వలస పిల్లల కోసం...

వలస జీవితం అంత సాఫీగా సాగదు. ఉన్న వూరినీ... ఆప్యాయతలు పంచిన నేలను వదులుకుని...

Updated : 08 Dec 2022 19:38 IST

వలస పిల్లల కోసం...

లస జీవితం అంత సాఫీగా సాగదు. ఉన్న వూరినీ... ఆప్యాయతలు పంచిన నేలను వదులుకుని వెళ్లడం అంటే కష్టాలనీ, కన్నీళ్లని మూటకట్టుకుని వెళ్లడమే. కొత్త చోట అవమానాలు తట్టుకుని కొత్త బతుకుని తీర్చిదిద్దుకోవడమే. 22 సంవత్సరాల శ్రుతి స్వామినాథన్‌ కూడా అలాంటి చేదు గతాన్ని మూటకట్టుకున్న కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయే! ఓ సందర్భంలో అమెరికాలో చదువుకుంటున్నప్పుడు భారతీయురాలిగా తాను ఎదుర్కొన్న అనుభవాలని ఫొటోగ్రాఫర్‌ క్విట్జాల్‌మౌఖీతో పంచుకుంది. క్విట్జాల్‌మౌఖీ కూడా ఓ వలస కుటుంబానికి చెందిన అమ్మాయే. వాళ్ల అమ్మానాన్నలు అర్జెంటీనా, పెరూ దేశాలకు చెందిన వాళ్లు. శాన్‌ఫ్రాన్సిస్కో వంటి అభివృద్ధి చెందిన ప్రాంతంలో పెరిగినా తనకి కూడా ఇలాంటి అనుభవాలేం కొత్తకాదు. ‘నేను పుట్టి పెరిగిన దేశం ఇదే కదా అని నేను నా మనసుకి ఎన్ని సార్లు చెప్పుకున్నా నా చర్మం రంగు నేనెవరో నాకు ముల్లులా గుచ్చి చెప్పేది. తోటి స్నేహితులు కన్‌ఫ్యూజ్డ్‌ చైల్డ్‌ అంటూ ఉంటే ఏడుపాగేది కాదు. కానీ అలాంటి ఇబ్బందులు నాకొక్కదానికే కాదు నాలాంటి ఎందరికో అని తెలిశాక బాధ పడాలని అనిపించలేదు’ అంటుంది క్విట్జాల్‌. అలాని అంతటితో ఆగిపోలేదు. అచ్చం తనలాగే అంటే వలస వచ్చిన కుటుంబాల్లోని పిల్లలు ఎదుర్కొనే ఇబ్బందుల్ని ఫొటోలుగా, డాక్యుమెంటరీలుగా చిత్రీకరించడం మొదలుపెట్టింది. అలా అర్జెంటీనా, భారత్‌, ఇటలీ, పోలెండ్‌ నుంచి వచ్చిన వలస బిడ్డల జీవితాలని చిత్రీకరించడం మొదలుపెట్టింది. ఆమె చేసిన ప్రయోగం చిల్డ్రన్‌ ఆఫ్‌ ఇమ్మిగ్రెంట్స్‌గా నూయార్క్‌ టైమ్స్‌ ప్రశంసలు అందుకుంది. అందులో మన భారతీయ అమ్మాయి శ్రుతి స్వామినాథన్‌ కథ ఇది. ‘ నా స్నేహితురాళ్లంతా పిజాలూ, శాండ్‌విచ్‌లూ తీసుకెళ్తే నేను మాత్రం ఇంట్లో భారతీయ సంప్రదాయం ప్రకారం వండిన వంటలని తీసుకెళ్లేదాన్ని. వాళ్లతో కలిసి ఎలా తినాలో అర్థమయ్యేది కాదు. నా ఆకృతి భిన్నంగా ఉండేది. అప్పట్లో సిగ్గు పడేదాన్ని. కానీ ఇప్పుడైతే అలా చేయను’ అంటోంది శృతి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని