Love: ప్రేమలో.. పాసా.. ఫెయిలా?

ప్రేమంటేనే ఒక పజిల్‌...మది ఇంకో మదిని చేరాలంటే ఒక సాహసం...గుండె మరో గుండెని పెనవేసుకోవాలంటే ఒక పరీక్ష... మనసులు కలిసిన మనుషులు దగ్గరవ్వాలంటే అతిపెద్ద సవాల్‌...

Updated : 15 Jun 2024 00:36 IST

ప్రేమంటేనే ఒక పజిల్‌...మది ఇంకో మదిని చేరాలంటే ఒక సాహసం...గుండె మరో గుండెని పెనవేసుకోవాలంటే ఒక పరీక్ష... మనసులు కలిసిన మనుషులు దగ్గరవ్వాలంటే అతిపెద్ద సవాల్‌...ఎన్నో అడ్డంకులు దాటితేగానీ ఒకమ్మాయి, అబ్బాయి ప్రేమికులవరు! ఇంతదాకా వచ్చిన ఆ ప్రేమికులు తమ ప్రేమ గాఢతకు పరీక్షలు పెట్టుకుంటున్నారు... ప్రేమ ఎంత మధురమో.. ప్రేమికులు అంత కఠినం అని నిరూపించుకుంటున్నారు. సరదాకో, సీరియస్‌గానో.. మొదలైనా ఈ పరీక్షలు సామాజిక మాధ్యమాలను ముంచెత్తుతున్నాయి. ప్రేమికుల్ని లిట్మస్‌ టెస్ట్‌లకు సిద్ధం చేస్తూ వైరల్‌ అవుతున్నాయి. ఇవిగోండి ఆ అన్నింట్లో కొన్ని. 

ప్రేమకే కన్నుకుట్టేలా.. బర్డ్‌ టెస్ట్‌

‘హే బేబీ.. ఓసారి ఆ అందమైన పక్షిని చూడు’ అని జంటలో గోముగా ఒకరంటారు. ప్రేమికుడు లేదా ప్రేమికురాలి స్పందన కోసం ఎదురు చూస్తారు. ఆ క్షణం ఏమాత్రం ఆలస్యం చేయకుండా లవర్‌ చెప్పింది శ్రద్ధగా ఆలకించాల్సిందే. విలు విద్య పోటీ పరీక్షలో అర్జునుడికి చిటారు కొమ్మన ఉన్న పక్షి కన్ను మాత్రమే కనిపించినట్టు ‘ఔను బేబీ.. ఆ పక్షి ఎంత బాగుందో’ అనాల్సిందే. ఇలా బాగా ఫీలై మరీ చెప్పడం.. ఆ ఇద్దరి మధ్యా దృఢంగా అల్లుకున్న బంధానికి సంకేతమట. ఇలా కాకుండా భాగస్వామి అసలు పట్టించుకోకుండా ఉండటం.. వ్యతిరేక అభిప్రాయం వ్యక్తం చేయడం.. చిరాకు పడటం చేశాడంటే.. ఇరువురి ప్రేమలో డేంజర్‌ బెల్స్‌ మోగుతున్నట్టే. అయితే ఒక్కసారి ఇలా జరగగానే ఇద్దరి మధ్యా గ్యాప్‌ మొదలైందని ఒక నిర్ణయానికి రావద్దు. నాలుగైదుసార్లు ఇలా అయితేనే అసలైన లెక్క. ‘షరతులు వర్తిస్తాయి’ అన్నట్టుగా ఈ పరీక్ష ఎప్పుడంటే అప్పుడు కుదరదు. పనిలో తీరిక లేకుండా ఉన్నప్పుడు ప్రేమిక ఈ పరీక్ష అస్సలే పెట్టొద్దు. ఈ ట్రెండ్‌ అంతర్జాలాన్ని ముంచెత్తుతోంది. వినడానికి సిల్లీగా అనిపించినా.. దీని వెనకాల సరైన కారణమే ఉందంటారు సైకాలజిస్ట్‌ జాన్‌ గోట్‌మన్‌. ఈయన యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌కి చెందిన పరిశోధకుడాయన. ప్రేమికులు లేదా భాగస్వాములు ఇలా చిన్న చిన్న పరీక్షలు పెట్టుకోవడం, మనసెరిగేలా ప్రతి విషయాన్నీ ఒకర్నొకరు పంచుకోవడం.. ఇద్దరి మధ్యా అన్యోన్యత పెరగడానికి దోహదం చేస్తుందని ఆరేళ్లు అధ్యయనం చేసి మరీ చెప్పాడీ లవ్‌ నిపుణుడు. 

ఫీల్‌ కాకుండా..ఆరెంజ్‌ పీల్‌ థియరీ

ప్రేమించిన అమ్మాయి.. వలచిన చెలికాడికి మహారాజ్ఞిలా ఆజ్ఞలు జారీ చేస్తుంది. మనసు దోచిన సుందరాంగుడికి ఎన్ని సపర్యలైనా చేస్తుంది. ప్రేమికులు, భాగస్వాముల అనుబంధం అలా ఉంటుంది మరి! కానీ కొందరు ఎంత ప్రేమించుకున్నా.. ఒకరికోసం ఒకరు చిన్న పనులు చేయడానికీ బద్ధకిస్తారు. నేనే ఎందుకు చేయాలంట? అని పంతానికి దిగుతారు. నా లవర్‌ అదే బాపతేనా? అని తెలుసుకోవడానికి లిసా విల్కిన్‌సన్‌ అనే కుర్రది తన ప్రియుడిని ‘ఈ ఆరెంజ్‌ తొక్క తీసి పెట్టవా’ అని అడిగింది. ఈ తొక్క గోల ఏంటని చిరాకు పడకుండా  చకచకా చేసి పెట్టాడు ఆ బుద్ధిమంతుడు. ఈ తతంగాన్నంతా వీడియో తీసి టిక్‌ టాక్‌లో పెట్టేసింది ఆ అమ్మడు. ఫీల్‌ మై లవ్‌ అంటూ.. ఈ ఆరెంజ్‌ పీల్‌ థియరీలో మీ భాగస్వాములను భాగం చేయమని కోరింది. ఇంకేం.. ట్రెండ్‌ రాజుకుంది. ఇదొక్కటే కాదు.. ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టమనడం.. కోరిన చోట డ్రాప్‌ చేయడం.. ఇలా ఏవేవో పురమాయిస్తూనే తమ ప్రేమకి పరీక్షలు పెట్టుకుంటున్నారు అభినవ ప్రేమికులు. ఇది కేవలం పరీక్షే కాదు.. ఇద్దరిలో ఎవరికైనా అలసటగా ఉన్నా, మూడ్‌ బాగా లేకపోయినా.. ఇలాంటి పనులు చేస్తుంటే అనుబంధం మరింత అల్లుకుంటుంది అని చెప్పేవాళ్లు చెబుతున్నారు. ‘తమ ప్రేమను గెలిపించుకోవడానికి ప్రేమికులకు ఎన్నో కఠిన పరీక్షలు ఎదురవుతాయి. వాటికి ముందే ఇలా చిన్నాచితకాగా పరీక్షిస్తుంటే కష్టకాలంలో సంసిద్ధులను చేస్తాయి’ అంటూ వంత పాడుతున్నాడు అమెరికన్‌ సైకాలజిస్ట్‌ రెనే కార్‌. 

ఏమండీ నా వారేనా?.. హజ్బెండ్‌ టెస్ట్‌

ముద్దొచ్చినప్పుడు అమ్మాయిలు తమ బోయ్‌ఫ్రెండ్‌ని ముద్దుగా ‘ఏమండీ మొగుడు గారూ’ అని పిలవడం కద్దే! అదే ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, టిక్‌టాక్‌లాంటి అతడి సామాజిక మాధ్యమ ఖాతాలోనే ‘హాయ్‌ హబ్బీ’ అని కామెంట్‌ చేస్తే...? కొంపలంటుకు పోతాయంటారా! కొన్నిసార్లు నిజమే కావచ్చు. కానీ ఇది ప్రేమకు సిసలైన పరీక్ష అంటున్నారు ఈ ట్రెండ్‌ ఫాలోయర్లు. ఇలా చేసినప్పుడు తప్పనిసరై వాళ్లు అక్కడే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అతగాడు వేరే రిలేషన్‌లో ఉన్నా.. అనుబంధాన్ని గుట్టుగా దాచాలని ప్రయత్నించినా దొరికిపోతాడు. ఇదికాకుండా నలుగురిలో ఉన్నప్పుడు అందరికీ వినపడేలా ‘హబ్బీ’ అని పిలుస్తుంది ప్రేమిక. దానికి సానుకూలంగా స్పందించారా.. సరేసరి. ‘అబ్బే మనం మరీ అంత క్లోజ్‌ కాదు’ అని గురుడు నసిగాడో బంధం ఏంటో అక్కడికక్కడే తేలిపోతుంది. కెంజీ గ్రీన్‌ అనే అమ్మాయి తన బోయ్‌ఫ్రెండ్‌ని పరీక్షించాలని టిక్‌టాక్‌లో సరదాగా ‘హాయ్‌ హజ్బెండ్‌ ఎక్కడున్నావ్‌? ఏం చేస్తున్నావ్‌?’ అంటూ ఒక చిన్న వీడియో పెట్టింది. అతగాడేమో ‘నేనేం నీ భర్తను కాదు’ అంటూ రిప్లై ఇచ్చాడు. అతగాడు కమిట్‌మెంట్‌తో లేడని అక్కడికక్కడే బ్రేకప్‌ చెప్పేసింది కెంజీ. వాళ్ల ప్రేమ అక్కడితో ముగిసినా.. ఈ పరీక్ష మాత్రం ఇతర ప్రేమికుల మధ్య ఇంకా సాగుతూనే ఉంది. ఇలా ప్రేమ విధేయత, గాఢత తెలుసుకోవడానికి.. పదుగురిలో పరీక్షించాల్సిన అవసరం లేదని సైకోథెరపిస్టులు చెబుతున్నా.. యువ ప్రేమికులు ఆగడం లేదు.

పెద్ద మతలబు.. టినీ పోర్షన్‌ థియరీ

క్యాండిల్‌ లైట్‌ డిన్నర్లు.. కలిసి భోంచేయడాలు ప్రేమికులకు మామూలే. దీన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లి టినీ పోర్షన్‌ థియరీకి తెర లేపారు ప్రేమికులు. ఈ సిద్ధాంతం ప్రకారం గాఢంగా ప్రేమించే అబ్బాయి ఎలాంటి రాద్ధాంతం చేయకుండా అమ్మాయికన్నా తక్కువ తినాలి. కలిసి తిన్న ప్రతిసారీ ఇది పాటించాలి. ప్లేట్లలో వడ్డించుకుంటున్నప్పుడే అమ్మాయి కన్నా తక్కువ వేయించుకోవాల్సిన బాధ్యత అబ్బాయిది. అమ్మాయి అధికంగా వడ్డిస్తున్నా వారించాల్సిందే. తర్వాత అమ్మాయి ఎక్కువైన భోజనాన్ని గోరుముద్దలు కలిపి ప్రియుడి నోటికందిస్తుంది. అతగాడూ కొసరికొసరి ఆమెకు తినిపిస్తాడు. ఇలా చేయడం ఇద్దరి మధ్యా కేరింగ్‌ పెరగడానికి దోహదం చేస్తుందని ప్రేమికుల నమ్మకం. ఆండీ, మిషెల్‌ అనే ప్రేమజంట ఈ ట్రెండ్‌కి ఆద్యులు. టిక్‌టాక్‌లో వైరల్‌గా మారిన ఈ ధోరణి వయా ఇన్‌స్టాగ్రామ్‌ ఆన్‌లైన్‌ని ముంచెత్తుతోంది.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని