Manasulo Mata: కాల్‌ కట్‌ అయ్యింది..గుండె ముక్కలైంది

డిసెంబర్‌ 25.. క్రిస్మస్‌. బయట వాతావరణం ప్రశాంతంగా ఉంది. నాలో మాత్రం కల్లోలం చెలరేగుతోంది. ఎందుకంటే మొదటిసారి ఓ అమ్మాయిని కలవబోతున్నా. కాసేపయ్యాక తనొచ్చింది.

Updated : 29 Apr 2023 07:24 IST

డిసెంబర్‌ 25.. క్రిస్మస్‌. బయట వాతావరణం ప్రశాంతంగా ఉంది. నాలో మాత్రం కల్లోలం చెలరేగుతోంది. ఎందుకంటే మొదటిసారి ఓ అమ్మాయిని కలవబోతున్నా. కాసేపయ్యాక తనొచ్చింది. నా బైక్‌ ఎక్కి కూర్చుంది. నేరుగా బిర్లామందిర్‌ వెళ్లాం. అక్కడే మాస్క్‌ తీశా. నన్ను చూడగానే తన ముఖంలో రంగులు మారాయి. ఇది ఊహించిందే. ఎందుకంటే నేను ఏమంత బాగోను. అయినా తప్పదుగా.. మెల్లగా గొంతు పెగిల్చా. నాకది పెళ్లిచూపుల సందర్భం.

ఫొటోలోకన్నా తను బయటే బాగుంది. ముఖ్యంగా ఆల్చిప్పల్లాంటి కళ్లు.. తీరైన ముక్కు నన్నాకట్టుకున్నాయి. నేను తనకి నచ్చుతానో.. లేదో తెలియదు. అయినా లోలోపల ఏదో ఆశ. నా మాటతీరు నచ్చిందో.. తన మంచితనమో.. మొత్తానికి తనూ కాసేపటికే నోరు విప్పింది. మనసులో స్వచ్ఛత.. కల్మషం లేని మాటలతో.. బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా ఇష్టాయిష్టాలు.. అభిరుచులు.. సరదా సంఘటనలు అన్నీ పంచుకుంది. మూడు గంటలు ఇట్టే గడిచిపోయాయి. నాకు ట్రైన్‌ సమయం దగ్గరపడుతోందనే విషయం గుర్తొచ్చి గాబరాగా కిందికొచ్చాం. తనని వీడి వెళ్తుంటే మనసులో చెప్పలేనంత బాధ. చాక్లెట్‌ ఇచ్చే సాకుతో మరోసారి తన హాస్టల్‌కి వెళ్లా. నాలుగు మాటలు.. నిండైన తన రూపం గుండెల్లో నింపుకొని తిరుగు ప్రయాణమయ్యా.

ట్రైన్‌ వేగంగా వెళ్తోంది. నా ఆలోచనలు మాత్రం తనచుట్టే తిరుగుతున్నాయి. వాటికి భంగం కలిగిస్తూ.. ఫోన్‌కాల్‌తో నా మనసు మీటింది. నాకు నిద్ర పట్టేంత వరకూ, నా మొబైల్‌కి సిగ్నల్స్‌ అందనంతవరకూ సరదాగా కబుర్లు చెప్పింది. ఆమె మాటల్ని బట్టి నేనంటే తనకూ ఇష్టమేనని అర్థమైంది.

సంక్రాంతి పండగొచ్చింది. ‘నేను గోదావరికి వెళ్తున్నా. నువ్వూ రావొచ్చుగా’ అంది గోముగా.. అడక్కముందే దేవత వరమిచ్చినట్టు. ఇద్దరిదీ ఒకే బోగి. అర్ధరాత్రి అలసిపోయేదాకా కబుర్లు చెప్పుకున్నాం. కళ్లు మూతలు పడుతుండగా.. తన ఒళ్లో తల పెట్టి సేదతీరా. ఇలాంటివి సినిమాల్లోనే జరుగుతాయనుకున్నా. నా విషయంలోనూ నిజమయ్యేసరికి సంతోషం పట్టలేకపోయా. పండగ బాగా జరుపుకొన్నాం. సెలవులు పూర్తవుతుండగానే మళ్లీ పిలుపొచ్చింది. మళ్లీ ఒకే ట్రెయిన్‌. ఒకటే బోగి. ఈసారి ఇద్దరి మధ్యా చనువు మరింత పెరిగింది. చొరవగా నా చేయిని తన చేతిలోకి తీసుకుంది. ప్రయాణం పూర్తయ్యేవరకూ ఒకర్నొకరం క్షణం విడిచి ఉండలేదు. ట్రైన్‌ దిగుతున్నప్పుడు ఎన్నో బాసలు చేసుకున్నాం. భారంగా సెలవు తీసుకొని ఎవరి ఉద్యోగాలకు వాళ్లు వెళ్లాం.

మా పెళ్లి చూపులు పెద్దలు కుదిర్చినవే. తొందర్లోనే మా మనసులూ కలిశాయి. అంతా ఓకే అనుకుంటుండగానే దుస్సంప్రదాయాలు, మూఢ నమ్మకాలు, నష్టజాతకురాలు అంటూ ఏవేవో అవాంతరాలు వచ్చిపడ్డాయి. దురదృష్టం నన్ను వెంటాడింది. మావాళ్ల తీరుతో మా ఇద్దరి మధ్య ఒక గ్యాప్‌ ఏర్పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో నేను అమ్మానాన్నల మాట వినాల్సి వచ్చింది. ఇదే ఆమెకు సిల్లీగా అనిపించింది. నన్ను మాట మీద నిలబడలేని వ్యక్తిగా అనుకుంది. కొద్దిరోజులకు జరిగిన తప్పేంటో నాకు అర్థమైంది. నెలరోజులు శతవిధాలా ప్రయత్నించి.. ఆ అమ్మాయినే చేసుకుంటాను అని మా కుటుంబాన్ని ఒప్పించగలిగా. పట్టరాని సంతోషంతో తనకి కాల్‌ చేశా.

అప్పటికే తన మనసు ముక్కలైపోయింది. ‘నిన్ను ఇష్టపడిన మాట వాస్తవం. కానీ నాకు విలువ లేని చోటికి రాలేను.. ఈ సంబంధం నాకిష్టం లేదు’ అని నా గుండెలో బాంబ్‌ పేల్చింది. తనని ఎంతో బతిమాలా. ఆమెకి అన్నయ్యలాంటి స్నేహితుడితో చెప్పించా. ప్చ్‌.. వినలేదు. ఆఖరికి ఓరోజు ఫోన్‌ చేశా. ‘నా అభిప్రాయంలో ఎలాంటి మార్పు లేదు. పదేపదే ప్రయత్నించి నీ సమయం వేస్ట్‌ చేసుకోవద్దు’ అని ఒకే మాట చెప్పి కాల్‌ కట్‌ చేసింది. నా గుండె ముక్కలయ్యింది. తనతో జీవితం పంచుకోవాలి అని ఆరాటపడ్డ నేను చివరికి తన దృష్టిలో రెండు నెలల పరిచయస్తుడిలా మిగిలిపోయా. ఇప్పుడు తనని తప్ప వేరొకర్ని చూడటానికి నా మనసు అంగీకరించడం లేదు. ఇదంతా మీతో ఎందుకు చెబుతున్నానంటే.. ఒక బంధం ముడిపడాలంటే.. రెండు మనసులు కలవాలి. ఒక సంసారం నిలబడాలంటే పరస్పరం సర్దుకుపోయే గుణముండాలి. మూఢనమ్మకాలంటూ ముందుకెళ్తే.. ఏ అనుబంధమూ నిలబడదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని