లీసా లేడీ!

మనం వాడుతున్న ఏ సర్వీసునైనా తీసుకోండి. ఉదాహరణకు బ్యాంకింగ్‌. మీరేదో బ్యాంకుకి వెళ్లారు. అక్కడ ఏయే సేవలు ఎలా అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలంటే? ‘హెల్ప్‌డెస్క్‌’ అని రాసున్న టేబుల్‌ దగ్గరికి వెళ్లాలి. అక్కడ కొన్నిసార్లు ఎవరూ ఉండరు.

Published : 08 Jun 2019 01:38 IST

కృత్రిమ మేధస్సుతో

మనం వాడుతున్న ఏ సర్వీసునైనా తీసుకోండి. ఉదాహరణకు బ్యాంకింగ్‌. మీరేదో బ్యాంకుకి వెళ్లారు. అక్కడ ఏయే సేవలు ఎలా అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలంటే? ‘హెల్ప్‌డెస్క్‌’ అని రాసున్న టేబుల్‌ దగ్గరికి వెళ్లాలి. అక్కడ కొన్నిసార్లు ఎవరూ ఉండరు. ఉన్నా.. చుట్టూ వినియోగదారుల ప్రశ్నలతో సతమతమవుతుంటారు. మీ వంతు వచ్చే వరకూ వేచి చూడలేని పరిస్థితి. అప్పుడేం చేస్తారు? బ్యాంకు కస్టమర్‌ కేర్‌కి ఫోన్‌ చేస్తారు. అప్పుడూ అంతే.. ‘ఒకటి నొక్కండి.. రెండు నొక్కండి..’ అంటూ చెప్పే సూచనలతో విసుగు వస్తుంది. ఇంకాస్త ముందుకెళ్లి బ్యాంకు సైట్‌లోని ‘ఫ్రీక్వెంట్లీ ఆస్క్‌డ్‌ క్వశ్చన్స్‌’ చూస్తారు. కావాల్సిన సమాచారం కనిపించదు. ఓపిగ్గా ఏదైనా లైవ్‌ ఛాటింగ్‌ వేదిక ఉందేమోనని చూస్తారు. మీ సమస్యని టైప్‌ చేస్తారు. అట్నుంచి వచ్చే స్పందనని చదువుకుంటూ ఛాట్‌ చేస్తారు... ఇవన్నీ ఇప్పటి వరకూ మనుగడలో ఉన్న సంప్రదాయ పద్ధతులు. ఒక్క బ్యాంకు మాత్రమే కాదు. రంగం ఏదైనా వినియోగదారుడు తన సమస్యల్ని తెలిపేందుకు ఇప్పుడున్న మాధ్యమాలు ఇవే. వీటన్నింటికీ అతీతంగా.. యూజర్‌ ఫ్రెండ్లీగా.. పని చేసే మాధ్యమం ఏదైనా అందుబాటులోకి తేవాలి అనే ఆలోచనకి రూపమే కృత్రిమ మేధస్సుతో ప్రాణం పోసుకున్న ‘లీసా’.
 

* వినియోగదారుడిగా...  పొందుతున్న సర్వీసుపైనో.. కొన్న వస్తువు మీదనో.. ఏదైనా సమస్యా? అయితే, లీసాకి చెప్పొచ్చు! 
* ఉత్పత్తిదారుడిగా.. తయారు చేసిన వస్తువుపైనో.. అందిస్తున్న సేవల గురించో.. స్పందనని తెలుసుకోవాలా? వెంటనే, లీసాని కలవండి! 
* కంపెనీ నిర్వాహకుడిగా..ఉద్యోగుల ప్రోగ్రెస్‌ని విశ్లేషించడంలోనో.. కొత్త నియామకాలు చేపట్టడంలోనో.. ఇబ్బందులు ఉన్నాయా? ఆలస్యం చేయకుండా లీసాని పిలవండి! ... ఎవరీ ‘లీసా’ అనేగా?
అమెరికాలో ఇద్దరు తెలుగు యువకులు కృత్రిమ మేధస్సుతో సృష్టించిన లేడీ. ‘స్కిల్‌.ఏఐ’ పేరుతో అంకుర సంస్థని స్థాపించి.. ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. వారే వంశీ తమ్మన, హరి దోసపాటి. ఇంతకీ ఇరువురూ ప్రాణం పోసిన లీసా ఏం చేస్తుంది? రూపకర్తల జర్నీ ఏంటి? ‘ఈతరం’ పలకరిస్తే.. చెప్పారిలా..!

ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే..

మాది విజయవాడ. నాన్న ప్రైవేటు ఉద్యోగి. అమ్మ బ్యాంకులో పని చేసి రిటైర్‌ అయ్యారు. మధ్య తరగతి ఫ్యామిలీ. అందరిలానే సాఫ్ట్‌వేర్‌ చదువు అయ్యాక కొలువు. అమెరికా ప్రయాణం. ఇక్కడ ఉద్యోగిగా రోజుకి ఎనిమిది గంటలు పని చేస్తూనే ‘స్కిల్‌.ఏఐ’ అంకుర సంస్థని స్థాపించాం. రెండేళ్లుగా కష్టపడ్డాం. వైజాగ్‌లో 15 మంది ఉద్యోగులతో ఆఫీస్‌ని పెట్టుకుని ఆపరేషన్స్‌ చేస్తున్నాం. ఓ జాతీయ బ్యాంకు నిర్వాహకులు లీసాని ప్రయోగాత్మకంగా ఓ మూడు బ్రాంచ్‌ల్లో పరిశీలిస్తున్నారు. బ్యాంకుల్లో రెండు ఛాట్‌ బోట్‌లు నిత్యం పని చేస్తున్నాయి. ఒకటేమో.. బ్యాంకులోకి ప్రవేశిస్తున్న ఖాతాదారులతో మాట్లాడితే. మరొకటి బ్యాంకు నుంచి బయటికి వెళ్తున్న వారితో సంభాషిస్తుంది. అంటే.. ఒకటి లోపలికి వచ్చేవారి సమస్యల్ని పరిష్కరిస్తుంది. రెండోది.. బయటికి వెళ్లేవారి నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటుంది. రెండూ సేకరించిన సమాచారాన్ని బ్యాంకు నిర్వాహకులకు చేరవేస్తాయి.
- వంశీ

కలిసే ప్రయాణం..

మాది గుడివాడ. చదువు ముగిశాక కూడా ఇద్దరం కలిసే ప్రయాణం చేశాం. మన దేశంలోనే కాకుండా మలేసియా, సింగపూర్‌ దేశాల్లో పలు కార్పొరేట్‌ సంస్థలకు శిక్షకులుగా పనిచేశాం. సంస్థల్లోనే కాకుండా విడిగా సుమారు 800 మందికి శిక్షణ ఇచ్చే క్రమంలోనే ‘స్కిల్‌.ఏఐ’ ఆలోచనకు బీజం పడింది. ఎందుకంటే.. కాలేజీ చదువులు ముగించుకుని కార్పొరేట్‌ సంస్థల్లో ఉద్యోగం చేయాలనుకునేవారు ఎన్ని రకాల స్కిల్స్‌ని నేర్చుకున్నప్పటికీ వాటిని ఇంటర్వ్యూల్లో వ్యక్తం చేయడం క్లిష్టమైన అంశంగా తయారైంది. అందుకే వారికి మాక్‌ ఇంటర్వ్యూలు అందిస్తే ఎలా ఉంటుందని ఆలోచించాం. దాన్ని వ్యక్తులతో కాకుండా ఛాట్‌ బోట్స్‌ చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చాం. రెండేళ్ళు కష్టపడి ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీతో లీసాని ‘ఏఐ రిక్రూటర్‌’గా పరిచయం చేశాం. అప్పుడే క్యాంపస్‌ నుంచి బయటికి వచ్చిన గ్రాడ్యుయేట్‌ లీసా ముందు మాక్‌ ఇంటర్వ్యూలకు అటెండ్‌ అవ్వొచ్చు. మరో మూడు నెలల్లో ఈ సౌకర్యాన్ని యాప్‌లో ఉచితంగా అందిస్తాం. గత పదేళ్లుగా అందుబాటులో ఉన్న ఐవీఆర్‌ (ఇంట్రాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌) మాధ్యమాన్ని ఛాట్‌ బోట్‌లు రీప్లేస్‌ చేస్తున్నాయ్‌. దీనికి కృత్రిమ మేధస్సు తోడవడంతో విప్లవాత్మకమైన మార్పులు  చోటు చేసుకుంటున్నాయి. ఒక్క బ్యాంకింగ్‌ సేవల్లోనే కాదు. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, షాపింగ్‌ మాల్స్‌.. అన్ని చోట్లా ఛాట్‌ బోట్‌లు  ఇక మనకు కనిపిస్తాయ్‌.
- హరి

పరిధి విస్తృతం..
ఎక్కువ మంది ఉద్యోగుల్ని ఒకేసారి నియమించాల్సి వస్తే లీసా సాయం తీసుకోవచ్చు. ఉద్యోగుల్ని అడగాల్సిన ప్రశ్నల్ని లీసా మదిలో ఫీడ్‌ చేస్తే చాలు. ఇంటర్వ్యూలు చేసేస్తుంది. అభ్యర్థుల ముఖ కవళికలు, బాడీ లాంగ్వేజ్‌ను నిశితంగా పరిశీలిస్తూ ప్రశ్నలు అడుగుతుంది. ఉదాహరణకు మీరో కొత్త కంపెనీకి నియామకాలకు నోటిఫికేషన్‌ వేస్తే 1000 అప్లికేషన్లు వచ్చాయ్‌. మొదటి రౌండ్‌లో బేసిక్‌ ప్రశ్నలతో సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్‌ చేసి రెండో రౌండ్‌కి ఓ 500 మందిని సెలెక్ట్‌ చేయాలి అనుకుంటే.. ఆ పనిని లీసాకి అప్పగిస్తే చాలు. మ్యాన్‌ పవర్‌తో పని లేకుండా లీసా చేసేస్తుంది. అన్ని వివరాల్ని లైవ్‌లోనే కంపెనీ నిర్వాహకులకు పంపేస్తుంది. అమెరికాలో ఓ రవాణా కంపెనీకి పైలెట్‌ టెస్టింగ్‌ చేస్తున్నారు. రోజుకి ఓ 900 మంది డ్రైవర్లతో మాట్లాడి వారి సామర్థ్యానికి సంబంధించిన వివరాల్ని యాజమాన్యానికి లీసా చేరవేస్తుంది. దీంతో కంపెనీ నిర్వాహకులు సమర్థులైన డ్రైవర్లను ఎంపిక చేసుకోవడం సులభం అవుతోంది. మన దేశంలో ఓ మున్సిపల్‌ కార్పొరేషన్‌ లీసా సేవల్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. కార్పొరేషన్‌ వెబ్‌సైట్‌, యాప్‌ల్లో ప్రత్యేక లింక్‌ రూపంలో లీసా అందుబాటులో ఉంది... అదీ అక్కడి మాతృభాష హిందీలో. కార్పొరేషన్‌ పరిధిలో ఎవరైనా వారి సమస్యల్ని లీసాకి చెప్పొచ్చు. అందుకు తగినట్టుగా లీసాకి పది ప్రశ్నలతో కూడిన ప్రోగ్రామ్‌ని రూపొందించారు. ఆయా ప్రశ్నలు అడుగుతూ అక్కడి ప్రజలు ఎంతమేరకు సంతృప్తిగా ఉన్నారో తెలుసుకుంటుంది. వారి హావభావాల్ని గుర్తిస్తూ సమస్యకున్న తీవ్రతని అధికారులకు చేరవేస్తుంది. లీసాకి సంబంధించిన మరిన్ని వివరాలకు ‌www.skil.ai సైట్‌ని చూడండి.
ఫోన్‌లో ఉండి పలకరిస్తుంది..
లీసా ఒక వీడియో ఛాట్‌ బోట్‌. కృత్రిమ మేధస్సు, మెషీన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీలతో రూపొందించాం. అవసరం మేరకు ఎవరైనా ఫోన్‌ లేదా పీసీలో ఛాట్‌ బోట్‌ని యాక్సెస్‌ చేయొచ్చు. ఫోన్‌లో వాడదాం అనుకుంటే యాప్‌ రూపంలో ఇన్‌స్టాల్‌ చేసుకుని వాడొచ్చు. డెస్క్‌టాప్‌ కంప్యూటర్లలో వెబ్‌ రూపంలో సర్వీసుని పొందే వీలుంది. ఫోన్‌ లేదా పీసీలో లీసా ‘టెర్మ్స్‌ అండ్‌ కండిషన్స్‌’ని ఓకే చేసి వీడియో ఛాట్‌ రూపంలో మాట్లాడొచ్చు. ఉదాహరణకు పైన చెప్పుకున్నట్టుగా బ్యాంకులో మీకేదైనా సమస్య వస్తే హెల్ప్‌డెస్క్‌ టేబుల్‌ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఎవరూ ఎండరు. టేబుల్‌పైన స్టాండ్‌కి ఫోన్‌ లేదా ట్యాబ్‌  ఉంటుంది. ముందు కూర్చుంటే చాలు. లీసా యాక్టివేట్‌ అవుతుంది. ‘ఎలా ఉన్నారంటూ.. కుశల ప్రశ్నలు వేస్తుంది..’ ఇంకేముందీ.. రిలాక్స్‌డ్‌గా కావాల్సిన సమాచారాన్ని అడగొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని