Viral Pic: రెండు రైళ్లు.. ఒక్క ఫొటో.. ఈ వై‘రైల్‌’ సెల్ఫీ స్పెషలేంటో తెలుసా?

ఫోన్‌ కెమెరాతో తీసుకున్న కొన్ని ఫొటోలు చాలా ప్రత్యేకమైనవిగా ఉంటాయి. వీటిని మధురమైన జ్ఞాపకాలుగా

Published : 17 Jun 2022 02:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫోన్‌ కెమెరాలో బంధించిన కొన్ని ఫొటోలు చాలా ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. వీటిని మధురమైన జ్ఞాపకాలుగా చాలా భద్రంగా దాచుకుంటారు చాలామంది. అప్పుడప్పుడూ వాటిని చూసి మురిసిపోతుంటారు. అలాంటి ఫొటో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. రెండు వేర్వేరు రైళ్లలో ఉన్న ఇద్దరు రైల్వే ఉద్యోగులు తీసుకున్న సెల్ఫీ అది. ఇందులో స్పెషల్‌ ఏముంది అని అనుకుంటున్నారా? ఈ ఫొటోలో ఉన్న వారిద్దరూ తండ్రీకొడుకులు. తండ్రి ఎప్పట్నుంచో రైల్వే గార్డుగా పని చేస్తుండగా.. ఇటీవల అతని కొడుకు ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)గా ఉద్యోగంలో చేరాడు. ఇద్దరు చేసేది రైల్వే ఉద్యోగమే అయినా డ్యూటీలు వేరు.. వారి హోదాలు వేరు. పనిమీద ఒకరు ఒక ప్రాంతానికి వెళ్తే మరొకరు ఇంకో ప్రాంతానికి వెళ్తారు. మళ్లీ కలిసేది డ్యూటీ దిగాకనో.. ఇంట్లోనో..!

అయితే, ఒకరోజు విధుల్లో ఉండగా వీరిద్దరున్న రెండు రైళ్లు ఒకేచోట ఆగాయి. అదే సమయంలో ఇద్దరు ఓ సెల్ఫీ దిగారు. దీన్ని ఓ వ్యక్తి ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా వైరల్‌ అయ్యింది. దీనికి ‘అద్భుతమైన సెల్ఫీ. రైల్వేలో తండ్రి గార్డు.. కొడుకు టీటీఈ. రెండు రైళ్లు పక్కపక్కనే ఆగడంతో తీసుకున్న సెల్ఫీ ఇది’ అంటూ వ్యాఖ్య జోడించాడు. ఈ ఫొటోలో తండ్రీకొడుకులు యూనీఫామ్‌ ధరించి వేర్వేరు రైలులో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, ఈ ఫొటో ఎక్కడ దిగారు అనే వివరాలపై స్పష్టతలేదు. అలాగే వీరి పేర్లు, ఎక్కడ పనిచేస్తారు అనే  వివరాలు కూడా తెలియరాలేదు. కానీ, వీరిద్దరి ఫొటోను చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీనికి ఇప్పటికే వేల మంది లైక్ చేశారు. భారీగా రీ ట్వీట్ కూడా చేస్తున్నారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని