Viral Video: సూపర్‌ పోలీస్‌.. బైక్‌పై వెళ్తూ దొంగను ఎలా పట్టుకున్నారో చూడండి!

తన ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా దొంగను పట్టుకొని ‘సూపర్‌ పోలీస్‌’ అనిపించుకుంటున్నారు ఓ కానిస్టేబుల్‌! దేశ రాజధాని నగరంలో గొలుసు చోరీలు చేసే దొంగను పట్టుకున్న ఓ కానిస్టేబుల్‌ సాహసానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Updated : 25 Nov 2022 18:20 IST

దిల్లీ: తన ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా దొంగను పట్టుకొని ‘సూపర్‌ పోలీస్‌’(Super cop) అనిపించుకుంటున్నారు ఓ కానిస్టేబుల్‌! దేశ రాజధాని నగరం(Delhi)లో గొలుసు చోరీలు చేసే దొంగను పట్టుకున్న ఓ కానిస్టేబుల్‌ సాహసానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌(Viral video)గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. షాహాబాద్‌ డెయిరీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇటీవల ఓ గొలుసు చోరీ కేసు నమోదైంది. ఆ దొంగ ఆచూకీ కోసం కానిస్టేబుల్‌ సత్యేంద్ర రంగంలోకి దిగి గాలిస్తున్నారు. ఈ క్రమంలో, దొంగ ఓ దారిలో వెళ్తున్నట్టు తెలియడంతో అతడికి ఎదురుగా కానిస్టేబుల్‌ నెమ్మదిగా బైక్‌పై వెళ్తుండగా.. ఆయన్ను చూసిన దొంగ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో కానిస్టేబుల్‌ తన బైక్‌ను కిందపడేసి అతడిపైకి దూకి పట్టుకున్నట్టు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. దొంగ అక్కడి నుంచి పారిపోయేందుకు ఎంతగా ప్రయత్నించినా కానిస్టేబుల్‌ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా అతడి కాలిని పట్టుకొని వదలకపోడం ఈ వీడియోలో చూడొచ్చు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే, కానిస్టేబుల్‌ సాహసానికి సంబంధించిన 19 సెకెన్ల వీడియోను దిల్లీ పోలీసులు ట్విటర్‌లో నిన్న పోస్ట్‌ చేశారు. ‘‘తన ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా కానిస్టేబుల్‌ సత్యేంద్ర ఓ చైన్‌ స్నాచర్‌ను పట్టుకున్నారు. ఈ నేరస్థుడి అరెస్టుతో 11 కేసులు పరిష్కారమయ్యాయి. న్యాయపరమైన ప్రొసీడింగ్స్‌ కొనసాగుతున్నాయి’’ అని పేర్కొన్నారు. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘సూపర్‌.. వెల్‌డన్‌ దిల్లీ పోలీస్‌. ఇది గర్వించదగిన క్షణం అని ఓ నెటిజన్‌ ప్రశంసించగా.. ‘మీరు ధైర్యవంతుడైన సైనికుడు సత్యేంద్రా.. గర్వపడుతున్నాం’ అని మరొకరు రాశారు. ఇలా అనేకమంది నెటిజన్లు ఆయన సాహసాన్ని కొనియాడుతూ పోస్టులు పెడుతున్నారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని