Published : 15 Apr 2022 16:36 IST

Joe Biden: ఎవరూ లేరు.. అయినా షేక్‌హ్యాండ్‌! వైరల్‌గా మారిన బైడెన్‌ వీడియో

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విచిత్ర ప్రవర్తనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఓ కార్యక్రమంలో భాగంగా అప్పటివరకు పోడియం వద్ద ప్రసంగించిన బైడెన్‌.. అనంతరం పక్కకు తిరిగి ఎవరికో కరచాలనం ఇస్తున్నట్లు చేయి చాచారు. కానీ.. అక్కడ ఎవరూ లేకపోవడం గమనార్హం. ఇక్కడి గ్రీన్స్‌బోరోలోని నార్త్ కరోలినా అగ్రికల్చరల్ అండ్ టెక్నికల్ స్టేట్ యూనివర్సిటీలో ఇది జరిగింది. వీడియో ప్రకారం.. తన ప్రసంగాన్ని ముగించిన బైడెన్‌ ఆపై షేక్‌ హ్యాండ్‌ పొజిషన్‌లో తన చేతిని చాచి కుడివైపునకు తిరిగారు. అయితే, వేదికపై ఆయన సంజ్ఞకు స్పందించేందుకు ఎవరూ లేరు. దీంతో కొన్ని క్షణాలపాటు ఇబ్బందిగా కదిలిన బైడెన్‌.. వెంటనే ప్రేక్షకుల వైపు వెళ్లారు.

ఈ ప్రసంగంలో భాగంగానే తాను పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేశానని బైడెన్‌ పేర్కొన్నారు. వాస్తవానికి.. అక్కడి విద్యార్థులకు ఆయన ఒక్కసారీ బోధించలేదు. దీంతో నెటిజన్లు ఈ అంశంపైనా ఆయన్ను ట్రోల్స్‌ చేస్తున్నారు. ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ నేతలూ.. బైడెన్‌ ప్రవర్తనా శైలిపై వ్యంగ్య బాణాలు విసిరారు. ‘వైట్‌హౌస్, బైడెన్ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారు? ఆయన్ను అందంగా కనిపించేలా చేయడమే వారి పనా?’ అని కాలిఫోర్నియా రిపబ్లికన్ పార్టీ మాజీ వైస్ ఛైర్మన్ హర్మీత్ కె ఢిల్లన్ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. ‘ఆయన డిమెన్షియా బాధితుడిలా కనిపించాలని వారు కోరుకుంటే తప్ప.. ఇది నిజంగా వింతగా ఉంది’ అని అన్నారు. బైడెన్‌ అధ్యక్షుడిగా ఉండేందుకు అనర్హుడని మరో రిపబ్లికన్‌ నేత రాబీ స్టార్‌బక్ విమర్శించారు.



Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని