హద్దు మీరితే..రంగు పడుద్ది..!

ఫుట్‌బాల్‌, హాకీ క్రీడాకారులు శ్రుతి మించితే.. అంపైర్లు వారికి కార్డులు చూపించి వెంటనే

Updated : 22 Nov 2022 22:19 IST

ఫుట్‌బాల్‌, హాకీ క్రీడాకారులు శ్రుతి మించితే.. అంపైర్లు వారికి కార్డులు చూపించి వెంటనే వారిపై చర్యలు తీసుకుంటారు. ఇది అందరికీ తెలిసిందే. ఎక్కువ మందికి తెలియని విషయమేంటంటే.. బ్యాడ్మింటన్‌లోనూ ఇలానే చేస్తారు! మొన్న బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ సూపర్‌ సిరీస్‌ సెమీఫైనల్‌ సందర్భంగా పి.వి. సింధుకు అంపైర్‌ ఎల్లో కార్డు ఇచ్చి హెచ్చరిక జారీ చేశాడు. చెన్‌ యుఫైతో మ్యాచ్‌లో అలసిపోయిన ఆమె పాయింట్ల మధ్యలో ఎక్కువ విరామం తీసుకుంటుండటంతో అంపైర్‌ ఎల్లో కార్డును ప్రయోగించాల్సి వచ్చింది. అసలు బ్యాడ్మింటన్‌లో ఎన్ని కార్డులుంటాయి. ఎప్పుడు, ఏవి, ఎందుకు ఇస్తారన్న సంగతి చూద్దామా..!

బ్యాడ్మింటన్‌లో మొత్తం మూడు కార్డులుంటాయి. షట్లర్లు క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా నడుచుకున్నప్పుడు లేదంటే నిబంధనలను ఉల్లంఘించినప్పుడు అంపైర్లు వీటిని ఉపయోగిస్తారు. బీడబ్ల్యూఎఫ్‌ నియమావళి ప్రకారం బ్యాడ్మింటన్‌ మ్యాచ్‌ ఆరంభమయ్యాక ముగిసే వరకు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగాలి. గేమ్‌లో ఎవరో ఒకరు 11 పాయింట్లు చేరుకున్నాక ఒక నిమిషం.. గేమ్‌ ముగిశాక 2 నిమిషాల విరామం ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో ఇంతకు మించి షట్లర్లు ఎక్కువ విరామం పొందేందుకు వీల్లేదు. ఆట మధ్యలో షట్లర్లు కోచ్‌ల సలహాలు పొందేందుకు వీల్లేదు. అంపైర్‌ అనుమతి లేకుండా క్రీడాకారులు కోర్టు వీడకూడదు. ఉద్దేశపూర్వకంగా ఆటకు అంతరాయం కలిగించకూడదు. ప్రత్యర్థి, అంపైర్‌ లేదా ప్రేక్షకులకు హాని కలిగించడం, షటిల్‌ను దెబ్బతీయడం, దుర్భాషలాడటం, రాకెట్‌ను నెట్‌కేసి, నేలకేసి కొట్టడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తాయి. ఇలాంటి సమయంలో మ్యాచ్‌ను పర్యవేక్షించే అంపైర్‌.. షట్లర్‌ చేసిన తప్పు తీవ్రత ఆధారంగా తొలుత మాటలతో హెచ్చరిక జారీ చేస్తాడు. అప్పటికీ దారిలోకి రాకపోతే కార్డులను ప్రయోగిస్తాడు.

ఎల్లో కార్డు: మాటలతో షట్లర్‌ వినని సందర్భంలో అంపైర్‌ ఈ కార్డును ప్రయోగిస్తాడు. ఇది అధికారిక హెచ్చరిక. ఎల్లో కార్డు జారీ చేశాక షట్లర్‌ తీరు మార్చుకోవాలి. లేదంటే అంపైర్‌ రెడ్‌ కార్డు జారీచేస్తారు.

రెడ్‌ కార్డు: ఎల్లో కార్డు ఇచ్చినా షట్లర్‌ తీరు మారనప్పుడు.. లేదంటే తీవ్రమైన తప్పు చేసినప్పుడు అంపైర్‌ ఈ కార్డు చూపిస్తాడు. రెడ్‌ కార్డు ఎదుర్కొంటే ఆ ఆటగాడు సర్వీస్‌ కోల్పోతాడు. ప్రత్యర్థి ఆటగాడి ఖాతాలో పాయింటు చేరుతుంది. రెడ్‌ కార్డు ఎప్పుడు ఏ సందర్భంలో ఇచ్చినా అంపైర్‌ రిఫరీని కోర్టులోకి పిలిచి.. తాను ఎందుకు రెడ్‌ కార్డు ఇచ్చానన్నది వివరిస్తాడు. రిఫరీ.. ఆటగాడి ప్రవర్తన తీరు స్థాయి ఆధారంగా రెడ్‌ కార్డునే కొనసాగించాలా.. లేదంటే షట్లర్‌కు బ్లాక్‌ కార్డు చూపించాల్సిన అవసరముందా అన్నది నిర్ణయిస్తాడు.

బ్లాక్‌ కార్డు: ఈ కార్డు ఎదుర్కొన్న ఆటగాడిపై అనర్హత వేటు పడుతుంది. బ్లాక్‌ కార్డు ఇచ్చే అధికారం రిఫరీకి మాత్రమే ఉంటుంది. షట్లర్‌ ఉల్లంఘన తీవ్రమైందని రిఫరీ భావిస్తే.. అతడు తన దగ్గర ఉన్న బ్లాక్‌ కార్డును అంపైర్‌కు ఇస్తాడు. అంపైర్‌ బ్లాక్‌ కార్డు చూపించిన వెంటనే షట్లర్‌పై అనర్హత వేటు పడుతుంది. ఇక ఆ టోర్నీలో ఆటగాడు కొనసాగే వీలుండదు. ఒకవేళ అతడికి సింగిల్స్‌ మ్యాచ్‌ సందర్భంగా ఈ బ్లాక్‌ కార్డు చూపిస్తే.. డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కూడా ఆడే వీలుండదు.

పదే పదే ఉల్లంఘనలకు పాల్పడే షట్లర్లపై జరిమానా కూడా విధిస్తారు. రెడ్‌ కార్డు ఎదుర్కొన్న ప్రతీసారి షట్లర్‌పై 500 అమెరికా డాలర్ల జరిమానా పడుతుంది. ఓ ఏడాదిలో మూడు ఎల్లో కార్డులకు 500 డాలర్ల జరిమానా విధిస్తారు. ఆ తర్వాత ప్రతి ఎల్లో కార్డుకు 250 డాలర్ల జరిమానా ఉంటుంది.

- సుధాకర్‌ వేమూరి, ఒలింపిక్‌ రిఫరీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని