Love Letter: పెళ్లి మాటకి.. టాటా చెప్పింది

‘అప్పుడెప్పుడో మూతి మీద మీసమొచ్చింది. ఇప్పుడు బారెడు గడ్డం మొలిచింది. అడ్డం నిలువుగా పెరిగావ్‌.. అయినా పెళ్లి ఊసెత్తడమే లేదు’ అని అమ్మానాన్నలు రోజూ పెట్టే పోరు పడలేక ఓరోజు ఇక నా ప్యారీని వెతుక్కోవాల్సిందే అని ఫిక్సయ్యా.

Updated : 15 Apr 2023 07:14 IST

వెరైటీ ప్రేమలేఖ

‘అప్పుడెప్పుడో మూతి మీద మీసమొచ్చింది. ఇప్పుడు బారెడు గడ్డం మొలిచింది. అడ్డం నిలువుగా పెరిగావ్‌.. అయినా పెళ్లి ఊసెత్తడమే లేదు’ అని అమ్మానాన్నలు రోజూ పెట్టే పోరు పడలేక ఓరోజు ఇక నా ప్యారీని వెతుక్కోవాల్సిందే అని ఫిక్సయ్యా. కాసులకు కొదవలేని, అందంలో ఎవరికీ అందని ఓ అమ్మాయిని ప్రసాదించమని ఆ వడ్డీ కాసులవాడిని మొక్కడానికి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కా. అలా లోపలికి అడుగు పెట్టానో, లేదో.. ఇలా అడుగులో అడుగు వేసుకుంటూ ఓ అప్సరస వచ్చి నా ముందు కూర్చుంది. దేవదేవుడి దర్శనానికి వెళ్తుంటే ఈ దేవత ప్రత్యక్షమైందా.. అని సంబరపడ్డా. ఆ ముద్దుగుమ్మను చూస్తున్నప్పుడల్లా రైలు వేగం కన్నా.. నా గుండె వేగమే ఎక్కువ కాసాగింది. కాసేపటికే నా ఓరచూపులను పసిగట్టి ముసిముసిగా నవ్వి ఓ కొంటె సైగ విసిరింది. నన్ను పట్టించుకుంటుందో, లేదో అనే అనుమానంతో.. పట్టించుకోకపోతే నా పరిస్థితేంగాను అనే బాధతో ఉన్న నాకు.. ఆ ఓరచూపు కొన ఊపిరితో ఉన్న కరోనా రోగికి ఆక్సిజన్‌ అందించి ప్రాణం నిలిపినట్టుగా అయింది. చూపులు కలిసిన శుభవేళ.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మాటల్లోకి దిగా. డోలూ సన్నాయిలా మా మాటలు, అభిప్రాయాలు కలిసిపోతుంటే.. మనసులూ కలవడం తథ్యమని మురిసిపోయా. మా పెళ్లి బాజాలు మోగినట్టు, ఆ ముద్దుగుమ్మతో ముద్దూముచ్చట్లలో మునిగిపోతున్నట్టు పట్టపగలే కలల్లో విహరిస్తుంటే.. ‘హలో ఏమండీ’ అనే తన పిలుపుతో ఇలలోకి వచ్చా. ఆ ‘ఏమండీ’ అనే పదాన్ని కలకాలం తన నోటి వెంట వినాలని ఉవ్విళ్లూరా. ఆపై నేను చేరాల్సిన గమ్యం దగ్గరైనకొద్దీ తనకు చేరువ కావాలనే కోరిక ఎక్కువై.. ఆత్రం ఆపుకోలేక మనసులో ఉన్నది వెళ్లగక్కేశా. ఆపై ‘ఊ’ అంటుందా.. ‘ఊహూ’ చెబుతుందా అని ఊపిరి బిగపట్టా. నా టెన్షన్‌ని ఉఫ్‌మని ఊదేసి అటెన్షంతా తనపైనే పెట్టమన్నట్టుగా నా ప్రపోజల్‌కి పాజిటివ్‌గా స్పందించింది. తంతే బూరెల బుట్టలో పడ్డట్టుగా అయింది నా పరిస్థితి అని నాలో నేనే మురిసిపోతూ పెళ్లి తంతు గురించి ఆలోచించడం మొదలుపెట్టా. అంతలోనే దిగాల్సిన స్టేషన్‌ రావడంతో దిగులు ఎక్కువై డీలా పడిపోయా. తనూ నాలాగే ఫీలై.. ఏడుపు మొహం పెడుతుంది అనుకుంటే.. వస్తున్న నవ్వుని ఆపుకుంటూ ‘టాటా.. బైబై’ అనడంతో ఆశ్చర్యపోయా. అయినా ఆశగా ‘మన పెళ్లి సంగతేంటి?’ అని అడిగితే ఫక్కున నవ్వి.. ‘ఇది ఏప్రిల్‌ నెల కదా.. నేనింతవరకు ఎవరినీ ఫూల్‌ చేయలేదు. మొదటిసారి మీరే ఆ అవకాశం ఇచ్చారు’ అని కూల్‌గా చెప్పింది. ఆ మాట విని నవ్వాలో, ఏడవాలో తెలియక.. ఫూల్‌ని అయ్యాననే విషయం పదేపదే గుర్తొచ్చి ఏదైనా స్విమ్మింగ్‌పూల్‌లో దూకి చావాలనుకున్నా. కానీ వెంకటాద్రి పోతే.. ‘సప్తగిరి’ లేదా.. అక్కడా కుదరకపోతే ‘వందేభారత్‌’లో అయినా నన్ను వలచే అమ్మడు దొరకదా.. అని నన్ను నేనే ఓదార్చుకున్నా. భారంగానే తిరుమలకు వెళ్లి పెళ్లి కావాలని మెుక్కుకుని ఇంటికి చేరుకున్నా.

సాంబశివారెడ్డి, కడప


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని