Love Letter: ఓటు మీదొట్టు.. నువ్వే నా జట్టు

ఎన్నికల రోజు ఓటెయ్యడానికి వరుసలో నిల్చున్నప్పుడు అనుకోకుండా నా చూపు నీపై పడింది. నిర్మలంగా.. ప్రశాంతంగా.. అప్పుడే తెరిచిన కొత్త ఈవీఎం యంత్రంలా ఎంతందంగా మెరిపోతున్నావనీ! ‘

Updated : 01 Jun 2024 01:03 IST

వెరైటీ ప్రేమలేఖ

 

ఎన్నికల రోజు ఓటెయ్యడానికి వరుసలో నిల్చున్నప్పుడు అనుకోకుండా నా చూపు నీపై పడింది. నిర్మలంగా.. ప్రశాంతంగా.. అప్పుడే తెరిచిన కొత్త ఈవీఎం యంత్రంలా ఎంతందంగా మెరిపోతున్నావనీ! ‘ముందుకెళ్లండి ముందుకెళ్లండి’ అని పోలీసు అదిలిస్తేగానీ నేను నీ మైకం నుంచి బయటికి రాలేకపోయాను. అప్పటిదాకా ఏ పార్టీకి ఓటేయాలనే విషయం తేల్చుకోలేకపోయానుగానీ.. నిన్ను చూశాక అప్పటికప్పుడే నువ్వే నా అర్ధాంగి అని ఫిక్స్‌ అయ్యాను. నేను ఓటేసిన నాయకులు నాకేం చేస్తారో తెలియదు కానీ.. నీ కోసం నేనేం వాగ్దానాలు చేయాలో అని ఆలోచనల్లో పడిపోయాను. మనిద్దరం ఒకేసారి బూత్‌ లోపల అడుగు పెడుతుంటే.. నాకు పెళ్లి మండపంలోకి అడుగు పెడుతున్నట్టే అనిపించింది. 

లోపల ఉన్న అధికారులు మన పెళ్లికి పెద్దలుగా.. వాళ్లు చెప్పే సూచనలు పెళ్లి మంత్రాలుగా భావించాను. నా వేలి మీద ఇంకు ముద్ర వేస్తుంటే.. నీ తల మీద నేను జీలకర్ర, బెల్లం పెట్టినట్టుగానే ఊహించుకున్నాను. నా అదృష్టంకొద్దీ నువ్వు నా వెనుకే నడిచొస్తుంటే.. నా అడుగులో అడుగేసి, ఏడడుగులు నడిచినట్టే అనిపించింది. మొదటి ఓటు మీట నొక్కుతు న్నప్పుడు నేను నీ నుదుటన బొట్టు పెట్టినట్టుగా.. రెండో ఓటు వేస్తుంటే నిన్ను ఒడిసి పట్టుకున్నట్టుగా అనుభూతి చెందాను. ఓటింగ్‌ పూర్తై, బయటికొస్తున్నప్పుడు నువ్వు నవ్వుతూ నన్ను ఓ చూపు చూశావు చూడూ.. అది జూన్‌ 4 తేదీలా సస్పెన్స్‌కి తెర తీసింది. ఈవీఎంలోని అభ్యర్థి జాతకంలా ఆ నవ్వు నా ప్రేమ గెలుపునకు సంకేతం అనుకోవాలా.. ఓడిపోయిన క్యాండిడేట్‌ని ఎగతాళి చేసినట్టుగా భావించాలా.. నాకేమీ అర్థం కాకుండా ఉంది. అయినా ఫర్వాలేదు.. ఎన్నిసార్లు ఓడిపోయినా, విజయం కోసం పట్టు వదలకుండా మళ్లీమళ్లీ పోటీ చేసే అభ్యర్థిలా నీకోసం ఎదురుచూస్తూనే ఉంటా. మీ ఇంట్లోవారు పులివెందుల, కుప్పం, పిఠాపురం ఏ ఊరి వారైనా భయపడేది లేదు. నువ్వు సై అంటే అమరావతి, విశాఖపట్నం, కర్నూలును సైతం పక్కనపెట్టి అసెంబ్లీ ప్రాంగణం సాక్షిగా పెళ్లి చేసుకుంటా. కుల, మత, వర్గ, ప్రాంతాలకతీతంగా పరిపాలి స్తామని సీఎం, పీఎం ప్రమాణం చేసినట్టే.. నా విషయంలో మీవాళ్లు అలాంటివేం చూడకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. 
ఇట్లు నీ నోటా స్వస్తిక్‌
- చుండూరి సత్య, పాత గాజువాక  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని