Viral Video: రోడ్లపై ఫీట్లు చేస్తే.. ఇదిగో ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయ్‌..!

రోడ్లపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే ప్రమాదాల (Road Accidents) బారినపడక తప్పదని చెప్పే ఘటన పంజాబ్‌(Punjab)లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

Published : 17 Feb 2023 01:47 IST

ఛండీగఢ్‌: రహదారి ప్రమాదాల్లో (Road Accidents) ఊహించనివి కొన్నయితే.. డ్రైవర్ల తప్పిదం వల్ల జరిగేవి మరికొన్ని ఉంటాయి. కానీ, కొంత మంది వ్యక్తులు ఖాళీ రోడ్లపై రేసింగ్ (Racing) చేయడం, నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్‌, సరదా కోసం చేసే ఫీట్ల (Stunts) వల్ల తమతో పాటు రోడ్లపై ప్రయాణించే ఇతర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యేందుకు కారణం అవుతున్నారు.  తాజాగా పంజాబ్‌ (Punjab)లోని నవణ్‌షహర్‌-ఫగ్వారా (Nawanshahr-Phagwara) జాతీయ రహదారిపై ఓ వ్యక్తి నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్‌తో కారు ప్రమాదానికి గురైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. 

రోడ్డుపై ఓ వ్యక్తి కారులో వెళుతూ.. కారును జిగ్‌జాగ్‌గా డ్రైవ్‌ చేశాడు. అలా కొంత దూరం వెళ్లిన తర్వాత కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ దృశ్యాలను వెనుక కారులో వెళుతున్నవారు వీడియో తీశారు.  దీనికి సంబంధించిన వీడియోను నిఖిల్‌ అనే వ్యక్తి ట్విటర్లో షేర్‌ చేశారు. ‘‘పంజాబ్‌లోని నవణ్‌షహర్‌-ఫగ్వారా జాతీయ రహదారిపై ఓ కారు రోడ్డుపై స్టంట్ చేస్తూ  డివైడర్‌ను ఢీకొట్టింది’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కారు నడిపిన వ్యక్తి తనది అమృత్‌సర్‌ అని, కారు టైర్‌ పంక్చర్‌ కావడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పడం గమనార్హం. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘రోడ్లపై స్టంట్‌ చేస్తే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి’, ‘రోడ్లు బాగున్నా.. ఇలాంటి నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ చేసి ప్రమాదాలు చేసే వారికి కఠిన శిక్ష విధించాలి’ అని కామెంట్లు చేస్తున్నారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని