Father: ప్రతి నాన్నా ఓ చదవని పుస్తకం

ఆరుబయట నులక మంచంపై పడుకొని ఆకాశంలోకి చూస్తూ.. ప్రేమ, పెళ్లి కలల్లో విహరిస్తున్నా. కాసేపటికి చిన్నగా అలికిడి అయితే పక్కకి చూశా.

Published : 15 Jun 2024 00:28 IST

ఆరుబయట నులక మంచంపై పడుకొని ఆకాశంలోకి చూస్తూ.. ప్రేమ, పెళ్లి కలల్లో విహరిస్తున్నా. కాసేపటికి చిన్నగా అలికిడి అయితే పక్కకి చూశా. ఎప్పుడొచ్చారో తెలియదు.. నా పక్కనే కూర్చుని ఏదో దీర్ఘాలోచనలో ఉన్నారు నాన్న. దిగాలుగా ఉన్న ఆయన్ని చూసి ‘ఏమైంది నాన్నా?’ అనడిగా. నాలుగు క్షణాలు నిట్టూర్చి.. ‘ఏంటోరా.. పిల్లల్నైతే చదివించానుగానీ.. వాళ్లు మంచి ఉద్యోగంలో కుదురుకోవాలనే నా కోరిక మాత్రం తీరడం లేదు’ అంటూ అటువైపు తిరిగి కన్నీటి చెమ్మను తుడుచుకుంటుంటే నా మనసు కలుక్కుమంది. ఆయన్ని అలా కూర్చోబెట్టి మెల్లగా కాళ్లు నొక్కసాగా. ఎక్కడ నా చేతులు తెగిపోతాయేమో అన్నట్టుగా ఉన్నాయి ఆ కాళ్ల పగుళ్లు. మాకోసం ఆయన ఎంత కష్టపడుతున్నా.. ఇంత బాధగా ఎప్పుడూ కనిపించలేదు. ఒక్కసారిగా గతంలోకి జారుకున్నా.

నాకు ఊహ తెలిసిన దగ్గర్నుంచి నాన్న ఏనాడూ మంచి దుస్తులు కట్టింది లేదు. మాకు మాత్రం ప్రతి పండక్కీ కొత్తవి తెచ్చేవారు. ఆయన ఎప్పుడూ కీప్యాడ్‌ ఫోనే వాడేవారు. మాకేమో అడిగిన స్మార్ట్‌ఫోన్‌ కొనిచ్చే వారు. అమ్మానాన్నలిద్దరూ తెల్లవారు జామునే లేచేవారు. ఇంట్లో పనులన్నీ చేసుకొని, రెండుమూడు ఇడ్లీలు తిని పొలానికి వెళ్లేవారు. ఏ మధ్యాహ్నానికో వచ్చి.. వీలైతే కూరతో లేదా పచ్చడి మెతుకులు తిని వెళ్లిపోయేవారు. అదీకాకుండా ఏమాత్రం ఖాళీగా ఉన్నా.. వేరే చోట పనికి వెళ్లేవారు. నాకు ఒక్కోసారి అనిపించేది.. ‘డబ్బుమీద ఎందుకింత ఆశ? ఉన్నంతలో సౌకర్యవంతంగా ఉండొచ్చుగా’ అని. నేను ఎప్పుడైనా నాన్నతో కలిసి బజారుకెళ్తే.. కూలీ నుంచి మోతుబరిదాకా.. అందరినీ పేరుపేరునా పలకరించేవారు. ‘ఈయనకేంటి ఇంత చాదస్తం.. అందర్నీ పలకరించడం అవసరమా?’ అనుకునే వాడిని. ఓసారి ఏదో పని ఉండి నేను ఒక్కడినే బయటికొచ్చా. ఒక పెద్దాయన నన్ను ఆపి నాన్న గురించి అడిగారు. ‘నవ్వుని ముఖానికి అతికించుకున్నట్టు.. మీ నాన్న ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు బాబూ. పని తప్ప ఆయనకేం పట్టదు’ అన్నారు. ఆ మాటలు నాకెక్కడో తగిలాయి. నాన్నకి సరదాలంటూ ఏమీ లేవు. సౌకర్యాలూ అంతంతే. విలాసాల గురించి తెలియనే తెలియదు. కోరినవన్నీ దక్కుతున్నా.. ఇంకా ఏదో వెలితి ఉందని ఆలోచించేవాణ్ని నేను. మరి ఆయనేంటి? ఏమీ లేకుండానే అన్నీ ఉన్నట్టుగా ఎందుకంత సంతోషం? గొప్పగొప్ప వ్యక్తులు, మహనీయుల గురించి నేను పుస్తకాల్లోనే చదువుకున్నా. బాగా ఆలోచించాక.. నాన్న వాళ్లకంటే ఎందులో తక్కువ అనిపించింది.

అన్నింట్లో సర్దుకుపోయి.. ప్రతిదాంట్లో సంతోషం వెతుక్కునే నాన్న కళ్లనీళ్లు పెట్టుకున్నారంటే నిజంగా ఆయన మనసు గాయపడిందనే అర్థం. దానిక్కారణం మేం ఉద్యోగాల్లో స్థిరపడక పోవడమే. ఎంతో చేసిన నాన్నకు ప్రేమతో కొంతైనా చేయాలని బాగా కష్టపడ్డా. అలుపెరుగకుండా ప్రయత్నించా. మరీ గొప్పదేం కాదుగానీ.. ఒక పేరున్న సంస్థలో చిన్న ఉద్యోగం సాధించా. మొదటి జీతం రాగానే అమ్మా నాన్నలకు కొత్త బట్టలు తీసుకున్నా. ఆ క్షణం ఆయన మనసులో ఉన్నది తెలుసుకోవాలనుకున్నా. ‘నాన్నా.. మేం ఎప్పుడూ బాగుండాలనుకుంటారు. కోరినవన్నీ కొనిపెడతారు కదా.. ‘నేనూ వాళ్లలా ఉంటే బాగుండు’ అని ఎప్పుడైనా అనుకున్నారా?’ అనడిగా. దానికాయన పెద్దగా నవ్వుతూ.. ‘మీరు అందంగా కనిపిస్తే నేనూ అందంగా ఉన్నట్టేరా. మీకు సౌకర్యంగా ఉంటేనే నాకు సంతోషం నాన్నా.. మీ మంచి భవిష్యత్తే నేను సాధించే గొప్ప విజయం’ అంటుంటే నా కళ్లలో నీళ్లు ఆగలేదు. రోజూ చూస్తున్న నాన్నేగా.. ఆయన గురించి మాకు అంతా తెలుసు అనుకుంటారు చాలామంది పిల్లలు. కానీ ప్రతి నాన్న మనకు తెలియని ఓ గొప్ప పుస్తకం. అప్పుడప్పుడూ చదవడానికి ప్రయత్నించండి.

- రామాంజనేయులు 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని