Miami Beach: బీచ్‌ ముంగిట కుప్పకూలిన హెలికాప్టర్‌.. వీడియో వైరల్‌

అమెరికా ఫ్లోరిడాలోని మయామి బీచ్‌ సందర్శకులతో సందడిగా ఉంది. కొందరు సముద్ర తీరంలో సేద తీరుతున్నారు. మరికొందరు ఈతకొడుతున్నారు. అంతలోనే.. ఓ హెలికాప్టర్‌ వచ్చి వారికి అతి సమీపంలో కుప్పకూలడం ఒక్కసారిగా కలకలానికి కారణమైంది. ముగ్గురు...

Published : 20 Feb 2022 18:33 IST

వాషింగ్టన్‌: అమెరికా ఫ్లోరిడాలోని మయామి బీచ్‌ సందర్శకులతో సందడిగా ఉంది. కొందరు సముద్ర తీరంలో సేద తీరుతున్నారు. మరికొందరు ఈతకొడుతున్నారు. అంతలోనే.. ఓ హెలికాప్టర్‌ వచ్చి వారికి అతి సమీపంలో కుప్పకూలడం ఒక్కసారిగా కలకలానికి కారణమైంది. ముగ్గురు ప్రయాణికులతో కూడిన ‘రాబిన్‌సన్ ఆర్‌44’ హెలికాప్టర్ మధ్యాహ్న సమయంలో.. రద్దీగా ఉన్న బీచ్‌కు అతి సమీపంలో సముద్రంలో కూలిపోయినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌ఏఏ) శనివారం తెలిపింది. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్‌(ఎన్‌టీఎస్‌బీ)తో కలిసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించింది.

అంతకుముందు.. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే మయామి బీచ్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. అందులోని ప్రయాణికులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఇది కాస్త వైరల్‌గా మారింది. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని ఓ అంతర్జాతీయ వార్తాసంస్థ పేర్కొంది. మయామి బీచ్ అగ్నిమాపక శాఖ అధికారి లినారెస్.. ఈ ఘటనను ‘కంట్రోల్ క్రాష్’గా అభివర్ణించారు. బీచ్‌కు మరికొంత సమీపంలో ఈ ప్రమాదం జరిగితే.. భారీ ప్రాణనష్టం సంభవించేదని తెలిపారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని