ఐర్లాండ్‌.. 300 ఏళ్ల తర్వాత..

టెస్టు క్రికెట్లోకి మరో జట్టు అడుగు పెట్టింది. శ్వేత వర్ణ దుస్తులు ధరించి అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాలన్న ఐర్లాండ్‌ కల ఎట్టకేలకు నెరవేరింది.

Updated : 08 Dec 2022 21:56 IST

టెస్టు క్రికెట్లోకి మరో జట్టు అడుగు పెట్టింది. శ్వేత వర్ణ దుస్తులు ధరించి అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాలన్న ఐర్లాండ్‌ కల ఎట్టకేలకు నెరవేరింది. గత ఏడాది ఐసీసీ టెస్టు హోదా అందుకున్న ఆ జట్టు శుక్రవారం పాకిస్థాన్‌తో తన తొలి మ్యాచ్‌ను ఆరంభించింది. ఐతే ప్రపంచ క్రికెట్లో పసికూనలా కనిపిస్తున్న ఐర్లాండ్‌కు ఇప్పుడు జెంటిల్మన్‌ ఆటను ఏలుతున్న పెద్ద పెద్ద జట్ల కంటే సుదీర్ఘ చరిత్ర ఉంది. ఏకంగా 300 ఏళ్ల కిందటే ఐర్లాండ్‌లో క్రికెట్‌ ఆడినట్లు చరిత్ర చెబుతోంది. ఇందుకు ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ దేశానికి చెందిన ఫోనిక్స్‌ క్రికెట్‌ క్లబ్‌ను 1830లోనే ఆరంభించడం విశేషం. ఐతే ఫుట్‌బాల్‌, హర్లింగ్‌ లాంటి ఆటల ఆధిపత్యంలో క్రికెట్‌ కొట్టుకుపోయింది. ఆదరణ కొరవడి ఈ ఆట అక్కడ ఎదగలేకపోయింది. ఐతే 1969లో ఐర్లాండ్‌.. వెస్టిండీస్‌తో ఒక రోజు అనధికార టెస్టు ఆడటం విశేషం. ఆ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను 25 పరుగులకే కుప్పకూల్చడమే కాక.. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం ఆధారంగా మ్యాచ్‌ కూడా గెలిచిందా జట్టు. కానీ ఆ తర్వాత కూడా ఐర్లాండ్‌ క్రికెట్లో పెద్దగా పురోగతి కనిపించలేదు. ప్రపంచ క్రికెట్లో మళ్లీ ఐర్లాండ్‌ పేరు మార్మోగింది 2007 వన్డే ప్రపంచకప్‌లో. ఆ టోర్నీలో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లను ఓడించి సంచలనం సృష్టించిందా జట్టు. ఇక భారత్‌ ఆతిథ్యమిచ్చిన 2011 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై ఏకంగా 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ఐర్లాండ్‌ చరిత్రలో గొప్ప మైలురాయి. గత కొన్నేళ్లలో అసోసియేట్‌ దేశాలతో జరిగిన టోర్నీల్లో నిలకడగా రాణించడం ద్వారా టెస్టు హోదా పొందే అర్హత తమకుందని చాటుతూ వచ్చింది ఐర్లాండ్‌. ఎట్టకేలకు గత ఏడాది ఐసీసీ ఆ జట్టుకు హోదా కట్టబెట్టింది. ఇప్పుడు పాకిస్థాన్‌ లాంటి పెద్ద జట్టుతో తమ టెస్టు క్రికెట్‌ ప్రస్థానాన్ని ఆరంభించింది ఐర్లాండ్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని