Viral video: లైక్‌ల కన్నా మీ లైఫ్‌ ఎంతో ముఖ్యం.. ఈ వీడియో చూడండి

తుపానులు, భారీ వర్షాలు సంభవించినప్పుడు సముద్రపు అలలు ఏ స్థాయిలో ఎగసిపడతుంటాయో మనం చూస్తుంటాం. ఆలాంటి సందర్భాల్లో సముద్ర తీర ప్రాంతాల వైపు వెళ్లొద్దంటూ.....

Published : 13 Jul 2022 20:19 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తుపానులు, భారీ వర్షాలు సంభవించినప్పుడు సముద్రపు అలలు ఏ స్థాయిలో ఎగసిపడతుంటాయో మనం చూస్తుంటాం. అలాంటి సందర్భాల్లో సముద్ర తీర ప్రాంతాల వైపు వెళ్లొద్దంటూ అధికారులు ప్రమాద హెచ్చరికలు సైతం జారీ చేస్తుంటారు.  అయినా వాటిని బేఖాతరు చేస్తూ కొందరు సరదా కోసం బీచ్‌లకు వెళ్లి ఫొటోలు, వీడియోలు తీసుకోవాలనే ఉత్సుకతలో సముద్ర అలలకు దగ్గరగా వెళ్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. దేశంలోని అనేకచోట్ల గత కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జనాలకు ఓ హెచ్చరికలాంటి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 

ఒమన్‌లోని సలాలహ్‌ హల్‌ ముఘుసైల్‌ బీచ్‌లో అనేకమంది పర్యాటకులు ఫొటోలు, వీడియోలకు ఫోజులిస్తూ ఎంజాయ్‌ చేస్తుండగా వారిపైకి ఒక్కసారిగా రాకాసి అలలు దూసుకురావడంతో కొందరు నీటిలో కొట్టుకుపోయిన దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. అయితే, వీరిలో భారతీయులు కూడా ఉన్నారు. కొందరిని అక్కడే ఉన్నవారు అప్రమత్తమై కాపాడగా.. ఇంకొందరు నీటిలో కొట్టుకుపోయారు. మొత్తం 8మంది భారతీయులు నీటిలో కొట్టుకుపోగా.. ముగ్గురిని స్థానికులు కాపాడారు. మిగతా వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను దీపాన్షు కబ్రా అనే ఐపీఎస్‌ అధికారి తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘‘మీ లైక్‌ల కన్నా మీ లైఫ్‌ ఎంతో ముఖ్యమైంది’’ అనే క్యాప్షన్‌తో ఆయన పోస్ట్‌ చేసిన వీడియోను లక్షల మంది వీక్షించారు. అలాగే, నిన్న ఈ వీడియోను ఐపీఎస్‌ అధికారిణి శిఖా గోయెల్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. పశ్చాత్తాపం కన్నా కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిదని.. ప్రస్తుతం కురుస్తోన్న జోరు వానల దృష్ట్యా అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. 



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు