Video: టూరిస్టులవైపు దూసుకొచ్చిన పులి.. తర్వాతేం జరిగిందో చూడండి!

అడవి నుంచి తప్పించుకొన్న పులి బయట ఎక్కడో సంచరిస్తుందని తెలిస్తేనే భయపడిపోతాం. కనిపిస్తే అది మనల్ని చంపేస్తుందేమోనని గజగజ వణికిపోతాం. అలాంటిది కొన్ని మీటర్ల దూరంలోఉన్న పులి గర్జిస్తూ ఒక్కసారిగా మనవైపు దూసుకొస్తే.. ఇక అంతే!

Published : 28 Nov 2022 18:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అడవి నుంచి వచ్చిన పులి బయట ఎక్కడో సంచరిస్తుందని తెలిస్తేనే భయపడిపోతాం. కనిపిస్తే అది మనల్ని చంపేస్తుందేమోనని గజగజ వణికిపోతాం. అలాంటిది కొన్ని మీటర్ల దూరంలోఉన్న పులి గర్జిస్తూ ఒక్కసారిగా మనవైపు దూసుకొస్తే.. ఇక అంతే! ఈ దృశ్యం చూస్తుంటేనే వెన్నులో చలి పుడుతుంటే.. మరి స్వయంగా ఆ అనుభవం ఎదురైనవారి సంగతి ఇక ప్రత్యేకించి చెప్పనవసరంలేదు. తాజాగా ఓ జంగిల్‌ సఫారీలో ఓపెన్‌ జీప్‌లో ప్రయాణిస్తున్న బృందం వైపు కోపంతో గాండ్రిస్తూ పులి దూసుకొచ్చింది. ఈ వణుకుపుట్టించే వీడియోను ఐఎఫ్‌ఎస్‌ అధికారి సురేందర్‌ మెహ్రా తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘‘కొన్నిసార్లు పులుల్ని చూడటం కోసం మనం ప్రదర్శించే ‘అతి’ ఆతృత వాటి జీవితంలోకి చొరబడటం తప్ప మరొకటి కాదు’’ అంటూ ఆయన చేసిన ట్వీట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

కొందరు పర్యాటకుల బృందం ఓపెన్‌ జీప్‌లో వెళ్తూ పొదలు వెనుక పులి ఉన్నట్టు గుర్తించి వాహనం ఆపారు. ఆ పులి కదలికలను దగ్గరి నుంచి చిత్రీకరించేందుకు ప్రయత్నించడంతో ఆ జంతువు వారివైపు గర్జిస్తూ కోపంగా దూసుకొచ్చింది. ఆ క్షణంలో అప్రమత్తమైన జీప్‌ డ్రైవర్‌ వాహనాన్ని ముందుకు పోనివ్వడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఆ పులి కూడా మళ్లీ అడవిలోకి వెళ్లిపోయిన దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. అయితే, ఈ వీడియో ఏ జంగిల్‌ సఫారీలో తీశారు.. ఎప్పుడు తీశారనేది మాత్రం తెలియలేదు. ఆదివారం రోజు ఉదయం సురేంద్ర మెహ్రా ఈ వీడియోను పోస్ట్‌ చేయగా అనేకమంది లైక్‌లు, కామెంట్లు పెడుతున్నారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని