Viral Video: క్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే

ఓ ఇంటి బయటి చివరి మెట్టు కింది అంచునుంచి నాగుపాము నెమ్మదిగా పాకుతోంది. అప్పుడే తల్లితో కలిసి ఇంటి నుంచి బయటకు వస్తున్న ఆ బాలుడికి ఈ విషయం తెలియదు...

Published : 13 Aug 2022 22:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ ఇంటి బయటి చివరి మెట్టు కింది అంచున నాగుపాము నెమ్మదిగా పాకుతోంది. అప్పుడే తల్లితో కలిసి ఇంటి నుంచి బయటకు వస్తున్న ఆ బాలుడికి ఈ విషయం తెలియదు. దీంతో ఎప్పటిలాగే కింద అడుగేశాడో లేదో.. చప్పున వెనక్కు మళ్లిందా సర్పం. అంతలోనే బాలుడు తిరిగి వెనక్కి రావడంతో.. ఒక్కసారిగా పడగ విప్పిన సర్పం బుసలు కొడుతూ అతని వైపు వచ్చింది. ఇది గమనించిన బాలుడి తల్లి వెంటనే అప్రమత్తమై అతన్ని వెనక్కి లాగడం.. అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ ఘటన కర్ణాటకలోని మాండ్య జిల్లాలో చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన సీసీకెమెరా ఫుటేజీ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బాలుడి తల్లి సమయస్ఫూర్తిని, ఆమె ధైర్యసాహసాలను నెటిజన్లు కొనియాడుతున్నారు. ‘ఒక్క సెకను ఆలస్యమైనా పాము అతన్ని కాటేసేదే! తల్లి ప్రేమకు సెల్యూట్‌’ అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ పెట్టారు. ప్రమాదం నుంచి అద్భుతంగా కాపాడారంటూ మరొకరు స్పందించారు. ‘వర్షాకాలంలో బొరియలు నీటితో నిండిపోవడంతో పాములు సురక్షిత ఆవాసం కోసం బయటకు వస్తాయి. కాబట్టి.. ఈ సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి’ అని ఓ ఐఎఫ్‌ఎస్‌ అధికారి ట్విటర్‌ వేదికగా తెలిపారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని