Nimrit Kaur Ahluwalia: దేనికైనా.. సై

‘బద్ధకానికి బ్రాండ్‌ అంబాసిడర్‌వి నువ్వు.. నీకు ఏ పనీ చేతకాదు. అందుకే అడ్డంగా పెరిగి ఇంతలా లావయ్యావు’ అని ఇంట్లోవాళ్లే తిట్టేవారు.

Updated : 01 Jun 2024 10:00 IST

‘బద్ధకానికి బ్రాండ్‌ అంబాసిడర్‌వి నువ్వు.. నీకు ఏ పనీ చేతకాదు. అందుకే అడ్డంగా పెరిగి ఇంతలా లావయ్యావు’ అని ఇంట్లోవాళ్లే తిట్టేవారు.
రోషంతో జిమ్‌కెళ్లి కసరత్తులు చేసింది. డైట్‌ పాటించి 23 కేజీలు తగ్గింది. 
‘అందంగా లేవు.. అసలు ఇండస్ట్రీకే పనికిరావు’ అన్నారంతా. 
అమ్మడికి తిక్క రేగింది. పట్టు పట్టి అందానికి సానబెట్టుకుంది. 
అందాల పోటీల్లో అందర్నీ వెనక్కి నెట్టి ‘ఫెమినా మిస్‌ మణిపుర్‌, ఫెమీనా మిస్‌ ఇండియా’గా గెలిచింది. 
ఆపై మోడల్‌గా, బిగ్‌బాస్‌ పోటీదారుగా, ఇప్పుడు ప్రమాదకరమైన ‘ఖత్రోంకా ఖిలాడీ’ కంటెస్టెంట్‌గా పోటీ పడుతూనే.. ఓ బాలీవుడ్‌ సినిమాలో అవకాశం చేజిక్కించుకుంది. తనే నిమ్రిత్‌ కౌర్‌ అహ్లువాలియా. అంతర్జాలంలో నయా సెన్సేషన్‌లా మారిన ఈ అమ్మడి సంగతులు.

బాడీ షేమింగ్‌తో: ‘చోటీ సర్దార్నీ’గా ఉత్తర భారతంలో ఇంటింటికీ పరిచయమైన నిమ్రిత్‌ చిన్నప్పుడు ఊబకాయంతో బాధ పడేది. నాలుగు అడుగులు వేయాలన్నా ఆయాసపడేది. ఇంట్లోవాళ్లు, బంధువులు తిట్టేవారు. అప్పటికీ నోరు కట్టేసుకొని మరీ బరువు తగ్గాలనుకునేది. కానీ కాలేజీకొచ్చినా అలాగే ఉండేసరికి బాడీ షేమింగ్‌ ఎక్కువైంది. ఆ బాధలు పడలేక ఓరోజు బరువు తగ్గాలని గట్టిగా తీర్మానించుకుంది. కఠోరమైన కసరత్తులు చేసి, మూడేళ్లలో 30 కేజీలు తగ్గి అందంగా తయారైంది. అంతా అవాక్కయ్యారు. 

మోడలింగ్‌: కాస్త సన్నబడ్డాక మోడల్‌గా మారాలనుకుంది. అయితే తన భుజాలు విశాలంగా ఉండటం.. అప్పటికీ కాస్త పుష్టిగానే ఉండటంతో నీకు మోడలింగ్‌కి కావాల్సిన ఫిజిక్‌ లేదన్నారు. దాంతో మరింత కష్టపడి నాజూగ్గా తయారైంది. ఇంక మోడలింగ్‌ అవకాశాలు వరుసకట్టాయి. తర్వాత అందాల పోటీల్లో పాల్గొని ‘ఫెమినా మిస్‌ మణిపుర్‌’గా కిరీటం గెల్చుకుంది. 

ప్రచారంలోకి: అప్పటికే దేశానికంతటికీ బాగా పరిచయం కావడంతో.. హిందీ ‘బిగ్‌బాస్‌’లో పోటీదారుగా అవకాశం వచ్చింది. మాటతీరు, ఆటతో ఫైనలిస్ట్‌గా నిలిచింది నిమ్రిత్‌. అయితే బిగ్‌బాస్‌ ఇంట్లో సహ పోటీదారులు ప్రియాంక చాహర్, అంకిత్‌ గుప్తాలతో గొడవ, వివాదంగా మారి.. మరింతగా వార్తల్లోకి వచ్చింది. తర్వాత ‘చోటీ సర్దార్నీ’ డైలీ సీరియల్‌లో తన నటనతో బాలీవుడ్‌ తారలకన్నా ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. 

సవాల్‌కి సై: పేరున్న వారికి కొత్తకొత్త అవకాశాలు వెతుక్కుంటూ రావడం సహజమే కదా! ప్రస్తుతం దివాకర్‌ బెనర్జీ దర్శకత్వంలో ‘లవ్‌ సెక్స్‌ ధోఖా 2’ చిత్రంలో ఎంపికైంది. ఇదికాకుండా అత్యంత ప్రమాదకరమైన రియాలిటీ షో ‘ఖత్రోంకా ఖిలాడీ 14’లో ఒక పోటీదారుగానూ కనిపించనుంది. ప్రస్తుతం రొమేనియాలో ఆ షో చిత్రీకరణలో పాల్గొంటోంది. ఇది పూర్తవగానే తన మొదటి సినిమా చిత్రీకరణ మొదలు కానుంది. ‘పట్టుబట్టి బరువు తగ్గడం.. రావనుకున్నచోటే మోడలింగ్‌ అవకాశాలు చేజిక్కించుకోవడం.. సినిమాల్లో నటించడం.. ఇలా నేను అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. ఈ రియాలిటీ షోలోనూ సత్తా చూపించి నేనే విజేతగా నిలుస్తాననే నమ్మకం ఉంది’ అని ఆత్మవిశ్వాసంతో చెబుతోంది ఈ అమ్మడు. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని