Anand Mahindra: ‘డీప్‌ ఫేక్‌’ వీడియో.. ఆందోళన వ్యక్తం చేసిన ఆనంద్‌ మహీంద్రా!

ఓ ‘డీప్‌ ఫేక్‌’ వీడియోను పోస్ట్‌ చేసిన ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా.. ఈ తరహా కంటెంట్‌పై ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి మోసపూరిత కంటెంట్‌ను నిరోధించేందుకు ఎలా సిద్ధమవుతున్నాం? అని ప్రశ్నించారు.

Updated : 21 Jan 2023 17:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎప్పటికప్పుడు సరికొత్త సాంకేతికతలతో ప్రపంచం పరుగులు పెడుతోంది. ఇందులో ‘డీప్‌ ఫేక్‌ టెక్నాలజీ(Deep Fake Technology)’ ఒకటి. ఈ సాంకేతికత సాయంతో ఏదైనా వీడియోలోని వ్యక్తుల ముఖాలను వేరే ఇతరుల ముఖాలుగా చూపించవచ్చు. తాజాగా ఇదే తరహా ఓ వీడియోపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత వీడియోను ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. ఓ యువకుడు మాట్లాడుతున్నట్లు ఉన్న ఈ వీడియోలో.. అతని ముఖం షారూఖ్‌ ఖాన్‌, విరాట్‌ కోహ్లీ, రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ తదితరుల ముఖాలుగా మారిపోతూ కనిపిస్తోంది.

‘ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో.. ప్రమాదకర పర్యవసానాల గురించి హెచ్చరిస్తోంది. మనల్ని తప్పుదోవ పట్టించే ఈ తరహా కంటెంట్‌ ఒకింత వినోదభరితంగా ఉండొచ్చు. కానీ, ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తే పరిస్థితులు దారుణంగా మారతాయి. ఈ నేపథ్యంలో.. ఒక సమాజంగా మనం ఇటువంటి మోసపూరిత కంటెంట్‌ను నిరోధించేందుకు ఎలా సిద్ధమవుతున్నాం? వీటి బారినుంచి రక్షణగా పనిచేసే సాంకేతికతలు ఉన్నాయా?’ అని ఆనంద్‌ మహీంద్రా ప్రశ్నించారు.

ఈ పోస్ట్‌ కాస్త.. ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. నెటిజన్లు సైతం ఈ వీడియోపై స్పందిస్తూ.. ‘డీప్‌ ఫేక్‌’ విషయంలో ప్రజల్లో అప్రమత్తత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే విధంగా ఇతరుల కంటెంట్‌ను డీప్‌ ఫేక్‌ చేసే కొంతమంది సోషల్‌ మీడియా వ్యక్తులను తాను చూసినట్లు ఓ వ్యక్తి చెప్పారు. సామాజిక మాధ్యమాల్లోని పోస్టులు, లేదా మెసేజింగ్ యాప్‌ల ద్వారా వచ్చే కంటెంట్‌ను సీరియస్‌గా తీసుకునే ముందు ఆచితూచి వ్యవహరించాలని మరొక నెటిజన్‌ సూచించారు. ఫేస్‌స్వాప్‌ సంబంధిత యాప్‌లు, వీడియో ఎడిటర్లపై నిషేధం విధించాలని ఒకరు డిమాండ్ చేశారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని