Panchayat: ‘పంచాయత్‌’ పాఠాలు

చేతిలో సెల్‌ఫోన్, అందులో ఓటీటీ యాప్‌  ఉన్న చాలామంది యువత ‘పంచాయత్‌’ వెబ్‌సిరీస్‌కి ఫిదాలే!  ఈమధ్యే విడుదలైన మూడో భాగం కూడా అదరగొడుతోంది.

Published : 06 Jul 2024 00:17 IST

చేతిలో సెల్‌ఫోన్, అందులో ఓటీటీ యాప్‌  ఉన్న చాలామంది యువత ‘పంచాయత్‌’ వెబ్‌సిరీస్‌కి ఫిదాలే!  ఈమధ్యే విడుదలైన మూడో భాగం కూడా అదరగొడుతోంది. ఒక చిన్న గ్రామంలో కామెడీ డ్రామా కథాంశంతో తెరకెక్కినా.. కార్పొరేట్‌ ఉద్యోగులకు పాఠాలు నేర్పించే విషయాలెన్నో ఉన్నాయి ఇందులో. ఇదిగో ఇలా..

 హీరో నగరంలో పుట్టి పెరుగుతాడు. సరదాలు, హై-ఫై సౌకర్యాలు అన్నీ ఉన్న నేపథ్యం. పెద్ద కార్పొరేట్‌ సంస్థలో ఉద్యోగి కావాలనుకున్నా.. తప్పని సరి పరిస్థితుల్లో మారుమూల పల్లెలో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగంలో చేరతాడు. అతడి జీవితంలో ఒక్కసారిగా ఊహించని మార్పు. కొత్త కొలువులో ఇమడలేడు. రోజురోజుకీ కష్టాలు పెరుగుతుంటాయి. అడ్మినిస్ట్రేషన్‌పై పట్టు ఉండదు. అయినా.. ఆ సవాళ్లతో సావాసం చేస్తూనే ఒక్కొక్క గండం దాటుకుంటూ ముందుకెళ్తాడు.

పాఠం 1: కాలేజీ జీవితం నుంచి ఆఫీసులోకి అడుగు పెట్టినప్పుడు.. మన పరిస్థితీ అలాగే ఉంటుంది. కొత్త ఇబ్బందులు, సమస్యలు వచ్చి పడుతుంటాయి. అయినా హైరానా పడొద్దు. ఓపిక పడితే, ఆలోచిస్తే అన్నీ పరిష్కారం అవుతాయి. 

  • పెద్ద కార్పొరేట్‌ ఉద్యోగం కథానాయకుడి కల. కానీ చిన్న కొలువులో చేరాల్సి వస్తుంది. అయినా అదే తలచుకుంటూ కూర్చుండిపోడు. తన పరిధిలోనే గొప్పగా చేయడానికి ప్రయత్నిస్తాడు. గ్రామ కార్యదర్శిగా ఊరు బాగు పడాలనుకుని ఆచరణలో పెడతాడు.

పాఠం 2: మనం అనుకున్న కొలువు దక్కకపోవచ్చు. దక్కిన ఉద్యోగంలో మాత్రం వందశాతం మనసు పెట్టి పని చేయాలి. అప్పుడు దక్కే సంతృప్తి, వచ్చే గుర్తింపు వెలకట్టలేనిది.

  • గ్రామ కార్యదర్శి అయినా సర్పంచి నుంచి అటెండరు దాకా ప్రతి ఒక్కరితో సత్సంబంధాలుంటాయి హీరోకి. ఆ అనుబంధం ఎంత దృఢంగా మారుతుంది అంటే.. తను బదిలీపై వెళ్లినప్పుడు అంతా కలిసి ఆందోళన చేస్తారు. మళ్లీ తను తిరిగొచ్చేలా చేస్తారు.

పాఠం 3: పని చేసే చోట అందరితో కలిసిపోతే, అందరూ నావాళ్లే అనుకుంటే.. చిక్కులు, తలనొప్పులే ఉండవు. మనల్ని అంతా ఇష్టపడితే.. పని భారం అనిపించదు. 

  • ఊరు, సన్నిహితులకు ఏవైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించడానికి సృజనాత్మకంగా ఆలోచిస్తాడు కార్యదర్శి. టెక్నాలజీ వాడకం, సీసీకెమెరాల ఏర్పాటు.. ఇలా కొత్తదారిలో సమస్యలకు చెక్‌ పెడుతుంటాడు. 

పాఠం 4: ఆఫీసులో మనదైన ముద్ర ఉండాలన్నా సృజనాత్మకంగా ఆలోచించాలి. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతుండాలి. అప్పుడే గుర్తింపు దక్కుతుంది. పదోన్నతుల పరుగులో ముందుంటాం.

  • కష్టాలు వచ్చినప్పుడు.. ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరు నాయకుడిలా ముందుకొస్తారు. వంటింటికే పరిమితమయ్యే సర్పంచి భార్య ఓసారి, గ్రామ సహాయకుడు మరోసారి, ప్రత్యర్థులతో తలపడే సందర్భంలో ఉప సర్పంచి.. ఇలా ఊరికి వచ్చిన గండాల్ని గట్టెక్కిస్తుంటారు. 

పాఠం 5: హోదా, వయసు, అనుభవం.. ఇవి చూసి ఎవరినీ తక్కువగా అంచనా వేయొద్దు. చిన్న అనుకున్నవాళ్లే ఒక్కోసారి గొప్పగా పని చేయొచ్చు. వాళ్ల ప్రతిభను సమర్థంగా ఉపయోగించుకునేలా అవకాశాలివ్వాలి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు