీసుకుందని, దాని స్థానంలో మరో కారును ఇవ్వనుందని వెల్లడించాడు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని