Telangana Weatherman: కళాశాల.. వెదర్‌మ్యాన్‌!

ఆకాశం ఉరిమితే.. ఎవరైనా అదిరిపడతారు. ఆ కుర్రాడేమో ఆసక్తిగా ఆ వైపు చూసే వాడు. మెరుపులు వచ్చినా.. వర్షం పడ్డా అటువైపే పరుగెత్తేవాడు. పరిశీలనగా చూసేవాడు. వయసు పెరుగుతున్నకొద్దీ దాని మతలబేంటో కనుక్కోవాలని ప్రయత్నించేవాడు. సైన్స్‌ని శోధించాడు. రెండు పదులు వచ్చేసరికి దాని గుట్టు కనుక్కున్నాడు. వర్షం ఆనుపానులు పసిగట్టాడు. ఆ వివరాలనే అంతర్జాలంలో అందిస్తూ.. లక్షలమందిని అప్రమత్తం చేస్తున్నాడు. తనే ‘తెలంగాణ వెదర్‌మ్యాన్‌’ బాలాజీ తరిణి. 

Updated : 22 Jun 2024 05:03 IST

ఆకాశం ఉరిమితే.. ఎవరైనా అదిరిపడతారు. ఆ కుర్రాడేమో ఆసక్తిగా ఆ వైపు చూసే వాడు. మెరుపులు వచ్చినా.. వర్షం పడ్డా అటువైపే పరుగెత్తేవాడు. పరిశీలనగా చూసేవాడు. వయసు పెరుగుతున్నకొద్దీ దాని మతలబేంటో కనుక్కోవాలని ప్రయత్నించేవాడు. సైన్స్‌ని శోధించాడు. రెండు పదులు వచ్చేసరికి దాని గుట్టు కనుక్కున్నాడు. వర్షం ఆనుపానులు పసిగట్టాడు. ఆ వివరాలనే అంతర్జాలంలో అందిస్తూ.. లక్షలమందిని అప్రమత్తం చేస్తున్నాడు. తనే ‘తెలంగాణ వెదర్‌మ్యాన్‌’ బాలాజీ తరిణి. 

ట్రాఫిక్‌జామ్‌లో బయల్దేరిన ఉద్యోగి.. బయట ధాన్యం ఆరబోసుకున్న రైతు.. లోతట్టు ప్రాంతాల్లోని జనం.. వీళ్లకి ఇంకొద్ది గంటల్లో భారీ వర్షం వస్తుందనే విషయం ముందే తెలిస్తే ఎంత బాగుంటుంది! నాలుగేళ్లుగా ఇలాంటి అప్‌డేట్స్‌ అందిస్తూ వాళ్లకి ఎనలేని సాయం చేస్తున్నాడు బాలాజీ. ఆకాశం, సైన్స్, వాతావరణం, వర్షంపై ఎనలేని ఆసక్తి కనబరిచే బాలాజీని కొవిడ్‌ కాలం ఒక నిపుణుడిగా మార్చేసింది. ఆ సమయంలో పూర్తిగా ఇంటికే పరిమితం కావడంతో అంతర్జాలానికి అతుక్కుపోయాడు. మేఘాలు ఎలా ఏర్పడతాయి.. ఏ సమయంలో వర్షం పడుతుంది.. ఇలా విశ్లేషించగల సామర్థ్యం సంపాదించుకున్నాడు. అనుభవజ్ఞుల శిష్యరికం చేశాడు. చివరికి 2020 అక్టోబరులో తన సత్తా పరీక్షించుకోవడానికి ‘తెలంగాణ వెదర్‌మ్యాన్‌’ పేరుతో ఎక్స్‌ (ట్విటర్‌) పేజీని ప్రారంభించి, వెదర్‌ ఫోర్‌క్యాస్ట్‌ అందిస్తున్నాడు.

అంచనా ఇలా..

ప్రస్తుతం తనకున్న పరిజ్ఞానంతో మబ్బులు చూసి అవి ఏ రకమో చెప్పేస్తాడు. క్యుములోనింబస్‌ మేఘాలు ఎలా ఏర్పడతాయో వివరిస్తాడు. వాటి దిశ, వేగాన్ని కచ్చితంగా అంచనా వేస్తాడు. ఇక వర్షం వస్తుందా.. రాదా? వస్తే అది భారీస్థాయిలో ఉంటుందా.. మోస్తరా.. అని తెలుసుకోవడానికి గ్రౌండ్‌ ఎనాలసిస్, మోడల్‌ ఎనాలసిస్‌ చేస్తానంటున్నాడు. ఆకాశం, వాతావరణం, తేమ, గాలి దిశ, మేఘాల వేగం... ఇవన్నీ గ్రౌండ్‌ ఎనాలసిస్‌ కిందికి వస్తాయి. వీటితో ఒక అంచనాకు వచ్చాక... ఉపగ్రహ చిత్రాలు, క్లైమేట్‌ ఏజెన్సీలు, న్యూమరికల్‌ వెదర్‌ మోడళ్లు... ఈ వివరాల్నీ తీసుకున్నాక ఆ రెండింటినీ మేళవించి వాతావరణం అంచనా వేస్తాడు. దీనికోసం భారత వాతావరణశాఖ, కొన్ని కొన్ని అమెరికన్‌ వాతావరణ ఏజెన్సీల వెదర్‌ చార్ట్‌ల నుంచి సమాచారం తీసుకుంటానంటున్నాడు. వీటన్నింటినీ విశ్లేషించి తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ నివేదికలు సామాజిక మాధ్యమాల్లో అప్‌డేట్‌ చేస్తుంటాడు. భారీ వర్షాలా? మోస్తరా.. తేలికపాటి జల్లులా.. ఇలా ప్రతీదీ చెబుతుంటాడు. వర్షాకాలంలో గంటకోసారైనా వెదర్‌ అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. వేసవిలో హీట్‌వేవ్, ఉక్కపోత, తేమశాతం.. చెబుతుంటాడు. ‘మీ వెదర్‌ అప్‌డేట్స్‌ చూసి కొన్ని పనులు వాయిదా వేసుకున్నాం. వ్యవసాయ పనులు ముందే ముగించాం.. వర్షంలో చిక్కుకుకోకుండా ఇంట్లోనే ఉండిపోయాం’ అని చాలామంది సామాన్యులు నాకు ఫోన్‌ చేస్తుంటారు. హైదరాబాద్‌ నగరంలోని ట్రాఫిక్‌ పోలీసులు, డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ వాళ్లు అయితే కొన్నిసార్లు కృతజ్ఞతలు తెలుపుతూ రీట్వీట్‌ చేశారు. 2023లో విపరీతమైన వర్షాలు, వరదలు వస్తాయని హెచ్చరించాను. అప్పుడు చాలామంది రైతులు జాగ్రత్త పడ్డారు. ఇలాంటి స్పందనలు చూశాక నేను గంటలకొద్దీ పడుతున్న కష్టం మర్చిపోతుంటా’ అని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు బాలాజీ. 

కాలేజీ విద్యార్థి

బాలాజీ బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. హైదరాబాదీ. తన ప్రవృత్తి కోసం సరదాలన్నీ పక్కన పెట్టేస్తాడు. ముఖ్యంగా వర్షాకాలం అతడికి ఊపిరి సలపనంత పని. సమాచారం సేకరించడం, విశ్లేషించడం, సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేయడం.. ఒక్కోసారి అర్ధరాత్రుళ్ల వరకూ కొనసాగించాల్సిందే. తనకున్న పరిజ్ఞానంతోపాటు రజనీ, శ్రీమాన్, వెదర్‌బ్రదర్‌.. లాంటి అనుభవజ్ఞులతోనూ సమాచారం ఇచ్చి పుచ్చుకుంటాడు. అతడి పేజీకి ఎక్స్‌లో లక్ష మంది, ఇన్‌స్టాలో 34వేలు, వాట్సప్‌ ఛానెల్‌లో 18వేల మంది ఫాలోయర్లు ఉన్నారు. అవసరమైన సందర్భాల్లో వీళ్ల ద్వారా బాలాజీ అందించే సమాచారం లక్షల మందికి చేరుతుంది. ‘వాతావరణ ముందస్తు నివేదికలు ఎవరూ నూటికి నూరుశాతం కచ్చితంగా అంచనా వేయలేరు. కొన్నిసార్లు ఫెయిల్‌ అవుతుంటాయి. కొందరు విమర్శిస్తుంటారు. అయినా పెద్దగా పట్టించుకోను. నేను ఏ లాభాపేక్షా లేకుండా, నా సంతృప్తి కోసం ఇతరులకు సాయం చేస్తున్నాను. నావల్ల కొందరికైనా లాభం చేకూరితే అదే చాలు’ అంటున్నాడు బాలాజీ. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని