అంకుర ‘స్పేస్‌’ లాంగ్వేజ్‌

ఐడియా వచ్చింది..  ఆచరణ సాధ్యం అనిపించింది.. అంకురంగా మలిచారు.. ఇన్వెస్టర్లు వచ్చారు..  బాధ్యత కలిగిన బృందాన్ని కూర్చారు.. ఇక కలిసి పని చేయాలి? అందుకో ప్రత్యేక ‘స్పేస్‌’ కావాలి! దానికి ఎలా ప్లాన్‌ చేయాలి? హాస్టల్‌ గదిలోనో.. షేరింగ్‌ రూమ్‌లోనో.. పుట్టిన ఆలోచన. పగటి కల అనుకుని వదిలేయలేదు. దాంట్లో భవిష్యత్తుని చూశారు.

Published : 15 Jun 2019 00:25 IST

స్టార్టప్‌ కోచ్‌

ఐడియా వచ్చింది..  ఆచరణ సాధ్యం అనిపించింది.. అంకురంగా మలిచారు.. ఇన్వెస్టర్లు వచ్చారు..  బాధ్యత కలిగిన బృందాన్ని కూర్చారు.. ఇక కలిసి పని చేయాలి? అందుకో ప్రత్యేక ‘స్పేస్‌’ కావాలి! దానికి ఎలా ప్లాన్‌ చేయాలి?

హాస్టల్‌ గదిలోనో.. షేరింగ్‌ రూమ్‌లోనో.. పుట్టిన ఆలోచన. పగటి కల అనుకుని వదిలేయలేదు. దాంట్లో భవిష్యత్తుని చూశారు. ఎంతో కష్టపడి ఓ రూపాన్నిచ్చారు. అంకుర సంస్థని చేశారు. బిజినెస్‌ మొదలయ్యింది. యూజర్‌ బేస్‌ పెరుగుతోంది. కలలు నిజమవుతున్న తరుణం.. వినియోగదారులకు మరింత దగ్గరవ్వాలనే తపన. అప్పుడే.. ‘మనకో ఆఫీస్‌ ఉంటే బాగుంటుంది కదా!’ అనే ఆలోచన మొదలవుతుంది. అత్యంత క్లిష్టమైన స్థితి. ధైర్యంగా ముందడుగు వేసే ముందు.. ఆలోచించాలి. సుదీర్ఘ ప్రయాణం చేయాలనుకున్నప్పుడు సౌకర్యవంతమైన సీటు రిజర్వు చేసుకోవాలి. తొందర పడితే జర్నీ మధ్యలోనే ఆగిపోవచ్చు. విశాలవంతమైన క్యాబిన్‌లు ఉంటే సరిపోదు.. దాంట్లోకి ఆలోచనలకు ఆయువు పోసే వాయువులు రావాలి.. అందుకు ఏం చేయాలి? మీదైన ‘స్పేస్‌’ లాంగ్వేజ్‌ని రాయాలి. అప్పుడే అంకుర సంస్థకి కావాల్సిన ఆఫీస్‌ బేసిక్స్‌ తెలుస్తాయి.

మిగులు ఎంత?
సింగిల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్‌లోనో... చిన్న గదిలోనో అప్పటి వరకూ సాఫీగా సాగిన స్టార్టప్‌ ప్రయాణం ఫ్రొఫెషనల్‌గా సాగేందుకే కార్యాలయం అవసరం. కానీ, దీనికి బడ్జెట్‌ కావాలి. మీకున్న బడ్జెట్‌ ఎంత? లెక్కగట్టండి. ఇంటర్నెట్‌, టెక్నాలజీ, టీమ్‌ ఖర్చులు, జీతాలు, ఇతర అవసరాలు.. అన్నింటికీ నెలకి మీకెంత ఖర్చు అవుతుంది? ఆ ఖర్చు మొత్తాన్ని మీకు నెలకొచ్చే ఆదాయంతో పోల్చండి. ఎంత మిగులో అదే మీ బడ్జెట్‌. దానితోనే ఆఫీస్‌ ప్రణాళిక రూపొందించాలి.

 

వినియోగదారుల సౌకర్యం
అంకురానికి యూజర్‌ బేస్‌ ఆధారంగానే విలువ పెరుగుతుంది. అందుకే వినియోగదారుల కోణం నుంచి ముందు ఆలోచించాలి. మీరు ఎంపిక చేసుకునే కార్యాలయం వారికి అనుకూలమైందేనా? మిమ్మల్ని చేరుకునేందుకు ఎంత దూరం ప్రయాణించాలి?... ఇలా విశ్లేషించాలి. దాహరణకు మీదో ఫ్యాషన్‌ స్టార్టప్‌ అయితే.. మీ ఆఫీస్‌ యువత హ్యాంగ్‌ అవుట్స్‌కు వెళ్లే ప్రదేశాలకు దగ్గర్లో ఉండాలన్నమాట.

మీ అవసరాలేంటి?
బడ్జెట్‌ అనుకున్నాక.. మీ అవసరాలేంటి? ఆఫీస్‌ స్పేస్‌లో మీరు కోరుకునే వసతులు ఏవి? పార్కింగ్‌ స్పేస్‌ ఉందా? లిఫ్ట్‌ సేవలు ఉన్నాయా? ట్రాన్స్‌పోర్టుకి అనుకూలమేనా?.. ఇలా మీకు, మీ బృంద సభ్యులకు తగిన సౌకర్యాలు ఉన్నాయా? లేదా? చెక్‌ చేసుకోవాలి. అంతేకాదు.. మీరు ఎంపిక చేసుకున్న ప్రాంతం కళాత్మకమైన అంశాలకు నిలయమై ఉండాలి. అప్పుడే మీ లాంటి అభిరుచి కలిగిన వారు మీతో జతకలిసేందుకు వీలుంటుంది.

ఎదుగుదల ఎంత?
ఉన్నచోటు నుంచి ప్రత్యేక హబ్‌కు మారాలనుకోవడం మంచిదే. అయితే, పని వాతావరణంలో మార్పుతో పాటు స్టార్టప్‌ ఎదుగుదల ఎంత? అందుకు తగిన ప్రణాళికతోనే కొత్త వర్క్‌ స్పేస్‌లో అడుగు పెట్టాలి. బృందం లక్ష్యం అదే అయ్యుండాలి. అప్పుడే మంచి ఫలితాలు చూడొచ్చు.

తగ్గడం నెగ్గడానికే..
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలియాలి. అప్పుడప్పుడే నడక నేర్చుకునే అంకురానికి మితిమీరి కల్పించుకునే వనరులు అవరోధంగా మారతాయి. ముగ్గురు మాత్రమే పని చేస్తున్న స్టార్టప్‌కి 20 మందికి సరిపడే ఆఫీస్‌ అక్కర్లేదు. ఐదుగురికి స్థలం ఉంటే చాలు.

మార్కెట్‌నీ ఫాలో అవ్వాలి
మీ బడ్జెట్‌లోనే కార్పొరేట్‌ వాతావరణంలో పని చేసుకునేలా ‘వర్క్‌ స్పేస్‌’లు అందుబాటులోకి వచ్చాయి. వారం, నెల, రోజుకి అద్దె చెల్లించి ఇక్కడ పని చేసుకోవచ్చు. ఇవి ‘టెంపరరీ రెంటల్‌ స్పేస్‌లు’. కావాలంటే.. ఒకే ఆఫీస్‌ని ఇరువురు పంచుకునేలా ‘షేర్డ్‌ ఆఫీస్‌ స్పేస్‌’లు ఉన్నాయి. ఉదాహరణకు మీది ఫొటోగ్రఫీ రంగానికి సంబంధించిన అంకురమైతే మీరు వెడ్డింగ్‌ ప్లానర్‌ స్టార్టప్‌లతో ఆఫీస్‌ని పంచుకోవచ్చు. దీంతో ఖర్చు కలిసొస్తుంది.

హంగులు అవసరమా?
అంకుర సంస్థలు అనగానే ఇంటీరియర్‌ డిజైన్లతో ఆకట్టుకుంటాయి. ఫ్యాన్సీ లుక్‌తో కట్టిపడేస్తాయి. సోఫాసెట్‌లు, బీమ్‌ బ్యాగులు, కాఫీ టేబుళ్లు.. ఇలా కార్పొరేట్‌ లుక్‌లో ఉన్నవి అన్నీ ఓ మోస్తరుగా పేరుగాంచినవే. పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్టుగా.. మీరూ అదే స్థాయిలో ఉండాలనుకుంటే పొరబాటే. మీ అంకుర స్థితికి తగినట్టుగా రూపకల్పన చేసుకోవాలి.

మీదైన ప్రత్యేకత అనివార్యం
కార్యాలయాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు డబ్బే ఖర్చు చేయక్కర్లేదు. మీ సృజనాత్మకతను ఖర్చు చేయండి. బృంద సభ్యులంతా కలిసి కళాత్మకమైన ఆలోచనలతో అలంకరణ చేయొచ్చు. అందుకు తగిన ఆలోచనలను బృందం నుంచి సేకరించి మీ లక్ష్యాలకు ప్రేరణ కలిగించేలా రూపుదిద్దుకోవచ్చు.

‘హోమ్లీ’ అయితే మంచిదే..
క్యాంపస్‌లోనో.. కార్పొరేట్‌ ఉద్యోగం చేస్తూనో.. రూపు దాల్చిన అంకురాలకు ‘హోం ఆఫీస్‌’లు ఎంతో సురక్షితం. మొదటి ప్రయత్నంలో ఇంటి వాతావరణాన్నే ఆఫీస్‌గా మలుచుకుని పని చేస్తే అదనపు ఖర్చుల్ని నివారించొచ్చు. ఓ చిన్న గ్యారేజీలో ప్రారంభమైన ఫేస్‌బుక్‌ స్టార్టప్‌ అందుకు ఉదాహరణ.

- కోటిరెడ్డి సరిపల్లి, కేజీవీ గ్రూపు ఛైర్మన్‌

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు