Viral Video: పెద్దోళ్లు పట్టించుకోలేదు.. పసిపిల్లలు చేయందించారు..

పెద్దలను చూసి పిల్లలు నేర్చుకుంటారు అని అంటుంటారు కదా.. కానీ, ఈ వీడియో చూశాక పసిపిల్లలను చూసి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందనిపిస్తోంది. రోడ్డుపై కష్టాల్లో ఉన్న ఓ మనిషిని పెద్దోళ్లంతా చూసిచూడనట్లుగా

Published : 11 Aug 2022 01:19 IST

ఈ చిట్టిచేతుల సాయానికి.. ఇంటర్నెట్‌ సెల్యూట్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: పెద్దలను చూసి పిల్లలు నేర్చుకుంటారు అని అంటుంటారు కదా.. కానీ, ఈ వీడియో చూశాక పసిపిల్లలను చూసి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందనిపిస్తోంది. రోడ్డుపై కష్టాల్లో ఉన్న ఓ మనిషిని పెద్దోళ్లంతా చూసిచూడనట్లుగా వెళ్లిపోతుంటే.. నిండా పదేళ్లు కూడా లేని ఈ చిన్నారులు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. తమ చిట్టిచేతులతో ఆ మనిషి కష్టం తీర్చారు. సాయం చేయాలనే ఆలోచన ఉండాలే గానీ, వయసుతో పనేముంది అని నిరూపించారు.

రోడ్డుపై పండ్లు అమ్ముకునే మహిళకు ఇద్దరు చిన్నారులు సాయం చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ మహిళ తోపుడు బండిపై పండ్లు పెట్టుకుని అమ్ముకుంటూ వెళ్తుండగా మధ్యలో ఏటవాలుగా ఉన్న రోడ్డు ఉంది. ఆ ఎత్తుగడ్డపైకి తన తోపుడు బండిని ఎక్కించేందుకు మహిళ ప్రయత్నించగా ఆమెకు సాధ్యం కాలేదు. అటుగా వెళ్తోన్న కొందరు ఆమెను చూసి పట్టించుకోలేదు. సాయం చేసేందుకు ముందుకు రాలేదు.

కొంతసేపటికి స్కూల్‌ దుస్తుల్లో ఉన్న ఇద్దరు చిన్నారులు అటుగా వస్తూ మహిళను చూశారు. క్షణం ఆలోచించకుండా ఆమె దగ్గరకు వెళ్లారు. ఓ వైపు పాప, మరోవైపు బాలుడు పట్టుకుని ఆ తోపుడు బండిని ఎత్తుగడ్డ ఎక్కించారు. వారు చేసిన సాయానికి మురిసిపోయిన ఆ మహిళ.. వారిద్దరికీ కృతజ్ఞతగా చెరో అరటిపండు ఇచ్చింది.

ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. ఇందుకు సంబంధించిన వీడియోను ఆదిత్యనాథ్ అనే నెటిజన్‌ ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ‘‘మీరు సాధించిన డిగ్రీలు మీ ప్రవర్తనలో కన్పించకపోతే అవి కేవలం చిత్తుకాగితాలు మాత్రమే’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 5లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. ఆ చిట్టిచేతుల సాయానికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ ప్రపంచంలో ఇంకా మానవత్వం, దయాగుణం బతికే ఉందంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. వయసులో చిన్నోళ్లే అయినా.. దయాగుణంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన ఈ చిన్నారులను మనమూ అభినందిద్దామా..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని