Viral Video: చంకలో చంటి బిడ్డతో చకచక వార్తలు చదివేసిన యాంకర్‌..!

ఇటు ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ.. అటు ఉద్యోగంలో రాణిస్తూ.. తమ  బాధ్యతల్ని సమన్వయం చేస్తుటారు మహిళలు.

Updated : 04 Feb 2022 16:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటు ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ.. అటు ఉద్యోగంలో రాణిస్తూ.. తమ  బాధ్యతల్ని సమన్వయం చేసుకొంటారు మహిళలు. అయితే, కొత్తగా ఇంట్లోకి బుజ్జాయిని ఆహ్వానించిన తల్లులు వారిని వదిలి విధులకు వెళ్లడం కాస్త కష్టంగానే ఉంటుంది. అమెరికాకు చెందిన ఓ వార్త సంస్థలో వాతావరణ వివరాలు వెల్లడించే న్యూస్ యాంకర్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అయినా, ఏ మాత్రం వెనకడువేయకుండా పిల్లను చంకపెట్టుకొని, పని చక్కబెట్టిన తీరు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

అమెరికాకు చెందిన రెబెకా షుడ్‌ ఓ వార్త సంస్థలో వాతావరణ వివరాలు రిపోర్టు చేస్తుంటారు. మెటర్నిటీ సెలవుల అనంతరం కరోనా కారణంగా ఆమె ఇంటినుంచే పనిచేస్తున్నారు. సరిగా తాను వెదర్‌ గురించి రిపోర్టు చేసే సమయానికి ఆమె మూడు నెలల చిన్నారి నిద్ర నుంచి మేల్కొంది. ‘నేను నా పని మొదలుపెడదామనుకునే సమయానికి, మా పాప నిద్రలేచింది. దీంతో తనను తీసుకొని వార్తలు చదివే ప్లేస్‌కు వెళ్లాను. అయ్యో మీ పాప కనిపిస్తుందా..? ఇబ్బంది కాదా..? అని మా హెడ్ అడిగారు. అయితే, తను అప్పటికే చాలా సేపు నిద్రపోయింది కాబట్టి, ఎలాంటి ఇబ్బంది ఉండదని నేను హామీ ఇచ్చి, నా పని కొనసాగించాను’ అంటూ తన అనుభవాన్ని వెల్లడించారు. 

కాగా, ఈ వెదర్ రిపోర్టు నెట్టింట్లో వైరల్‌గా మారింది. రెబెకా తన బాధ్యతల్ని సమన్వయం చేసిన తీరు ప్రతిఒక్కరిని మెప్పించింది. వర్కింగ్‌ విమెన్‌కు మీరు నిజమైన అర్థమంటూ నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తారు. తన పని ఇంతమందిని మెప్పించడంతో ఆమె ఆశ్చర్యపోయారు. ‘ఇది నాకు దక్కిన గౌరవం. నేనింకా షాక్‌లో ఉన్నాను’ అంటూ వినయంగా స్పందించారు. తమ లక్ష్యాలవైపు ప్రయాణించే మహిళలకు ఈ సంఘటన ప్రేరణగా నిలుస్తుందని ఆమె ఆశించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని