Teacher-Student: చిన్నారి వీడియో చూశారా..! టీచర్‌ స్పందన చదవండి..

అల్లరి చేస్తున్నావంటూ నొచ్చుకున్న టీచర్‌ను బుజ్జగిస్తూ.. ఓ చిన్నారి ఆమెకు క్షమాపణలు చెబుతున్న వీడియో ఒకటి వైరల్‌గా మారిన విషయం తెలిసిందే..........

Updated : 14 Sep 2022 20:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అల్లరి చేస్తున్నావంటూ నొచ్చుకున్న టీచర్‌ను బుజ్జగిస్తూ.. ఓ చిన్నారి ఆమెకు క్షమాపణలు చెబుతున్న వీడియో ఒకటి వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. టీచర్‌-విద్యార్థి మధ్య జరిగిన ఆ సంభాషణ చూడముచ్చటగా ఉండటంతో ఎంతోమంది ఆ వీడియోను ఆదరిస్తున్నారు. అయితే, ఎవరీ టీచర్‌ అంటూ వెతుకులాట మొదలవడంతో వారి అడ్రస్‌ తెలిసిపోయింది. ఈ ముద్దులొలికే ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ నైనీలోని సేత్‌ ఆనంద్‌రామ్‌ జైపురియా స్కూల్లో జరిగింది. ఆ టీచర్‌ పేరు విశాఖ త్రిపాఠి కాగా, ఆ చిన్నారి విద్యార్థి పేరు అధర్వ్‌.

తన వీడియోను ఎంతోమంది లైక్‌ చేస్తుండటంతో టీచర్‌ విశాఖ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థతో ఆమె మాట్లాడారు. పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలు చేస్తున్న కార్యకలాపాలను వీడియో తీసి వారి తల్లిదండ్రులకు గానీ సోషల్‌ మీడియాలో గానీ పంచుకోవాలి. అయితే, అప్పుడు పిల్లలు చాలా అల్లరి చేశారని, అందులో అధర్వ్‌ కూడా ఉన్నాడని టీచర్‌ తెలిపారు. అందుకే తన ప్రవర్తనపై తాను నొచ్చుకున్నానని చెప్పడంతో.. అతడు ఆ విధంగా క్షమాపణలు చెప్పాడని పేర్కొన్నారు. ఆ వీడియోను సహోద్యోగి నిషా తీశారని, అది తనకెంతో నచ్చడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా వైరల్‌గా మారిందన్నారు. ప్రజలు ఈ వీడియోను ఎంతో ఇష్టపడ్డారని, ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.

కాగా ఆ వీడియోలో ‘ఎంత చెప్పినా నువ్వు అల్లరి చేస్తూనే ఉన్నావ్‌. అల్లరి చేయనంటూనే మళ్లీ మళ్లీ చేస్తున్నావ్‌’ అంటూ టీచర్‌ విద్యార్థి అధర్వ్‌ తీరు పట్ల నొచ్చుకుంటారు. ‘ఇకపై నీతో మాట్లాడబోను’ అని కూడా పేర్కొంటారు. అయితే, దీనికి ఆ చిన్నారి స్పందిస్తూ.. ఇకపై ఎప్పుడూ అల్లరి చేయబోనంటూ ఆ అలిగిన టీచర్‌ను సముదాయించే ప్రయత్నం చేస్తాడు. ఇకపై చేయను.. నిజంగా చేయను అంటూ ఆ విద్యార్థి ముద్దుముద్దుగా పదేపదే చెప్పడంతో ఆ టీచర్‌ సంతోషిస్తుంది. ముద్దుపెట్టుకోమని అడగటంతో ఆ టీచర్‌ రెండు చెంపలపైనా ఆ ముద్దుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆదరిస్తుండటంతో ఈ క్లిప్పింగ్‌ను ఇప్పటికే 5.20లక్షల మందికి పైగా వీక్షించారు. 26వేల మంది లైక్‌ చేశారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని