Viral Videos: ఆకాశ వీధిన పారాగ్లైడర్‌.. అంతలోనే అనుకోని అతిథి.. ఆకట్టుకుంటున్న వీడియో

అంతెత్తున ఆకాశంలో విహారం చాలామందికి సరికొత్త అనుభూతిని పంచుతుంది. ఆ ప్రయాణంలోనే అనుకోని అతిథి ఎదురైతే! ఇలాంటి ఘటనే ఎదురైంది ఓ పారాగ్లైడర్‌కి. వినువీధుల్లో ఎగురుతోన్న ఓ నల్ల రాబందు.. అంతలోనే ఆ పారాగ్లైడర్‌...

Published : 09 Jun 2022 20:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతెత్తున ఆకాశంలో విహారం చాలామందికి సరికొత్త అనుభూతిని పంచుతుంది. ఆ ప్రయాణంలోనే అనుకోని అతిథి ఎదురైతే! ఇలాంటి ఘటనే ఎదురైంది ఓ పారాగ్లైడర్‌కి. వినువీధుల్లో ఎగురుతోన్న ఓ నల్ల రాబందు.. అంతలోనే ఆ పారాగ్లైడర్‌ వద్దకు చేరుకుని, ఆయన కాళ్ల వద్ద సేద తీరుతున్నట్లు కనిపిస్తున్న ఓ వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ట్విటర్‌లో ఇప్పటివరకు దాదాపు కోటిన్నరకుపైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

ఓ పారాగ్లైడర్‌.. భూమికి వేల అడుగుల ఎత్తులో విహరిస్తుండగా సమీపంలో ఓ రాబందు కనిపిస్తుంది. దీంతో అతను ఆ పక్షి సమీపానికి చేరుకుంటాడు. అంతవరకు రెక్కలాడించిన ఆ రాబందు అంతలోనే.. పారాగ్లైడర్ వద్దకు చేరుకుని ఎంచక్కా కూర్చుంటుంది. ఈ క్రమంలోనే అతను దాన్ని నిమురుతాడు. కొద్ది సేపటికే ఆ పక్షి సైతం అతని బూట్లను కొరుకుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఈ వీడియోను ఎక్కడ తీశారో మాత్రం వెల్లడించలేదు.

శిక్షణ ఇచ్చిన డేగలతోనూ ఈ తరహా పారాగ్లైడింగ్‌ చేస్తారని, దాన్ని ‘పారాహాకింగ్’ అంటారని ఓ వ్యక్తి ఈ వీడియోపై కామెంట్‌ చేశారు. ‘మ్యాజికల్‌ వీడియో. ఇంతకంటే మంచి అనుభవాన్ని పొందలేం’ అని ఒకరు రాసుకొచ్చారు. ‘ఆశ్చర్యంగా ఉంది. ఇది జీవితంలో ఒక్కసారే జరిగే ఘటన’ అని మరొకరు కామెంట్‌ చేశారు. అక్కడ ఏమైనా తినడానికి దొరుకుతుందని పక్షి భావించిందేమోనని ఒకరు సరదాగా స్పందించారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని