Updated : 01 Jun 2019 01:34 IST

ఫ్యాషనో..నో..నో

2019లో ఈ పది వద్దు

ఫ్యాషన్‌... ఎప్పుడూ మారుతుంటుంది. కొత్తవి పాతవై పోతుంటాయి. పాతవి కొత్తగా అలరిస్తుంటాయి. ఎన్ని రకాలు వస్తున్నా యువత వాటిని ఫాలో అవుతూనే ఉంటారు. అయితే ఫ్యాషన్‌ ప్రపంచంలో ట్రెండీగా ఉన్నవి ధరించడం ఎంత ముఖ్యమో! అవుట్‌డేటెడ్‌ అయినవి వేసుకోకపోవడమూ అంతే అవసరం. మనం ఎంత అందంగా తయారైన, ఎంత ట్రెండీగా ఉన్నా కొన్నిసార్లు చేసే చిన్న పొరపాట్లు మనల్ని ఇబ్బందుల్లో పడేస్తాయి. అందుకే ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటూ కొన్నింటిని దూరం పెట్టక తప్పదు. 2019 సంవత్సరానికి గాను కొన్ని ఫ్యాషన్లను వదిలేయమని డిజైనర్లు సూచిస్తున్నారు. ఎందుకు వదిలేయాలంటే...
మనం ట్రెండ్‌ని ఫాలో అవుతున్నామా? లేదా? అని చెప్పడానికి ముందు ఏది ట్రెండో... ఏదీ కాదో తెలుసుకోవాలి. దీనివల్ల సగం విజయం సాధించినట్టే. ముఖ్యంగా యువత దీన్ని ఫాలో అవుతారు. మార్కెట్లోకి వచ్చిన కొత్త దుస్తులు కాస్త ఆలస్యంగా వేసినా ఫర్వాలేదు గానీ... ఫ్యాషన్‌ ప్రపంచం వదిలేసిన వాటిన ధరించకూడదని తెలుసుకోవటం యువత విధి. లేకపోతే నైట్‌అవుట్లకు వెళ్లినప్పుడు, పార్టీలు చేసుకుంటున్నప్పుడు, క్యాజువల్‌ మీటింగుల్లో పక్కవారి నుంచి విమర్శలు ఎదుర్కోక తప్పదు. పైగా ఇవి ఈసారి వద్దని డిజైనర్లు చెబుతున్నారంటే దాన్ని అన్నివిధాల పరిశీలించి, కష్టనష్టాలు బేరీజు వేసుకొని చెబుతారు. అయినా అవే ధరిస్తామంటే ఫ్యాషన్‌ ప్రపంచానికి దూరం అవుతారు.
ఇవి వద్దు
* బేర్‌బాడీపై సూట్‌: 2018లో బేర్‌బాడీ సూట్‌తో కొందరు ర్యాంప్‌ వాక్‌ చేశారు. కొన్ని చోట్ల దీన్ని ట్రెండీగానూ ఫాలో అయ్యారు. అయితే యువత దీనిపై పెద్దగా మొగ్గుచూపలేదని తేలింది. పైగా ఇది ఇతరులకు ఇబ్బందిగా మారిందని గ్రహించారు. అందుకే బేర్‌బాడీ సూట్‌ను వేసుకోకపోవడం మంచిదని చెబుతున్నారు.

* నెట్‌డ్‌ షర్ట్స్‌: ఇటీవల త్వరగా ఫేమస్‌ అయి... అంతే త్వరగా తిరస్కరణకు గురైన ఫ్యాషన్లలో... నెట్‌డ్‌ షర్ట్స్‌ ప్రముఖమైనవి. లోపల శరీరమంతా బయటికి కనిపించేలా ఉండే ఈ షర్ట్స్‌ను డిజైనర్లు వద్దంటున్నారు.

* ఈ రంగులొద్దు: కొన్ని రంగులు వేసుకోవడం వల్ల మనకు సరైన ట్రెండ్‌ తెలియదని అనుకుంటారు. అందుకే రంగుల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలి. నియాన్‌, డస్ట్‌ ఆరంజ్‌, రేసింగ్‌రెడ్‌, కోబాల్ట్‌ రంగులను 2019లో వాడకపోవడం మంచిదని ఫ్యాషన్‌ నిపుణులు సూచిస్తున్నారు.

* ఓవర్‌ సైజ్‌ జీన్స్‌.. స్లాష్‌డ్‌ జీన్స్‌: పెద్ద సైజ్‌ జీన్స్‌ ఎప్పుడూ వాడరనుకో... అయితే స్లాష్‌డ్‌ జీన్స్‌పై కొంతమోజు ఉంటుంది. మీదగ్గర ఇలాంటి జీన్స్‌ ఉన్నా ఈ సంవత్సరానికైతే వీటిని వేసుకోవద్దు. ఎందుకంటే 2019లో వీటిని ‘అవైడ్‌’ జాబితాలో చేర్చారు.

* వైట్‌ సాక్స్‌: ఫార్మల్‌గా అయినా, క్యాజువల్‌గా అయినా వైట్‌ సాక్స్‌ వేసుకోవద్దు. ముదురు రంగుల సాక్సులే ఈ ఏడాది వాడండి. అప్పుడే మీరు అప్‌డేట్‌ అయినట్లు గుర్తింపు లభిస్తుంది.

*  కౌబాయ్‌ షూ: ఫ్యాషన్‌ ప్రపంచంలో ఎప్పుడూ ఈ కౌబాయ్‌ బూట్లపై చర్చ నడుస్తూనే ఉంటుంది. 2019లో మాత్రం వీటిని అవైడ్‌ జాబితాలో ఉంచారు. కాబట్టి ధరించకపోవడమే మంచిది.

* హైకట్‌ షార్ట్స్‌: ఇటీవల అమ్మాయిలు ఎక్కువగా హైకట్‌ షార్ట్స్‌ వేస్తున్నారు. అయితే ఇవి అసభ్యంగా ఉంటున్నాయని, చాలా మంది ఇబ్బంది పడుతున్నారని గ్రహించారు. అందుకే వీటిని ధరించవద్దని చెబుతున్నారు.
* ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ జాకెట్లు: యువతలో జాకెట్లంటే ఇష్టపడని వారుండరు. ఎందుకంటే ఇవి మన లుక్‌ని మరోస్థాయికి తీసుకెళతాయి. అయితే ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ జాకెట్లను వదిలేయమని సూచిస్తున్నారు డిజైనర్లు. షార్ట్‌కట్‌, జీన్స్‌, స్లీవ్‌ జాకెట్లనే వాడమంటున్నారు.

* ఓవర్‌ ఆల్స్‌: ఓవర్‌ఆల్స్‌ చిన్నపిల్లలకైతే ముద్దుగానే ఉంటాయిగానీ, పెద్దల విషయంలో ఇవి అవుట్‌డేటెడ్‌ ఫ్యాషన్‌.
* టర్టిల్‌ నెక్‌: వర్షా, శీతాకాలాల్లో టర్టిల్‌ నెక్‌ టీషర్ట్‌, షర్ట్‌ వేసి...దానిపై సూట్‌ వేసుకోవడం చాలా మందికి నచ్చుతుంది. 2019లో మాత్రం వీటిని అవైడ్‌ చేయమని చెబుతున్నారు. ఇప్పుడివి అవుట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు