Plain crash: యూట్యూబ్‌ వ్యూస్‌ కోసం సొంత విమానం క్రాష్‌ చేసుకున్నాడు.. ఇలా దొరికిపోయాడు

యూట్యూబ్‌ వ్యూస్‌ కోసం ఓ వ్యక్తి ఏకంగా తన సొంత విమానాన్నే క్రాష్‌ చేసుకున్నాడు.

Updated : 11 Jul 2023 17:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూట్యూబ్‌ వ్యూస్‌ కోసం ఓ వ్యక్తి ఏకంగా తన సొంత విమానాన్నే క్రాష్‌ చేసుకున్నాడు. అనంతరం ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశాడు. ఈ వీడియో వైరల్‌ కావడంతో ఏవియేషన్‌ అధికారుల దృష్టిలో పడింది. వారు కాస్త లోతుగా విచారించడంతో అసలు విషయం బయటపడింది. గతేడాది నవంబరులో అమెరికా కాలిఫోర్నియాలోని అటవీ ప్రాంతంలో ఓ టర్బో ప్రోప్‌ విమానం క్రాష్‌ అయ్యంది. ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన పైలట్‌ ట్రెవర్‌ జాకొబ్‌ దానిని తన యూట్యూబ్‌ ఛానెల్‌లో అప్‌లోడ్‌ చేశాడు. అనుకోకుండా తలెత్తిన ప్రమాదం అన్నట్టుగా  ఏమార్చే ప్రయత్నం చేశాడు. ఇది రెండు మిలియన్ల వ్యూస్‌తో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. తాజాగా ఈ వీడియో ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌ఏఏ) అధికారుల కంట్లో పడింది. విమానంలో లోపం తలెత్తగానే పైలట్‌ అప్పటికే సిద్ధంగా ఉంచిన ప్యారాచూట్‌తో బయటకు దూకడం, దాన్ని హ్యాండ్‌ కెమెరాతో షూట్‌ చేయడం వంటివి వారికి అనుమానం కలిగించాయి. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్‌ చేయడానికి ఏమాత్రం ప్రయత్నించకపోవడంతో అది మరింత బలపడింది. అసలు విషయం గుర్తించిన అధికారులు విస్తుపోయారు. కేవలం యూట్యూబ్‌ వ్యూస్‌ కోసం ఇటువంటి భయంకరమైన స్టంట్‌లు చేయడంపై మండిపడ్డారు.  మాజీ ఒలంపిక్‌ స్నోబార్డర్‌ ఆటగాడైన అతని బాధ్యతారాహిత్యంపై గట్టిగానే మందలించారు. మరో సంవత్సరం విమానం నడపకుండా పైలట్‌ లైసెన్స్‌ను రద్దు చేశారు. 
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని