Published : 22 Dec 2022 20:30 IST

Anand Mahindra: కేరళ టు ఖతర్‌ ‘సోలో రోడ్‌ ట్రిప్‌’.. ఆ మహిళకు సెల్యూట్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాల వేదికగా వినూత్న ఆవిష్కరణలు, ప్రతిభావంతులను ప్రోత్సహించే మహీంద్రా గ్రూప్‌ అధినేత ఆనంద్‌ మహీంద్రా(Anand Mahindra).. తాజాగా ఓ స్ఫూర్తిదాయక మహిళ ప్రయాణాన్ని షేర్‌ చేశారు. ఖతర్‌లో ఇటీవల నిర్వహించిన ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌(FIFA World Cup) పోటీలను వీక్షించేందుకుగానూ ఆమె.. కారులో ఒంటరిగానే భారత్‌నుంచి అక్కడికి 2900 కిలోమీటర్లకుపైగా ‘సోలో రోడ్‌ ట్రిప్‌’ వెళ్లడం విశేషం. ఆమే కేరళకు చెందిన నాజీ నౌషి(Naaji Noushi). ఈ క్రమంలోనే ఆమె ప్రయాణ వివరాలకు సంబంధించిన వీడియోను ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేసిన మహీంద్రా.. ఆమె సాహసానికి సెల్యూట్‌ అంటూ ప్రశసించారు.

‘ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌లో అర్జెంటీనా, మెస్సీల గెలుపుతోపాటు.. ఆమె ప్రయాణం కూడా విజయవంతమైంది. నాజీ నౌషికి, ఆమె సాహసోపేత స్ఫూర్తికి సెల్యూట్‌. థార్‌పై మీ నమ్మకానికి ధన్యవాదాలు’ అని మహీంద్రా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. అర్జెంటీనా జట్టుకు, మెస్సికి నాజీ నౌషి వీరాభిమాని. ఈ నేపథ్యంలోనే ఫుట్‌బాల్‌ పోటీలను చూసేందుకు ఖతర్‌ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తొలుత రోడ్డు మార్గంలో కేరళ నుంచి కొయంబత్తూరు మీదుగా ముంబయి చేరుకున్నారు. అనంతరం ఓడలో వాహనాన్ని ఒమన్‌కు చేర్చారు. అక్కడినుంచి యూఏఈ, కువైట్‌, బహ్రెయిన్‌, సౌదీ అరేబియాల మీదుగా ఖతర్‌కు చేరుకున్నారు.

‘ఓలు’గా పేరుపెట్టుకున్న తన వాహనాన్ని ఆమె.. బెడ్‌, వంట గది, టెంట్‌ వంటి సౌకర్యాలతో చిన్నపాటి ఇల్లులా మార్చారు. కేరళ రవాణాశాఖ మంత్రి ఆమె ప్రయాణానికి జెండా ఊపారు. ఆమె ఖతర్‌ ప్రయాణం దాదాపు 50 రోజులకుపైగా సాగింది. రాత్రుళ్లు పెట్రోల్‌ బంక్‌లు, టోల్‌ ప్లాజాల వద్ద వాహనాన్ని నిలిపేవారు. మొత్తం ప్రయాణాన్ని ఆమె డాక్యుమెంట్‌ చేశారు. గమ్యస్థానం చేరుకున్న తర్వాత తన అయిదుగురు పిల్లలను కలుసుకున్నారు. కేరళకు చెందిన ఒక మహిళ.. గల్ఫ్‌ దేశాల్లో రోడ్ ట్రిప్‌.. అదీ ఫుట్‌బాల్ ప్రపంచ కప్ చూసేందుకు వెళ్లడం ఇదే మొదటిసారట!

‘ఫిఫా ప్రపంచ కప్‌లో భారత జట్టు ఆడితే చూడాలనేది నా కల. మన దేశంలో తయారైన వాహనంలో ఖతర్‌కు చేరుకుని ఫుట్‌బాల్‌ వేడుకల్లో భాగమయ్యేందుకే ఈ వినూత్న యాత్ర చేపట్టా’ అని నాజీ నౌషి వివరించారు. మరోవైపు.. ఆనంద్‌ మహీంద్రా పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. నౌషి సాహసభరిత ప్రయాణాన్ని మెచ్చుకున్న నెటిజన్లు.. మహీంద్రా పోస్టులను మరోసారి కొనియాడారు. ‘ఆనంద్ భాయ్.. మీ ప్రతి పోస్ట్‌లో విజ్ఞానం, స్ఫూర్తిదాయకమైన సమాచారం ఉంటుంది’ అని ఒకరు కామెంట్‌ పెట్టారు. భారతీయులందరికీ ఇది గర్వకారణమని మరొకరు స్పందించారు.గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని